యూట్యూబ్‌ చూసింది..ప్రాణం పోయింది..

సాంకేతికతని పరిజ్ణానం పెంచుకోటానికే ఉపయోగించాలిగాని,ప్రయోగం చేయాలి అనుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవ్వొచ్చు లేదా ప్రాణాలే పోవచ్చు.తమిళనాడులోని తిరుపూర్‌లో జూలై 22న జరిగిన ఓ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.తిరుపూర్‌లోని రత్నగిరీశ్వరనగర్‌కు చెందిన కృతిక,ఆమె భర్త ఇంటిలోనే యూట్యూబ్ వీడియోలను ఫాలో అవుతూ బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయించుకున్నారు.ఇందుకోసం యూట్యూబ్‌లో 'డెలివరీ సమయంలో ప్రెగెంట్ లేడీకి ఎలా సాయం అందించాలి’? అనే అంశానికి సంబంధించి పలు వీడియోలను చూశారు.

 

 

యూట్యూబ్ వీడియోలను చూసి.. వాటిలోని సూచనలు పాటించి ఇంట్లోనే బిడ్డకు జన్మనివ్వాలన్న ఆ దంపతుల వింత ఆలోచన కారణంగా పురిటి నొప్పులతో బాధపడుతూ,ప్రసవ వేదన అనుభవించిన ఆమె బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం తీవ్ర రక్తస్రావం కావడంతో మృతి చెందింది.పురిటి నొప్పులు 2గంటలకు మొదలైతే ఆమెను 3.30కు ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చారని.. అప్పటికే ఆమె బిడ్డకు జన్మనిచ్చి.. మరణించిందని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆమె భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కృతిక స్నేహితురాలు లావణ్య సహజ ప్రసవాలు చేస్తుండేది. ఆమె సూచనతోనే ఈ దంపతులు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.కృతిక ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది,ఆమె భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.వీరికి మూడు సంవత్సరాల వయసున్న పాప ఉంది.