జగన్, పవన్ ని కలిపే బాధ్యత కేటీఆర్ దేనా?

 

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కావడంతో.. వైసీపీ, టీఆర్ఎస్ పార్టీల దోస్తీ ఆఫీసియల్ అయినట్లు అయింది. మొన్నటివరకు పరోక్షంగా మద్దతు ఇచ్చుకున్న పార్టీలు ఇక నుంచి ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చుకోనున్నాయి. ముఖ్యంగా రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీలు కలిసి పనిచేయనున్నాయి. పేరుకి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని టీఆర్ఎస్, వైసీపీ దగ్గరయ్యాయని చెప్తున్నా.. నిజానికి ఆ రెండు పార్టీల ప్రధాన లక్ష్యం ఏపీలో చంద్రబాబుని గద్దె దించడం. చంద్రబాబుని ఓడించాలనే ప్రధాన అజెండాతోనే ఈ రెండు పార్టీలు దగ్గరయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొందరు టీడీపీ నేతలైతే ఈ పార్టీలను బీజేపీ వెనుకనుంచి ఆడిస్తుందని ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇదంతా సరే మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి?. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చిన పవన్ తరువాత టీడీపీకి దూరమయ్యారు. చంద్రబాబు మీద, లోకేష్ మీద, ఇతర టీడీపీ నేతల మీద తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఓ రకంగా చంద్రబాబుని గద్దె దించాలని జగన్ ఎలా టార్గెట్ పెట్టుకున్నారో.. పవన్ కూడా అలానే టార్గెట్ పెట్టుకున్నారు. మరి ఈ కామన్ టార్గెట్ జగన్, పవన్ లను దగ్గర చేస్తుందా? అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కేటీఆర్, జగన్ భేటీ సందర్భంగా పవన్ గురించి కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో చంద్రబాబుని ఓడించాలంటే పవన్ మద్దతు కూడా తోడవ్వాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై జగన్ తన స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించనప్పటికీ.. కొందరు వైసీపీ నేతలు మాత్రం పవన్ తో పొత్తుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. భేటీ సందర్భంగా కేటీఆర్ కూడా జగన్ తో.. పవన్ ని కలుపుకొనిపోతే చంద్రబాబుని ఓడించడం సులభమని సూచించినట్లు సమాచారం. అంతేకాదు పవన్ ని ఎలా ఒప్పించాలో తనకు తెలుసునని.. పవన్ ని ఒప్పించి చంద్రబాబుని ఓడించడానికి అందరూ కలిసి పనిచేసేలా చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ.. ఇదే నిజమైతే.. తెలంగాణలో టీఆర్ఎస్ ని ఓడించడానికి విపక్షాలన్నీ కూటమిగా ఏర్పడినట్లు ఏపీలో టీడీపీని ఓడించడానికి కూడా కూటమి ఏర్పడడం ఖాయం. చూద్దాం మరి ఏం జరుగుతుందో.