వైసీపీ గేట్లు ఎప్పుడు ఎత్తుతారు? రెండు నెలలైనా ఒక్క నేతా ఎందుకు రాలేదు?

 

ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి భారీగా వలసలు ఉంటాయ్, ఇది సర్వసాధారణం. అలాగే, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చేరిపోయేవాళ్లు కామన్ గా కొందరుంటారు. కానీ, అదేంటో ఆంధ్రప్రదేశ్‌లో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. అధికార పార్టీని కాదని, ఒక్కశాతం కూడా ఓట్లురాని పార్టీలోకి జంపింగ్‌లు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

వైసీపీ అధికారంలోకి వచ్చింది...అది కూడా మామూలుగా కాదు...విపక్షాలకు కోలుకోలేని షాక్ ఇస్తూ, దాదాపు రాష్ట్రం మొత్తం క్లీన్‌‌స్వీప్‌ చేసి తిరుగులేని విజయంతో పవర్‌లోకి వచ్చింది... ఇంకేముంది విపక్షాల్లోని నేతలంతా వైసీపీలోకి క్యూకడతారని అంతా అనుకున్నారు. కానీ సీన్ రివర్సైంది. అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటుతున్నా, ఒక్క ముఖ్యనేత కూడా వైసీపీ వైపు చూడకపోవడం సంచలనంగా మారింది.

అయితే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీని కాదని, కేంద్రంలో పవరున్న బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ ముఖ‌్యనేతలంతా కమలం గూటికి క్యూకడుతున్నారు. ఇప్పటికే నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలు... కాషాయ కండువా కప్పుకోగా, మరికొంత మంది ముఖ్యనేతలు త్వరలోనే బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

అయితే, ఎంతోమంది ముఖ్యనేతలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, కానీ జగన్మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తమ అధినేత ఓకే చెప్పి, గేట్లెత్తితే వరదలా వచ్చిచేరతారంటున్నారు వైసీపీ లీడర్లు. ఏదేమైనా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని వదిలేసి, కేంద్రంలో పవరున్న కమలం గూటికి చేరడం వెనుక మతలబు ఏమిటో మరి..!