మితృత్వం లాంటి శతృత్వం.. బీజేపీ వైసీపీల పొలిటికల్ గేమ్ లో టీడీపీ బలి కానుందా?

'విభజించు.. ఓట్లు పట్టు' అనే సిద్ధాంతంతో జాతీయ పార్టీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో బలపడాలని చూస్తోందా?.. హిందుత్వ కార్డునే పెట్టుబడిగా భావిస్తోందా?.. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇటీవల కాలంలో హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. పలు ఆలయాల్లో దేవుళ్ల విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. అంతర్వేది రథం దగ్ధం, కనకదుర్గ అమ్మవారి వెండి రథం సింహాలు మాయం వంటి ఘటనలు జరిగాయి. తాజాగా విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం ఘటన వెలుగు చూసింది. ఇలా నిత్యం రాష్ట్రంలో ఏదోక ప్రాంతంలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో హిందువుల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు, హిందుత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీ.. హిందువుల తరఫున స్వరం వినిపిస్తూ.. హిందువులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఇదంతా గమనిస్తోన్న రాజకీయ విశ్లేషకులు దీని వెనుక ఓ రాజకీయ ఎత్తుగడ ఉందని అభిప్రాయపడుతున్నారు. మతాలుగా ఓట్లను చీల్చి, వాటిని రెండు పార్టీలు పంచుకొని.. ఏపీలో టీడీపీని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుందని అంటున్నారు.

 

తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే బీజేపీ ఏపీలో అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో మత రాజకీయాలు రాజ్యమేలాయి. మతపరమైన విమర్శలతో ఒకానొక సమయంలో బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్యనే అసలు పోటీ అన్న అభిప్రాయం వ్యక్తమైంది. బీజేపీ, ఎంఐఎం పార్టీలు హిందూ, ముస్లిం అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ వేడి పుట్టించాయి. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అసందర్భంగా ఎన్టీఆర్, పీవీ ఘాట్ లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మతానికి గానీ, పాతబస్తీ ప్రాంతానికి గానీ ఏమాత్రం సంబంధం లేని అంశాన్ని ఆయన తెరపైకి తీసుకొచ్చారు. ఆయనలా మాట్లాడిన నిమిషాల్లోనే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఇలా మత పరమైన విమర్శలతో గ్రేటర్ ఎన్నికల్లో రెండు పార్టీలు లబ్దిపొందాయి. ఎప్పటిలానే మెజారిటీ ముస్లిం ఓట్లు ఎంఐఎంకు పడగా.. గతంలో గ్రేటర్ లో 10-12 శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి 35 శాతానికి పైగా ఓట్లు సాధించింది. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు హిందుత్వ కార్డు ఎంతలా పనిచేసిందో!. ఇతర పార్టీలకు వెళ్లాల్సిన హిందూ ఓట్లను రాబట్టడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఇలా బీజేపీ- ఎంఐఎం పార్టీలు 'పైకి శతృత్వం- లోపల మితృత్వం' అనే సినిమా చూపించి గ్రేటర్ లో కాంగ్రెస్, టీడీపీ లను నిర్వీర్యం చేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పరోక్షంగా బీజేపీ కూటమి విజయానికి కారణమైన ఎంఐఎం.. గ్రేటర్ ఎన్నికల్లో మత పరమైన వ్యాఖ్యలతో బీజేపీకి లబ్ది చేకూర్చిందని అంటున్నారు.

 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వ్యూహాన్నే ఏపీలో వైసీపీతో కలిసి బీజేపీ అమలు చేస్తుందని అంటున్నారు. గ్రేటర్ లో ఎలాగైతే మెజారిటీ ముస్లిం ఓటర్లు ఎంఐఎం వైపు ఉంటారో.. అలాగే ఏపీలో మెజారిటీ క్రిస్టియన్, ముస్లిం ఓటర్లు వైసీపీ వైపు ఉంటారు. ఇక్కడ కూడా బీజేపీ బలపడాలంటే హిందూ ఓట్లను తన వైపు తిప్పుకోవాలి. ఆ ప్రయత్నమే ఇప్పుడు ఏపీలో జరుగుందని అంటున్నారు. ఇన్నేళ్ల ఏపీ చరిత్రలో ఇలా హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరిగిన దాఖలాలు ఎప్పుడూ లేవు. కేవలం కొద్ది నెలలుగానే ఏపీలో ఆలయాలపై వరుసగా దాడులు జరుగున్నాయి. దీంతో దీనివెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్న బీజేపీ.. జగన్ ను క్రిస్టియన్ సీఎం అంటూ విమర్శిస్తోంది. వైసీపీ నేతలేమో బీజేపీ హిందుత్వ పార్టీ అంటున్నారు. ఓ రకంగా హిందువులు అంటే బీజేపీకి ఓటెయ్యాలనే అభిప్రాయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. తద్వారా గ్రేటర్ లో బీజేపీ, ఎంఐఎం ఎలాగైతే హిందూ, ముస్లిం అంటూ లబ్దిపొందాయో.. అలాగే ఏపీలో బీజేపీ, వైసీపీ లబ్దిపొందే ప్రయత్నం చేస్తున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. క్రిస్టియన్, ముస్లిం ఓటర్లు ఎలాగూ ఎక్కువశాతం వైసీపీ వైపు ఉంటారు. ఇక మెజారిటీ హిందూ ఓట్లను రాబట్టి బీజేపీ బలపడాలని చూస్తోంది. అదే జరిగితే ఏపీలో టీడీపీ భవిష్యత్ ప్రశ్నార్థం అయ్యే పరిస్థితి ఉంది. బీజేపీ, ఎంఐఎం పార్టీల 'మితృత్వం లాంటి శతృత్వంతో' గ్రేటర్ లో కాంగ్రెస్ ఎలా బలి అయిందో.. బీజేపీ, వైసీపీల మితృత్వం లాంటి శతృత్వంతో ఏపీలో టీడీపీ బలైపోయినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంటున్నారు.