సాష్టాంగపడతారా? సాధించుకువస్తారా? మోడీతో జగన్ భేటీపై ఉత్కంఠ
Published on: Thu Jun 2, 2022 6:00PM
బడికి వెళ్లే పిల్లాడు కొంత ధైర్యంగానే వెళతాడు. కూలీవాడు పనికాగానే సేట్ డబ్బులిస్తాడనే ధైర్యంతో వెళతాడు. ఆటగాళ్లు పతకం తేగలననే పోటీలకి వెళతాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌రెడ్డి మాత్రం ఢిల్లీకి కాస్తంత అనుమానం, భయంతోనే వెళ్లా రనే అనాలి. ముఖ్యమంత్రి హోదాలో నిటారుగా నిలిచి ప్రధానిని తమ రాష్ట్రానికి రావలసినవాటి గురించి అడగ్గలగాలి. ప్రధాని మోడీ దగ్గరకి వెళ్లడం వరకూ సరే. ఆయన చెప్పింది అంచక్కా విని వెనక్కి వచ్చేస్తేనే ఇబ్బంది. అదే జరుగుతుందన్న అనుమానాలు ఇప్పటికే వ్యక్తం అవుతున్నాయి.
అయితే, తనకు, బిజెపి ప్రభుత్వానికి లబ్ధిచేకూరే అంశాలు తన వద్దనే వున్నాయని, వాటిని పెద్దాయన ముందు ప్రస్థావించి తనకు కావలసినవి రాబట్టుకోవడానికి ఎంతో వీలుందన్నది వైఎస్ఆర్ పార్టీ వారు, మంత్రుల మాట. ఇది ఎంతవరకూ వాస్తవరూపంలో చూడగలమన్నది ప్రశ్నార్ధకంగా వుంది.
జగన్ ఈ సమయంలో ప్రధానిని వెళ్లి కలవడం వెనుక చాలా కథ వుందని విపక్షాల మాట. జగన్ తన మీదున్న కేసుల వుచ్చునుంచి ఎలాగయినా బయటపడేయమని అడిగేందుకే ఎక్కువ అవకాశాలు న్నాయి. అందుకు ఇది తగిన సమయం. రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి నిలబెట్టిన అభ్యర్ధికి గట్టి మద్దతు లభించాలంటే జగన్ పార్టీ ఎంపీలు పూనుకోవాలి. ఈ అంశంలో ప్రధానిని ఎలాగయినా ట్రాప్ చేసి ఇతర అంశాల్లో ఆగ్రహించ కుండా చేసుకోవడానికి ఎంతో అవకాశం వుంది. రాష్ట్రానికి రావలసిన బకాయిలు, ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ సాధించడానికి జగన్ తప్పకుండా తన ఎంపీల మద్దతు అంశాన్ని అస్త్రంగా వాడవచ్చు.
గతంలో వెళ్లి రావడమే అయింది. అక్కడ ఏమి జరిగింది? ఏమి చర్చించారన్న అంశాలు రాష్ట్రంలో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. కారణం జగన్ కనీసం విలేకరులతోనూ ఎప్పుడూ మోడీతో చర్చల అంశాన్ని చెప్పలేదు. అది ఒక బ్రహ్మ రహస్యంగానే దాచేశారు. కానీ ఈ సారి మోడీతో జగన్ భేటీపై ఏపీ ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి జగన్ కేవలం తన కేసుల గురించి మాట్లాడి, కాళ్లావేళ్లాపడి, బతిమిలాడు కోవడంతోనే సరిపెట్టేస్తారా? లేక రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రానికి తన అవసరాన్ని చూపి రాష్ట్రానికి రావల్సిన పోలవరం బకాయిలు, కడపలో స్టీల్‌ప్లాంట్ సాధన వంటి అంశాలపై పట్టుబడతారా అన్నది చూడాలి. రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీకి తాను నిలబెట్టిన అభ్యర్థిని సొంతంగా గెలిపించుకునేంత బలం లేదు. అనివార్యంగా జగన్ పార్టీ వంటి ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరం. దానిని తన బలంగా భావించి మోడీ వద్ద రాష్ట్ర డిమాండ్లను ప్రస్తావించేంత సీన్ జగన్ కి వుందా అన్నది పరిశీలకులు వ్యక్తం చేస్తున్న అనుమానం.
ఎందుకంటే తనపై ఉన్న కేసుల విచారణ సాగుతుండటం, దర్యాప్తు సంస్థలను కేంద్రం తనకు వ్యతిరేకంగా ఉసి గొల్పుతుందన్న బెరుకు జగన్ ను వెంటాడుతున్నాయని వారు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికను అడ్డుపెట్టుకుని కేంద్రంపై ఒత్తిడి తెస్తే.. ఆ ఎన్నక తరువాత తనను కేసులు వేటాడే అవకాశం ఉందన్న సంగతి జగన్ కు తెలియనిది కాదని విశ్లేషకులు అంటున్నారు. అయితే జగన్ ముందస్తు యోచనలో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో, ఇప్పటికే రాష్ట్రంలో దిగజారిన ప్రతిష్టను ఇంకా మసకబారకుండా కాపాడుకోవాలన్నా.. జనం రాష్ట్రానికి జగన్ ఏదో చేశాడని అనుకోవాలన్నా, అన్నిటికీ మించి వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాబట్టాలన్నా రాష్ట్రానికి ఏదో సాధించాల్సిన అవస్యకత జగన్ ది. అందుకే కేసుల భయంతో సాష్టాంగపడతారా? మరోసారి అధికారంలోకి రావాలన్న ఆంకాక్ష నెరవేర్చుకునే ప్రయత్నంలో రాష్ట్రం కోసం పట్టుబడతారా అన్నది తేలవలసి వుంది.


