ఎక్కువ మంది పిల్లలను కనడం సరే.. మెటర్నిటీ లీవ్ సంగతేంటి?
Published on: Sat Mar 8, 2025 1:21PM
.webp)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపునిస్తున్నారు. తాను సంపద సృష్టించి ఆ సృష్టించిన సంపద ఫలాలను అందరికీ అందిస్తానని చెబుతున్నారు. అంతే కాకుండా జనాభా నియంత్రణను కచ్చితంగా పాటించిన కారణంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే పరిస్థితులు ఉండటం కూడా రాష్ట్రజనాభా వృదక్ధి కావాలనడానికి మరో కారణం. కేంద్రం కూడా జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాలకే అధిక కేటాయింపులు చేస్తున్నది. వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని గతంలోలా ఒక్కరు లేదా ఇద్దరు చాలు అన్న కుటుంబ సంక్షేమ నినాదానికి కట్టుబడి ఉండొద్దని చెబుతున్నారు. ఇందు కోసం స్థానిక సంస్థలలో పోటీకి గత నిబంధనలు మార్చి ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నవారే పోటీకి అర్హులన్న నిబంధన తీసుకువచ్చే యేచన కూడా చంద్రబాబు చేస్తున్నారు.
అయితే మహిళా ఉద్యోగులకు మెటర్నటీ లీవ్ విషయంలో మాత్రం ఇప్పటికీ గత నిబంధనలే అమలులో ఉన్నాయి. వాటిని సవరిస్తామన్న ప్రకటన ఏదీ వెలువడిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర హోంమంత్రి మహిళా పోలీసులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఓ మహిళా పోలీసు సంధించిన ప్రశ్న హోంమంత్రి అనితను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఆ కానిస్టేబుల్ ను చాలా మంచి ప్రశ్న అంటూ ప్రశంసించేలా చేసింది. ఇంతకీ ఆ మహిళ అడిగిన ప్రశ్న ఏమిటంటే..
ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలకే ప్రసూతి సెలవు ఇస్తున్నారు. మరి మూడో బిడ్డను కనేవారికీ ప్రసూతి సెలవులు ఇస్తారా?' అని. ఈ ప్రశ్నకు వంగలపూడి అనిత వద్ద సమాధానం లేదు. అయితే ఆ ప్రశ్న సంధించిన కానిస్టేబుల్ ను హోంమంత్రి అనిత ప్రశంసించారు. చాలా మంచి ప్రశ్న.. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెడతాను అని బదులిచ్చారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సందర్భాల్లో రాష్ట్రంలో ఎక్కువమంది పిల్లల్ని కనాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దేశ ప్రయోజనాల కోసం ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఇటీవలి కాలంలో పలు సందర్భాలలో చెప్పారు. ఈ నేపథ్యంలోనే మహిళా కానిస్టేబుల్ సంధించిన ప్రశ్న ప్రాధాన్యత సంతరించుకుంది.


