భర్త స్నానం చేయట్లేదని భార్య విడాకులు

 

భార్య భర్తల మధ్య మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకోవడం చూస్తుంటాం. భర్త కట్నం కోసం వేధిస్తున్నాడనో, తనని సరిగ్గా చూసుకోవట్లేదనో భార్య కోర్టు గడప ఎక్కడం సహజం. అయితే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ వింత ఘటన జరిగింది. తన భర్త రోజూ స్నానం చేయట్లేదన్న కారణంతో 23ఏళ్ల ఓ మహిళ విడాకులకు దరఖాస్తు చేసుకుంది. గతేడాది వీరికి వివాహం కాగా.. కొద్దిరోజులకే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో పరస్పర అంగీకారంతో ఫ్యామిలీ కోర్టులో ఇద్దరు విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తులో ఆమె పేర్కొన్న కారణమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సింధి కమ్యూనిటీకి చెందిన తన భర్త వరుసగా ఏడెనిమిది రోజులు స్నానం చేయడని, షేవింగ్ చేసుకోవడని దరఖాస్తులో ఆమె పేర్కొంది. శరీరం నుంచి దుర్వాసన వస్తుంటే పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటాడని తెలిపింది. అలాంటి వ్యక్తితో తాను ఉండలేనని అందుకే విడాకులకు దరఖాస్తు చేసుకుంటున్నట్టు తెలిపింది. దీంతో షాక్ కి గురైన కోర్టు.. వారిద్దరిని  ఆర్నెళ్ల పాటు వేరుగా ఉండాలని సూచించింది.

ఫ్యామిలీ కోర్టు కౌన్సిలర్ అవస్థి దీనిపై మాట్లాడుతూ.. 'ఈరోజుల్లో మహిళలు చిన్న చిన్న కారణాలకే విడాకుల దాకా వెళ్తున్నారు. భోపాల్‌కి సమీపంలోని బరిగర్‌కి చెందిన ఈ మహిళ.. తన భర్త స్నానం చేయకుండా పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటున్నాడన్న కారణంతో విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఆమె బ్రాహ్మణ కమ్యూనిటికీ చెందిన మహిళ. సింధి కమ్యూనిటీకి చెందిన అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇప్పుడు చిన్న కారణంతోనే విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఇంట్లో వాళ్లు ఎంత వద్దని చెప్పినా.. ఆమె వినలేదు. కోర్టు వారిద్దరిని ఆర్నెళ్ల పాటు వేరుగా ఉండాలని సూచించింది.' అని వివరించారు.