పీకే టీంతో టీడీపీ ఒప్పందం.. ప్రశాంత్ కిషోర్‌ హింట్ ఇచ్చారుగా!!

 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ టీంతో టీడీపీ ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలున్నాయంటూ నిన్నటి నుంచి వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత.. ప్రశాంత్ కిషోర్‌ ను సంప్రదించాలని టీడీపీకి చెందిన పలువురు నేతలు చంద్రబాబుకు సలహా ఇచ్చారని తెలుస్తోంది. నేతల సలహాపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు.. పీకే టీంతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు ప్రచారం జరిగింది.

ఇదే విషయమై తాజాగా ఓ మీడియా ప్రతినిధి ప్రశాంత్ కిషోర్‌ ని ప్రశ్నించగా.. 'వైసీపీతో నా ఒప్పందం ముగిసింది, ఒకవేళ టీడీపీ వచ్చి ఐప్యాక్ ని సంప్రదిస్తే ఎవరు ఆపగలరు?' అంటూ బదులిచ్చినట్లు తెలుస్తోంది. అంటే తన సంస్థ ఐప్యాక్ టీడీపీతో పనిచేయడానికి కూడా సిద్దమే అని ప్రశాంత్ కిషోర్‌ చెప్పకనే చెప్పారన్నమాట.
 
అయితే, ప్రశాంత్ కిషోర్‌ను టీడీపీ సంప్రదించినట్లు వస్తున్న వార్తలు అన్నీ పుకార్లేనని టీడీపీ నేత సీఎం రమేష్ అంటున్నారు. అసలు తాము ఇంతవరకూ ఎవర్నీ సంప్రదించలేదని ఆయన అన్నారు. కొందరు పనిగట్టుకుని ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీ కార్యకర్తలు ఎవరు కూడా ఆ విషయాన్ని నమ్మవద్దని సీఎం రమేష్ కోరారు.

ప్రశాంత్ కిషోర్‌ వ్యాఖ్యలకు, సీఎం రమేష్ వ్యాఖ్యలకు అసలు ఎక్కడా పొంతన లేదు. మరి టీడీపీ నిజంగానే పీకే టీంని సంప్రదిస్తుందా? ఆ టీంతో ఒప్పందం కుదుర్చుకుంటుందా? తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.