తల్లికో జుట్టు పోగు..!
Published on: Sat Jul 23, 2022 12:43PM
నల్లగా నిగనిగలాడే జుత్తు అంటే మహిళలకు ప్రాణం. అది అందంలో భాగంగా భావిస్తారు గనుక. ఆమధ్యకాలం వరకూ పొడవాటి జడలు చూస్తుండేవారం. ఇపుడు ఎంత చక్కగా స్టయిల్‌గా ఉండాలో అమ్మాయిలతోపాటు అమ్మలూ చూసుకుం టున్నారు. అంచేత పొడుగు జడలకు మంగళం పాడేసేరు. ఇంగ్లీషువారి బాప్డ్‌హెయిర్ స్టయిల్ అందరికీ స్టయిల్‌గా ఆకట్టు కుంది. సరే ఎవరి ఇష్టం వారిది. అయితే ఆరిజోనా కుర్రాడు తన తల్లికోసం మాత్రం చక్కటి జుత్తు పెంచుకుంటున్నాడు. కారణం ఆమెకి బ్రెయిన్ ట్యూమర్ తో ఉన్న జుత్తంతా పోయింది. ఆమెకు మళ్లీ ఒకనాటి రూపు ఇవ్వాలని అతని కోరిక. అందుకే జుత్తు కష్టపడి పెంచు కుంటున్నాడు.
మూడేళ్లక్రితం మెలేన్ సాహాకి ట్యూమర్ సంగతి బయటపడింది. ఆమె రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఈ కారణంగా ఆమె జుత్తంతా కోల్పోయింది. ఆమెకు అప్పటివరకూ మంచి చక్కటి జుత్తు ఉండేది. ఆమెకు తిరిగి ఆ జుత్తు ఉన్న సంతోషాన్ని ఇవ్వాల నుకున్నాడు ఆమె కుమారుడు 27 ఏళ్ల మాట్. ఒకరోజు వారిద్దరూ భోజనం చేస్తుండగా, నీ కోసం నేను జుత్తు పెంచుకుంటాను. మంచి విగ్ తయారు చేయిస్తానన్నాడు. ఆమె ఆనందంతో కడుపుబ్బ నవ్వింది.
తల్లి అలా నవ్వుకుని ఎన్నాళ్లయిందో అనుకున్నాడు మాట్. ఆ నవ్వుల్ని అలానే చూడాలనుకున్నాడు. తల్లి జుత్తులాంటిదే తన జుత్తు అని గ్రహించే తాను ఆ నిర్ణయానికి వచ్చేడు. స్నేహితులతో మాట్లాడి విగ్ గురించి తెలుసుకున్నాడు. మొన్న మార్చి నాటికి మాట్ జుత్తు 12 అంగుళాలు పెరిగింది. విగ్ తయారుచేసే వ్యక్తి ఈ జుత్తు చాలా బావుంది, ఆమెకు నప్పుతుందన్నాడు. పైగా ఈ మాత్రం చాలుతుందన్నాడు. కుర్రాడి ఆనందానికి హద్దే లేదు. ఆమెను ఆనందపరచడానికి ఈ మాత్రం చేయలేనా అనుకున్నాడు. తల్లికో జుత్తు పోగు!
మాట్ కాలిఫోర్నియా విగ్ తయారీ కంపెనీ వారిని కలిసి రెండువేల డాలర్లు చెల్లించాడు. వాళ్లు బ్రహ్మాండంగా విగ్ తయారు చేసి ఇచ్చారు. అది పెట్టుకున్న మెలాన్ అద్దంలో చూసుకుంది.. అసలు అది విగ్‌లా అనిపించడం లేదన్నది. మాట్ తల్లిని కావలించు కున్నాడు ఆనందంతో! ఆమె అనారోగ్య బాధ నుంచి కాస్తంత ఉపశమనం కలిగించినందుకు తనను తాను శభాష్ అనుకునే ఉంటాడు. వాళ్ల బంధువులు, ఆమె స్నేహితులు కూడా కుర్రాడి పనిని ఎంతో మెచ్చకున్నారు. వియ్ ఆల్ లవ్ యూ! అన్నారు. అది సరిపోయింది.. తల్లి అనారోగ్యంతో కుమిలిపోతున్న అతని మనసుకి.


