TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వర్క్ ప్లేస్ సమానత్వం.. ఐటీ కంపెనీల తీరు!

Published on: Thu Apr 16, 2026 12:47PM

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మగా నిలిచే ఐటీ రంగం ప్రస్తుతం  క్లిష్టమైన సమస్యను ఎదుర్కొంటోంది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు తమ కార్యాలయాల్లో  పని ప్రదేశంలో సమానత్వం కొరవడిందని, మత ప్రాతిపదికన వివక్ష జరుగుతోందని సోషల్ మీడియాలో గళమెత్తుతున్నారు. ఇది కేవలం ఒక సంస్థకో లేదా ఒక ప్రాంతానికో పరిమితమైన విషయంగా కాకుండా,  దేశవ్యాప్తంగా ఉన్న వివిధ టెక్ దిగ్గజ సంస్థల ఉద్యోగుల నుండి ఇటువంటి ఆరోపణలు రావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  ప్రముఖ ఐటీ సంస్థలైన టీసీఎస్ కోల్ ‌కతా, టెక్ మహీంద్రా గోరేగావ్, హుబ్లీలోని ఇన్ఫోసిస్  కార్యాలయాల్లో పక్షపాత ధోరణులు ఉన్నాయని ఉద్యోగులు చెబు తున్నారు.  ప్రధానంగా ప్రార్థన సమయాల్లో వెసులుబాటు, సెలవుల మంజూరు, మతపరమైన చిహ్నాల ధారణ వంటి విషయాల్లో అసమాన నిబంధనలు ఉన్నాయని చెబుతున్నారు.

  గుర్గావ్ లోని విప్రో,  హైదరాబాద్ లోని ఎల్ అండ్ టీ వంటి సంస్థల ఉద్యోగుల నుంచి కూడా దాదాపు  ఇలాంటి పోస్టులే దర్శనమిస్తున్నాయి. అయితే, ఇవి పూర్తిగా ఉద్యోగుల వ్యక్తిగత అనుభవాలే తప్ప, సంస్థల నుంచి ఎటువంటి అధికారిక వివరణలు రాలేదు. భారత రాజ్యాంగం, కార్మిక చట్టాల ప్రకారం పని ప్రదేశాల్లో మత, కుల, లింగ వివక్ష చూపడం చట్టవిరుద్ధం. అయినప్పటికీ, మేనేజ్ ‌మెంట్ స్థాయిలో పర్యవేక్షణ లోపం,  హెచ్.ఆర్  విభాగాల ఉదాశీనత  వల్ల క్షేత్రస్థాయిలో సమస్యలు తలెత్తుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

పారదర్శకమైన విచారణ వ్యవస్థ లేకపోవడం ఉద్యోగులలో అసంతృప్తిని మరింత పెంచుతోంది. ఈ పరిస్థితులపై న్యాయ నిపుణులైతే..  కంపెనీలు తక్షణమే అంతర్గత తనిఖీలు చేపట్టాలని సూచి స్తున్నారు. వివక్ష పట్ల జీరో టాలరెన్స్ పాలసీని కఠినంగా అమలు చేయడంతో పాటు, ఉన్నతాధికారులకు పక్షపాత రహిత శిక్షణ ఇవ్వడం అవసరమని అంటున్నారు. ఉద్యోగుల ఫిర్యాదులను గోప్యంగా ఉంచి పరిష్కరించే వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.

దాదాపు 50 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తూ, వందల బిలియన్ డాలర్ల ఎగుమతులు చేస్తున్న ఐటీ రంగం ప్రతిష్టకు ఇటువంటి ఆరోపణలు ముప్పుగా పరిణమించవచ్చు. పని ప్రదేశాల్లో విభజన ధోరణులు పెరిగితే అది ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపడమే కాకుండా, అంతర్జాతీయ క్లయింట్ల వద్ద భారత కంపెనీల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి, భవిష్యత్తులో ఐటీ పరిశ్రమ   వృద్ధిని కొనసాగాలంటే సమానత్వం,  వృత్తి నైతికతను కాపాడటం అత్యంత కీలకం. 

-సీతారాం కంఠమనేని