అభినందన్ వీడియో వైరల్.. భారత్ మాతాకీ జై
Published on: Mon May 6, 2019 2:57PM

వింగ్ కమాండర్ అభినందన్ రెండు నెలల గ్యాప్ తరువాత విధుల్లో చేరారు. భారత్‌పైకి దండెత్తిన పాక్ యుద్ధ విమానాలను తరిమికొడుతూ.. ప్రమాదవశాత్తూ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి వెళ్లిపోయి పాక్ సైన్యానికి చిక్కి.. ఆ తర్వాత సగౌరవంగా భారత గడ్డపై అడుగుపెట్టిన వీరజవాన్‌గా అభినందన్ భారతీయులు గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
తాజాగా అభినందన్ తిరిగి విధుల్లో చేరారు. కశ్మీర్ లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ క్యాంప్ కు వెళ్లిన అభినందన్ కు.. తోటి ఆఫీసర్ లు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. అభినందన్ కూడా కాసేపు తన సహోద్యోగులతో సరదాగా గడిపారు. అక్కడున్నవాళ్లంతా.. ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి ఆసక్తి చూపారు. భారత్ మాతాకీ జై అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ధైర్యానికి మారుపేరైన అభినందన్.. తన సహచరులను ఉద్దేశించి స్ఫూర్తిదాయంగా మాట్లాడారు. ‘నేను క్షేమంగా తిరిగొచ్చానంటే.. జరిగిన పరిణామాల నుంచి వేగంగా కోలుకున్నానంటే.. అది మీ కుటుంబ సభ్యుల, కోట్లాది మంది భారతీయుల ప్రార్థనల ఫలితం’ అన్నారు. ‘నా కోసం ప్రార్థనలు చేసిన వారందరినీ నేను కలవలేకపోవచ్చు. ఈ ఫోటోలు నిజంగా మీ కుటుంబసభ్యుల కోసం. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.’ అని అభినందన్ పేర్కొన్నారు.


