వృద్ధుడిపై కారం చల్లి.. రాడ్డుతో దాడి చేసిన కొడుకు, కోడలు
Published on: Tue Jun 4, 2019 4:54PM

తనకు జీవితాన్నిచ్చిన కన్నతండ్రి పట్ల ప్రేమ, దయ, బాధ్యతగా వ్యవహరించాల్సిన కొడుకు మానవత్వం మరిచాడు. భార్య, బావమరిదితో కలిసి తండ్రిపై కారం పొడి చల్లి ఇనుప రాడ్డుతో దాడి చేసాడు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి పట్టణంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి. తిరుపతి నగరంలోని అనంత వీధిలో నివసించే 88 ఏళ్ల వృద్ధుడు మునికృష్ణయ్యపై పెద్ద కొడుకు విజయ్ తన భార్య, బావమర్దితో కలిసి దాడి చేశాడు. తమకున్న రెండు సెంట్ల స్థలాన్ని అప్పుల కోసం మునికృష్ణయ్య విక్రయించాలనుకోవడమే కొడుకు ఆగ్రహానికి కారణమైంది. దీంతో విచక్షణ కోల్పోయిన కొడుకు కారం పొడి చల్లి, ఇనుప రాడ్డుతో తండ్రిపై దాడి చేశాడు. భార్య, బావమరిది సైతం అతడికి సహకరించారు. వృద్ధుడి ఆర్తనాదాలు విన్న స్థానికులు వివాదంలో జోక్యం చేసుకుని అతన్ని రక్షించి స్థానిక రుయా ఆసుపత్రికి తరలించారు. పండు ముసలి పట్ల కొడుకు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం స్థానికుల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై తిరుపతి పశ్చిమ పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



