TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

తహసీల్దార్ ఆఫీసు గేటుకు తాళిబొట్టు.. లంచం ఇవ్వలేక మహిళ నిరసన..

Published on: Wed Jun 30, 2021 7:39PM

ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు ఇవ్వనిదే ఏ పని జరగదని అంటారు. రెవిన్యూ పనులైతే ఛాన్సే ఉండదు. తహశీల్దార్ కార్యాలయం పని కావాలంటే పర్సు ఫుల్లుగా ఉండాల్సిందే. రెవిన్యూ అధికారుల తీరుపై ఎన్ని ఆరోపణలు వచ్చినా.. ఆ శాఖ సిబ్బందిలో మాత్రం మార్పు రావడం లేదు. రెవిన్యూ సిబ్బందికి అమ్యామ్యాలు ఇచ్చుకోలేక గతంలో కొంత మంది విరాళాలు సేకరించి నిరసన తెలిపారు. తాజాగా మంత్రి కేటీఆర్ సొంత జిల్లాలో  మహిళా రైతు వినూత్న రీతిలో నిరసన తెలిపింది. ఏకంగా తన తాళి బోట్టు తీసి తహసీల్దార్ కార్యాలయం గేటుకు కట్టింది. అది లంచంగా తీసుకుని తన సమస్యను పరిష్కరించాలని వేడుకుంది. 

రాజన్న సిరిసిల్ల మండలం రుద్రంగి మండలం తహసీల్దార్ కార్యాలయం గేటుకు తాళిబొట్టు కట్టి  మహిళ నిరసనకు దిగింది. మానాల గ్రామానికి చెందిన మంగకు సంబంధించిన భూమిని వేరేవారికి పట్టా చేశారని తహసీల్దార్ కార్యాలయం ముందు ఆమె బైఠాయించింది. తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నా భూమిని వేరే వాళ్లకు ఎలా పట్టా చేశారని ప్రశ్నించింది. తనకు న్యాయం చేయాలని, తన భూమి తనకు ఇవ్వాలని ఆ మహిళ కన్నీటి పర్యంతమైంది. వెంటనే తన పేరుపై పట్టా చేయాలని బాధితురాలు మంగ అధికారులను వేడుకుంది. అయినా అధికారులు స్పందించలేదు. దీనికి సంబంధించి అనేకసార్లు అధికారులను వేడుకున్నా పట్టించుకోలేదని అందుకే కార్యాలయం గేటుకు తన తాళిబొట్టు కట్టి నిరసన తెలుపుతున్నానని మంగ తెలిపింది. 

మహిళ తన మెడలో ఉన్న తాళిబొట్టును తీసి తహసీల్దార్ కార్యాలయం గేటుకు కట్టడం కలకలం రేపింది.మహిళకు తాళిబొట్టే మాంగల్యం అంటారు. లంచం కోసం తాళిబొట్టును కూడా తీసింది అంటే... అధికారులు ఆ మహిళను ఎంతగా వేధించారో అర్ధం చేసుకోవచ్చు. మహిళ నిరసనతో అధికారులు షాకయ్యారు. స్థానికులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ మహిళ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.