ఏపీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం.. ఏపీ బరిలో తెరాస కూడానా?

ఓ వైపు ముందస్తుతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన కేసీఆర్.. మరోవైపు ఏపీలో కూడా ఎన్నికలకు ఎనిమిది నెలల ముందే హీట్ పెంచుతున్నారు.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కేసీఆరే హాట్ టాపిక్ అయ్యారు.. ఓ వైపు అసెంబ్లీ రద్దు, 105 మంది అభ్యర్థుల ప్రకటనతో తెలంగాణ ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చిన కేసీఆర్.. ఏపీలోని పార్టీలకు కూడా షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.. కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఏపీలో ప్రచారం చేయబోతున్నట్టు సమాచారం.. కొన్ని రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారానికి వెళతానని కేసీఆర్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.. ఆ మేరకు కేసీఆర్ ఏపీలో వైసీపీ తరుపున ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

 

 

చాలాకాలం నుండి వైసీపీతో, తెరాసకు సత్సంబంధాలు ఉన్నాయి.. తెలంగాణలో వైసీపీ కాంట్రాక్టర్లు పనులు కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. దీంతో కేసీఆర్ ఏపీలో ఎన్నికల వార్తలకు బలం చేకూరుతుంది.. అయితే కొందరు మాత్రం 'చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్న నేపథ్యంలో.. బాబుకి బ్రేకులు వేసేందుకే కేసీఆర్ ఏపీలో ఎన్నికల ప్రచారానికి వస్తారన్న ప్రచారానికి తెరలేపినట్టు' భావిస్తోన్నారు.. ఈ ప్రచారంతో బాబుని భయపెట్టి, తెలంగాణలో ప్రచారానికి వెళ్లకుండా నిలువరించటమే అసలు లక్ష్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

 

మరికొందరు మాత్రం కేసీఆర్ ఏపీలో ప్రచారం వార్త నిజమే.. బీజేపీ ఆదేశాల ప్రకారమే కేసీఆర్, జగన్ సహకరించడానికి సిద్ధమయ్యారని అంటున్నారు.. టీడీపీని టార్గెట్ చేసిన బీజేపీ కేసీఆర్ అనే అస్త్రాన్ని సిద్ధం చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. అయితే ఇక్కడ మరో షాకింగ్ న్యూస్ కూడా వినిపిస్తోంది.. తెరాస వచ్చే ఎన్నికల్లో ఏపీలో కొన్ని స్థానాల్లో బరిలోకి దిగాలని భావిస్తోందట.. పశ్చిమ గోదావరి, విజయనగరం, కృష్ణా జిల్లాలలో తెరాస కొంతమంది అభ్యర్థులను నిలిపే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.. తెలంగాణ కేంద్రంగా వ్యాపారాలు చేస్తున్న కొందరు తమకు తెరాస టిక్కెట్లు కావాలని కోరుతున్నట్టు సమాచారం.. ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ.. కేసీఆర్ నిజంగా ఏపీలో వైసీపీ తరుపున ప్రచారం చేస్తారా?.. ఏపీలో తెరాస తరుపున కొందరు అభ్యర్థులు బరిలోకి దిగుతారా? ఇవి తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.