TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముఖ్య‌మంత్రికి ముద్దులే ముద్దులు.. వీడియో వైర‌ల్‌.. ఏమిటి సంగ‌తి?

Published on: Tue Nov 2, 2021 12:05PM

ముద్దుల ముఖ్య‌మంత్రి ఎవ‌రంటే తెలుగువాళ్లు ట‌క్కున స‌మాధానం చెప్పేస్తారు? ఇంకెవ‌రు జ‌గ‌న్‌రెడ్డినే అని. జ‌నాల‌కు జ‌గ‌న్ పెట్టిన‌న్ని ముద్దులు ఇంత వ‌ర‌కూ ఏ రాజ‌కీయ నాయ‌కుడూ పెట్టి ఉండ‌రు. ముఖ్య‌మంత్రి కాక‌ముందు.. ఓదార్పు యాత్ర‌, పాద‌యాత్ర‌లంటూ జ‌నం మ‌ధ్య‌కు వెళుతూ.. ముద్దుల వ‌ర్షం కురిపించేవారు. జ‌గ‌న్ ముద్దుల మీద‌.. విప‌రీత‌మైన ట్రోలింగ్ జ‌రిగేది. ముద్దుల‌పై మీమ్స్‌కైతే లెక్కేలేదు. అలా ముద్దుల ముఖ్య‌మంత్రిగా ముద్ర‌ప‌డిపోయారు జ‌గ‌న్‌రెడ్డి. అది వేరే విష‌యం అనుకోండి. తాజాగా, బెంగ‌ళూరులోనూ ఓ ముద్దుల ఎపిసోడ్ వైర‌ల్‌గా మారింది. అదేంటంటే...

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైపై తనకున్న అభిమానాన్ని ఓ మహిళ ముద్దుల రూపంలో ప్ర‌ద‌ర్శించింది. సీఎం తన ఇంటికి రావడంతో సంతోషంతో ఉబ్బిత‌బ్బిబ్బు అయింది. ఆ ఆనందం ప‌ట్టుకోలేక‌.. ముఖ్యమంత్రి చేతిపై ముద్దుల వర్షం కురిపించింది. ఈ స‌డెన్ రియాక్ష‌న్‌కి సీఎం బొమ్మై అవాక్క‌య్యారు. ఒకింత ఇబ్బంది కూడా ప‌డ్డారు. 

జనసేవక కార్యక్రమంలో భాగంగా సీఎం బొమ్మై బెంగళూరులోని గుట్టహళ్లి ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఇంటి ముందుకు వెళ్లగా.. సీఎంను చూసిన సంతోషంలో అక్కడున్న ఓ మహిళ బొమ్మై కుడిచేతిని పట్టుకుని పదే పదే ముద్దులు పెట్టింది. ఆమె ప్రవర్తనతో సీఎం ఇబ్బందికి గురయ్యారు. అక్క‌డున్న వారంతా అవాక్క‌య్యారు. ముఖ్య‌మంత్రి పక్కనే ఉన్న మంత్రి అశ్వథ్‌ నారాయణ.. ముద్దులు పెట్టిన ఆ మ‌హిళ‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం సరికాదంటూ వారించారు. ఆమె మాత్రం ఆయ‌న మాట‌లు ప‌ట్టించుకోకుండా.. త‌న ముద్దుల ప్రొగ్రామ్ కంటిన్యూ చేయ‌డమంతా వీడియోలో రికార్డ్ అయింది. సీఎం చేతిపై మహిళ ఆపకుండా ముద్దులు పెడుతున్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.