పార్లమెంటులో టి.బిల్లు పెడతారా?

 

 

 

తెలంగాణ బిల్లు పార్లమెంటుకు ఎప్పుడు వస్తుంది ? అసలు ఈ శీతాకాల సమావేశాలలో తెలంగాణ బిల్లు ఉండబోతుందా? కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెబుతున్న దానిని బట్టి ఈ సమావేశాలలో తెలంగాణ బిల్లు ఉండడం కష్టమేనని తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాధ్‌ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేత సుష్మా స్వరాజ్ తెలంగాణ బిల్లు గురించి ప్రస్తావించారు.


రాష్ట్ర పునర్విభజన బిల్లును పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే ప్రతిపాదించాలని కోరారు. ఈ బిల్లు విషయంలో జాప్యం చేస్తే పర్యావసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. పన్నెండు రోజుల పాటు సాగనున్న శీతాకాల సమావేశాల అజెండాలో తెలంగాణ బిల్లుకు ఎందుకు స్థానం కల్పించలేదని ఆమె ప్రశ్నించారు. అయితే తెలంగాణ బిల్లుకు సంబంధించి పలు ప్రక్రియలు మిగిలిపోయాయని, విభజన విధివిధానాలను పరిశీలిస్తున్న కేంద్ర మంత్రుల బృందం నివేదిక సిద్ధమైన తర్వాత కేంద్ర మంత్రివర్గం దానిని పరిశీలించి ఆమోదించాల్సి ఉందని, ఆ తర్వాత రాష్ట్రపతికి నివేదించనున్న ముసాయిదా బిల్లును ఆయన రాష్ట్ర శాసనసభకు పంపాల్సి ఉంటుందని షిండే తెలిపారు. మరి ఈ లెక్కన తెలంగాణ బిల్లు తెరమరుగయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.