TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

2027 వరల్డ్ కప్ ఆడతా.. కుండబద్దలు కొట్టిన కోహ్లీ

Published on: Sat May 16, 2026 12:59PM

భారత క్రికెట్ దిగ్గజం, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తన భవిష్యత్తుపై..  ముఖ్యంగా 2027 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడటంపై జరుగుతున్న చర్చలపై మొదటిసారి బహిరంగంగా స్పందించాడు. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో..  క్రీడా వర్గాల్లో విరాట్ కోహ్లీ రాబోయే వన్డే ప్రపంచకప్‌లో ఆడతాడా లేదా అన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో కోహ్లీ నోరు విప్పారు.  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అధికారిక పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన క్రికెట్ కింగ్ కోహ్లీ.. తన కెరీర్, ఫిట్‌నెస్,  భవిష్యత్తు ప్రణాళికలపై  స్పష్టత ఇచ్చాడు. తాను ఇప్పటికే దేశం కోసం ఎన్నోసార్లు తన అంకితభావాన్ని నిరూపించుకున్నానని.. ప్రతిసారీ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నాడు.

టీ20 వరల్డ్‌కప్ 2024 చారిత్రాత్మక విజయం తర్వాత అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన కోహ్లీ..  ఆ తర్వాత టెస్ట్ క్రికెట్ నుంచి కూడా తప్పుకున్నాడు.  ప్రస్తుతం టీమిండియా తరఫున కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్న కింగ్ కోహ్లీ,  తన క్రికెట్ ప్రయాణంపై ఇప్పుడు పూర్తి స్పష్టతతో ఉన్నట్లు పేర్కొన్నాడు. తాను జట్టులో ఉన్నప్పుడు జట్టుకు   విలువను జోడించగలనన్న కోహ్లీ..  ఆ ప్రాధాన్యతను యాజమాన్యం  గుర్తిస్తేనే తాను అక్కడ ఉంటానని కుండబద్దలు కొట్టేశాడు.  అలా కాకుండా కేవలం ప్రతి సిరీస్‌లోనూ   అర్హతను,   విలువను మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తే.. అక్కడ ఉండటానికి తాను ఇష్టపడనని స్పష్టం చేశాడు.   సంసిద్ధత, శ్రమ విషయంలో తాను ఎప్పుడూ నిజాయితీతో ఉంటాన్న కోహ్లీ, తన సుదీర్ఘ కెరీర్‌లో ఎప్పటిలాగే ఇప్పటికీ అదే స్థాయి కఠినమైన క్రమశిక్షణతో శ్రమిస్తున్నానన్నాడు. 

మైదానంలో జట్టు కోసం వన్డే మ్యాచ్‌లో 40 ఓవర్ల పాటు బౌండరీ లైన్ నుంచి బౌండరీ లైన్‌కు పరుగెత్తమన్నా తాను సిద్ధమేనన్నాడు.  ఎందుకంటే ఆ స్థాయి ఫిట్‌నెస్‌ను తను నిరంతరం కాపాడుకుంటూనే ఉంటానన్నాడు. ప్రతి బంతినీ తన కెరీర్‌లో చివరి బంతిలా భావిస్తూ ఆడతానని, జట్టు విజయానికి అవసరమైన ప్రతి పనిని వంద శాతం అంకితభావంతో  చేస్తానన్న విరాట్ కోహ్లీ..  ఇంతగా శ్రమించిన తర్వాత కూడా తన సత్తాను ప్రతిసారీ ప్రశ్నిస్తూ నిరూపించుకోమంటే అది జరిగే పని కాదన్నాడు.  

  2027 వన్డే వరల్డ్‌కప్ లో ఆడటం గురించి కూడా  కోహ్లీ   మాట్లాడాడు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌లో వన్డేలకు ప్రాధాన్యత తగ్గుతోందనే నెపంతో తనపై అనుమానాలు రేకెత్తించడం సరికాదన్నాడు. ఒకవేళ తనకు భారత్ తరఫున వరల్డ్‌కప్ ఆడాలనే కోరిక లేకపోతే, తన కుటుంబాన్ని, ఇంటిని వదిలి ఇన్ని గంటల పాటు మైదానంలో ఎందుకు చెమటోడుస్తానని ప్రశ్నించాడు. దేశం తరఫున ఆడటం ఎప్పుడూ ఒక గొప్ప గౌరవమేనని, అయితే ఆ గౌరవం,   విలువ రెండు వైపులా సమానంగా ఉండాలన్నాడు. 

ఇటీవల దేశీవాళీ క్రికెట్‌లో భాగంగా ఢిల్లీ తరఫున విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన అనుభవాన్ని కూడా కోహ్లీ ఈ సందర్భంగా పంచుకున్నాడు. ఆ టోర్నీలో కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే ఒక  సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో 208 పరుగులు చేసి తానేంటో మళ్లీ చాటుకున్నాడు. దేశీయ క్రికెట్ ఆడటం వల్ల తనలో క్రికెట్‌పై ఉన్న స్వచ్ఛమైన ఆనందం, చిన్ననాటి ఉత్సాహం మళ్లీ గుర్తికొచ్చాయన్నాడు. అక్కడ ఎలాంటి అంతర్జాతీయ ఒత్తిళ్లు, హడావుడి లేదని, కేవలం బ్యాటింగ్‌ను ఆస్వాదించడం కోసమే ఆడానని చెప్పాడు.  ఒకవేళ తాను జట్టుకు సరిపోనని భావిస్తే మొదటి రోజే ముఖం మీదే చెప్పాలని, అంతేగానీ అవసరం ఉన్నప్పుడు వాడుకుని, ఫలితాల ఆధారంగా ప్రతిసారీ అభిప్రాయాలు మార్చుకోవడం కరెక్ట్ కాదని కోహ్లీ ఉద్వేగభరితంగా చెప్పాడు.