TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎంపీడీవో కాళ్లు పట్టుకున్న మహిళ.. వైసీపీ నేతల అరాచకం! 

Published on: Fri Jun 11, 2021 2:34PM

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అరాచకాలకు హద్దే లేకుండా పోతోంది. ఎన్ని విమర్శలు వస్తున్నా తమ తీరు మార్చుకోవడం లేదు. తమకు మద్దతుగా లేనివారికి ప్రభుత్వ పథకాలు అందించడం లేదు. అర్హులు అయినా సాయం అందకుండా కుట్రలు చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలైతే అప్లయ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. ప్రభుత్వ పథకాలు తమకు అందడంలేదని మొరపెట్టుకున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మీ దిక్కున్నచోట చెప్పుకోండంటూ వైసీపీ కార్యకర్తలు ప్రవర్తిస్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది. 

వాలంటీర్ల ద్వారానే వైసీపీ నేతలు వేధింపులు, కుట్రలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ మహిళ.. వైసీపీ నేతల అరాచకాలు భరించలేక ఎంపీడీవో కాళ్లపై పడింది. తమకు న్యాయం చేయాలని వేడుకుంది. నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలం, అప్పారావు పాలెంలో ఈ ఘటన జరిగింది. 

చెంచెమ్మ అనే మహిళ జగనన్న చేయూత పథకానికి అర్హురాలు అయినప్పటికీ.. ఇప్పటి వరకు ఆ పథకం నిధులు ఆమెకు అందలేదు. గ్రామ వాలంటీర్‌ను అడిగితే మా నాయకులు చెబితేనే జగనన్న చేయూత పథకం వస్తుందని లేకుంటే రాదని చెప్పారు. వైసీపీ నేతల దగ్గరకు వెళ్లినా వాళ్లు పట్టించుకోలేదు. దీంతో బాధిత మహిళ ఎంపీడీవో రాఘవేంద్రరావును కలిసి తన గోడును వెల్లబోసుకుంది. నాయకులను అడిగితే వేధిస్తున్నారని కాళ్లమీదపడి వేడుకుంది. దీనిపై స్పందించిన ఆయన గ్రామంలో విచారించి పథకం అందేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు.మహిళ ఎంపీడీవో కాళ్లపై పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.