ఆదిలాబాద్ లో ఉమన్ ట్రాఫికింగ్ కలకలం, నిందితుడు పోలీస్ కానిస్టేబుల్

 

మన దేశం లో పూట గడవక పొట్ట చేత పట్టుకుని ముంబై కో, లేక గల్ఫ్ కో వెళ్లే అభాగ్యులు కోకొల్లలు. అటువంటి వారిలో మహిళల పరిస్థితి మరీ అధ్వాన్నం. అన్ని అనుమతులు ఉండి సరైన ఉపాధి దొరికితే ఓకే, లేకపోతె ఏ వ్యభిచార గృహం లోనో వాళ్ళ బ్రతుకులు తెల్లారి పోతాయి. తాజాగా అటువంటి అభాగ్యురాలి గాధ ఒకటి వెలుగు చూసింది. తనకు ఉపాధి చూపించాలని గౌరుభాయ్ అనే మహిళను ఆదిలాబాద్ కు చెందిన బాధిత మహిళ ఆశ్రయించింది. ఈ విషయం తెలుసుకున్న పొలిసు కానిస్టేబుల్ హరిదాస్ తాను ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, మధ్యప్రదేశ్ లో ఒక ఉద్యోగం ఉందంటూ ఆమెకు ఒక అడ్రస్ ఇచ్చి ట్రైన్ ఎక్కించి పంపించాడు. ఐతే ఆ కానిస్టేబుల్ ఆమెను మధ్యప్రదేశ్ కు చెందిన లాల్ సేట్ అనే వ్యక్తికి ఇద్దరు మధ్యవర్తుల ద్వారా రూ.లక్ష 30 వేలకు అమ్మేశాడు. ఆ వచ్చిన సొమ్ములో బాధిత మహిళకు లక్ష 10 వేల రూపాయలను అప్పగించి మిగిలిన 20 వేల రూపాయలను తమలో తాము పంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే మధ్యప్రదేశ్ కు చేరుకున్న బాధిత మహిళ యజమాని పెట్టే చిత్రహింసలు భరించలేక తీవ్ర ఇబ్బందులు పడింది. కొద్దిరోజుల క్రితం ఆమె లాల్ సేట్ నుండి తప్పించుకుని పారిపోయింది. మరోవైపు బాధిత మహిళ తన ఇంటికి చేరుకోక పోవడంతో ఆమె తల్లిదండ్రులు తిర్యాణి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. దీనితో తిర్యానీ పోలీసులు కానిస్టేబుల్ హరిదాస్, మధ్యవర్తి వెంకట్, గౌరుభాయ్ అనే మహిళను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో బాధిత మహిళ తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం మొత్తం బట్టబయలైంది.