హుజూర్ నగర్ లో కనిపించని రేవంత్? కాంగ్రెస్ కు ఊహించని నష్టం తప్పదా.!

 

హుజూర్ నగర్ అభ్యర్ధి ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ లో చెలరేగిన మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. టీపీసీసీ ప్రెసిడెంట్ అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్య తలెత్తిన విభేదాలు, మనస్పర్ధలు ఇంకా సమిసిపోలేదు. దాంతో హుజూర్ నగర్ ప్రచారంలో రేవంత్ చప్పుడే వినిపించడం లేదు. హుజూర్ నగర్ అభ్యర్ధి ఎంపిక విషయంలో సీనియర్లంతా టార్గెట్ చేయడంతో.... రేవంత్ సైలెంట్ అయ్యారు. అదే సమయంలో తన మాటను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకుండానే, ఉత్తమ్ భార్య పద్మావతి పేరును అధిష్టానం ప్రకటించడంతో రేవంత్ అలకబూనినట్లు తెలుస్తోంది. అందుకే, రేవంత్ కనీసం హుజూర్ నగర్ వైపు కూడా చూడటం లేదంటున్నారు. 

ఒకవైపు టీఆర్ఎస్, బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుంటే, మరోవైపు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్స్ మాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా రేవంత్ ఇప్పటివరకు అస్సలు హుజూర్ ప్రచారంలో పాల్గొనలేదు. అసలు ప్రచారానికి వస్తాడో రాడో కూడా తెలియదు. ఇక, ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి కూడా హుజూర్ నగర్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దాంతో కాంగ్రెస్ ప్రచారంలో కొంత స్తబ్దత నెలకొందనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఎంతకాదన్నా, రేవంత్ రెడ్డి అంటే యూత్ లో యమ క్రేజుంది. రేవంత్ మాటలను, పంచ్ డైలాగులను వినేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తారు. అంతేకాదు రేవంత్ మాటలు జనాన్ని ఆలోచింపచేసేలా ఉంటాయ్. ఎంతకాదన్నా, రేవంత్ ప్రచారం చేశాడంటే, ఎంతోకొంత ఇంపాక్ట్ ఉండకమానదు. మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన హుజూర్ నగర్ ఉపఎన్నిక క్యాంపైయిన్ లో రేవంత్ ప్రచారం చేయకపోతే, అది కాంగ్రెస్ కు మైనస్ అయ్యే ప్రమాదముంది.

ఒకవైపు, టీఆర్ఎస్, బీజేపీ ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోకుండా, పంతానికి పోకుండా, అన్ని మార్గాలను వినియోగించుకుంటూ, మండల-గ్రామ-వార్డు స్థాయిలో ప్రచారానికి, మొత్తం బలగాన్ని రంగంలోకి దింపుతుంటే, సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ మాత్రం ఆ స్థాయిలో ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ ... కేంద్ర మంత్రులను సైతం రంగంలోకి దించి ప్రచారం చేయిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం కనీసం తెలంగాణ ముఖ్యనేతలతో కూడా ప్రచారం చేయించలేకపోతుందనే మాట వినిపిస్తోంది. మరి, ఉత్తమ్ చొరవ తీసుకుని రేవంత్ లాంటి లీడర్లను స్వయంగా ప్రచారానికి ఆహ్వానిస్తే, వివాదానికి తెరపడటమే కాకుండా, అది పార్టీకి కూడా మేలంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. మరి ఉత్తమ్-రేవంత్ ల్లో ఎవరో ఒకరు చొరవ తీసుకోకపోతే హుజూర్ నగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ కు ఊహించని నష్టం జరగడం ఖాయమేనంటున్నారు కార్యకర్తలు.