కేసీఆర్, జగన్ ల మధ్య దూరం పెరగడానికి కారణమేంటి?

 

ఎన్నికల ఫలితాల తర్వాత అధికార పగ్గాలు చేపట్టాక కేసీఆర్, జగన్ ఇద్దరూ సఖ్యతగా మెలిగారు. పలుసార్లు భేటీ అయ్యారు. ఒకరికొకరు కితాబులిచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఈ కథ కంచికి చేరినట్లు తెలుస్తొంది. కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య దూరం పెరిగిందని తెలంగాణ అధికార వర్గాలంటున్నాయి. జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారాయి. ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించటం, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయడం, కేసీఆర్ ను ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ వ్యవహారం కేసీఆర్ కు మంట పెట్టింది. ఏపీ తరహాలో తెలంగాణలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు 40 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మెతో తెలంగాణ అట్టుడుకుతోంది, ఈ అంశం కేసీఆర్ కు కొరుకుడుపడటంలేదు. అవగాహన లోపంతో ఆర్టీసీ విలీనం పై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు.ఈ తేనెతుట్టెను కదిలించి తమకు నష్టం కలిగించారని అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నారు. మరోవైపు కేసీఆర్ అన్నందుకైనా ఆర్టీసీ విలీనం ఆరు నెలల్లోనే సక్సెస్ చేసి చూపుతామని ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు కూడా కేసీఆర్ కు ఆగ్రహం తెప్పించాయని అంటున్నారు. 

తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేసిన అధికారులు, కేసీఆర్ అంటే గిట్టనివారికి జగన్ పెద్ద పీట వేయడం కూడా ఇద్దరి మధ్య సంబంధాలు చెడిపోవటానికి కారణమని అంటున్నారు. తెలంగాణ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించి వీఆర్ఎస్ తీసుకున్నారు. వెంటనే ఆయన్ను ఏపీ విద్యాశాఖ సలహాదారుగా జగన్ నియమించుకున్నారు. ఇంక కేసీఆర్ అంటే గిట్టని జర్నలిస్టులు అమర్, రామచంద్రమూర్తికి పెద్ద పీట వేయడం కూడా కేసీఆర్ కు నచ్చలేదని చెబుతున్నారు. స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మి విషయంలోనూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. కేంద్రం నుంచి పూర్తిగా ఆదేశాలు రాక ముందే ఈ ఇద్దరినీ అనధికారికంగా విధుల్లోకి తీసుకోవటం కేసీఆర్ కు కోపం తెప్పించిందట. చివరికి స్టీఫెన్ రవీంద్ర వెనక్కొచ్చి అభాసుపాలయ్యారు.

అటు గోదావరి జలాల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. గోదావరి జలాలను ఉమ్మడిగా క్రిష్ణకు తరలించాలని ఇద్దరూ కలిసి నిర్ణయించారు. కేసీఆర్ ఉదారంగా కృష్ణా డెల్టాకు నీళ్లిస్తాం అంటున్నారని జగన్ ఏపీ అసెంబ్లీలో ప్రకటించేశారు కూడా. అయితే ఆ తర్వాత తత్వం బోధపడిందో ఏమో ఆ ఆలోచనను విరమించుకున్నట్టు కనిపిస్తోంది. సొంతం గానే పోలవరం నుంచి కృష్ణాకు నీళ్ళు తరలించే ప్రతిపాదనలను చేస్తోంది ఏపీ ప్రభుత్వం. 

ఇక ప్రగతి భవన్లో ఇద్దరు ముఖ్య మంత్రుల సమావేశంలో మాట్లాడుకున్న అంశాలు మీడియాలో వచ్చాయి. ముఖ్యంగా రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఈ విషయంలో కేసీఆర్ జగన్ కలిసి కేంద్రంపై ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించుకున్నట్టు మీడియాలో వచ్చింది. దీంతో జగన్ ఉలిక్కిపడ్డారు. ఈ విషయాలు మాట్లాడుకోలేదని ప్రకటన కూడా విడుదల చేశారు. కేసీఆర్ తో సఖ్యతగా మెలగడంతోనే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దూరం పెడుతోందన్న అభిప్రాయానికి వచ్చారు జగన్ .అనవసరంగా తొందరపాటుతో కేసీఆర్ తో సఖ్యతగా మెలిగి కేంద్రంతో దూరం పెంచవల్సి వచ్చిందని జగన్ సన్నిహితులు చెబుతున్నారు. అందుకే అమిత్ షా తో అపాయింట్ మెంట్ కోసం ఇబ్బంది పడాల్సి వచ్చిందని సీబీఐ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు దొరకలేదని అంచనాకొచ్చారు. అందుకే కేసీఆర్ తో దూరం పాటించేందుకు జగన్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. మళ్లీ ఈ మధ్య కాలంలో జగన్,కేసీఆర్ మధ్య భేటీలు ఉండక పోవచ్చని ఉమ్మడి ప్రాజెక్టుపై అసలు చర్చలు ఉండవని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.ఇక ముందు ముందు వీరి సఖ్యత ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.