ఆ ముగ్గురూ ఎక్కడ? కేసీఆర్ సామాజిక వర్గమనేనా? కమలదళంలో గుసగుసలు..
Published on: Tue Jan 11, 2022 2:05PM
కారణాలు ఏవైనా, తెర వెనక ఎవరున్నా, తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ తర్వాత కమల దళం జాతీయ నాయకత్వం కూడా రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. బండి సంజయ్ అరెస్టు నిరసన తెలిపేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మొదలు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్ నాయకులు రోజుకొకరు వంతున రాష్ట్రానికి వచ్చి తెరాస ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్’ను ఎండగట్టి పోతున్నారు. అది కూడా హైదరబాద్’కు పరిమితం కాకుండా జిల్లాలలో నిరసన దీక్షలు చేపట్టి కేసీఆర్ సర్కార్’పై ఆరోపణ అస్త్రాలను సంధిస్తున్నారు. ఒక విధంగా చూస్తే, బీజేపీ వ్యూహం తెరాసను ఉక్కిరిబిక్కిరి చేస్తోందనిపిస్తోంది. ముఖ్యమంత్రి మినహ మిగిలిన సీనియర్ నాయకులు అందరూ బీజేపీ నాయకుల విమర్శలకు సమాధానం చెప్పుకోక తప్పడం లేదు.
అయితే, బీజేపీలో ఇంత జరుగుతున్నా, ఎక్కడెక్కడి నాయకులు వచ్చి పోతున్నా, ఆ ముగ్గురు నాయకులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. అంతే కాకుండా ఆ ముగ్గురు నాయకులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో, పార్టీలో రకరకాలుగా చర్చలు, ఊహాగానాలు మొదలయ్యాయి. రాష్ట్రంలోనే కాదు జాతీయ నాయకత్వం కూడా, ఆ ముగ్గురు నాయకుల గురించి ఆరా తీయడంతో పాటుగా, నిఘా వర్గాలను కూడా రంగంలోకి దింపినట్లు సమాచారం.
ఆ ముగ్గురిలో ముఖ్యుడు బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి లేకున్నా, మురళీధర్‌రావుకు సంఘ్ పరివార్’లో ప్రముఖ నేతగా గుర్తింపు ఉంది. పైగా ఆయన మధ్య ప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జిగా ఉన్నారు. అయినా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చిన సమయంలో కూడా, ఆయన పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూడలేదు. అలాగే, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఇతర నాయకుల రాష్ట్ర పర్యటన సందర్భంలోనూ మురళీధర్‌రావు కనిపించలేదు. బండి సంజయ్ అరెస్ట్ విషయంలో కూడా ఆయన, అంతగా రీయాక్ట్ కాలేదు. ఏదో అలా ఓ ట్వీట్ ‘ తో ఖండించి వదిలేశారు. దీంతో మురళీధర్‌రావు ఎక్కడా అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తున్నాయి. వ్యక్తిగత పనులు, ఆరోగ్య కారణాల వల్ల అందుబాటులో లేరని పార్టీలో కొందరు చెబుతున్నా.. అది అంట నమ్మసక్యంగా లేదని అంటున్నారు. దాల్ మే కుచ్ కాలా హై అన్నది వారి అనుమానం.
అలాగే, ఇటీవల ఆయనపై తీవ్ర ఆరోపణలు వచ్చిన సమయంలో బండి సంజయ్ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదని, ఆ కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరిగిందని అంటున్నారు. అలాగే, మరో నాయకుడు పేరాల శేఖర్‌రావు గురించి కూడా బీజేపీ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం ఖాదీ గ్రామీణ బోర్డు డైరెక్టర్‌గా ఉన్నశేఖర్ గతంలో సంఘ్ (ఆర్ ఎస్ ఎస్ ) పూర్తి సమయ కార్యకర్త/ ప్రచారక్ గా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు. మొన్నటి వరకు జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి పోటీ చేశారు. ఈ మధ్య పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. జీహెచ్ఎంసి పరిధిలోని లింగోజీగూడ డివిజన్ ఉపఎన్నిక సమయంలో జరిగిన పరిణామాలు, కొందరు నేతల బృందం కేటీఆర్‌ను కలవడం పార్టీలో దుమారం రేపాయి. ఆ తర్వాత పార్టీ చీఫ్ బండి సంజయ్‌తో శేఖర్‌కు గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ దూకుడుగా వెళ్తున్న టైమ్‌లో శేఖర్ కనిపించడం లేదన్నది బీజేపీ వర్గాల మాట.
ఆ ఇద్దరితో పాటు, అదే సామాజిక వర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు కూడా బుల్లి తెర మీదనే కాదు, పార్టీ కార్యాలయంలోనూ కనిపించడం లేదు. పార్టీ కార్యాలయానికి రెగ్యులర్‌గా వచ్చే కృష్ణ సాగర్ ఇప్పుడు అసలే రావడం లేదు. ముఖ్య నేతలు వచ్చిన సమయంలోనూ ఆయన పార్టీ కార్యాలయం గడప తొక్కలేదని, బండి సంజయ్ అరెస్ట్ అంశంలోనూ స్పందించలేదని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది.
మురళీధర్‌రావు, శేఖర్‌రావు, కృష్ణసాగర్‌రావు ఈ ముగ్గురూ కేసీఆర్‌కు చెందిన సామాజికవర్గమే. ఈ ముగ్గురు ఒకేసారి ఎందుకు సైలెంట్ అయ్యారన్నదానిపై కాషాయ శిబిరంలోనే అనేక సందేహాలు వ్యక్త మవుతున్నాయి. అయితే, ఆ ముగ్గురు పార్టీ మారే అవకాశం మాత్రం ఉండదని, పార్టీ నాయకులు అంటున్నారు.


