శంభో శివ శంభో, ఇవేమి బంధాలు శివ శంభో
Published on: Sun Mar 2, 2025 9:19AM

మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. కమర్షియల్ గా మారిపోతున్నాయి. అనుబంధాలు, ఆత్మీయత అన్న మాటలు చరిత్రగర్భంలో కలిసిపోతున్నాయి. తల్లీ, తండ్రీ, భర్త, భార్య, పిల్లలు అన్న బంధాలనే లెక్క చేయని తరం ఒకటి మొదలైంది. చిన్న చిన్న మొత్తాల కోసమే ఒకరినొకరు తెగనరుక్కునే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. సొమ్ములు ఇవ్వలేదన్న కోపంతో కన్న తండ్రినే హతమార్చిన కొడుకు.. ఆస్తిపై పెత్తనం ఇవ్వడం లేదన్న కక్షతో తాతను తెగనరికిన మనవడు.. తన జల్సాలకు అడ్డువస్తోందన్న కోపంతో భార్యను హతమార్చిన భర్త, అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. ఇలా దాదాపు ప్రతి రోజూఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటోంది.
తాజాగా భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో పారిపోయిన భార్య ఉదంతం ఒకటి హైదరాబాద్ లో వెలుగు చూసింది. సామాజిక మాధ్యమంలో పరిచయం అయిన వ్యక్తితో ప్రేమలో పడిన వివాహిత భర్తా జయరాజ్, ఇద్దరు పిల్లలను వదిలేసి చెప్పాపెట్టకుండా ప్రియుడితో లేచిపోయింది. భార్య ఏమైందో తెలియక వెతికి వెతికి వేసారిన భర్త జయరాజ్ పోలీసులకు భార్య మిస్సింగ్ అంటూ ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ పేట్ బషీర్ బాగ్ లో చోటు చేసుకుంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. భార్య, ఆమె ప్రియుడు బైక్ పై జల్సాగా వెడుతూ భర్త కంటే పడ్డారు. దీంతో వారిని వెంబడించాడు. దీంతో వారు బైక్ వదిలేసి రన్నింగ్ బస్సు ఎక్కి పారిపోయారు. దీంతో భర్త విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారైన వారి కోసం గాలింపు చేపట్టారు.


