TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అసెంబ్లీ అంటే అంత చులకనా?

Published on: Tue Mar 11, 2025 6:33PM

బుధవారం నాడు కేసీఆర్ అసెంబ్లీకి వెళుతున్నారు? అవును ఇందులో విశేషం ఏముంది? మొన్నామధ్య ఏపీలో మాజీ సీఎం జగన్ కూడా వెళ్లొచ్చారు కదా! బుధవారం మంచి రోజు. చాలా పెళ్లిళ్లు కూడా జరుగుతున్నాయి. అందుకే ఇన్నాళ్లూ అసెంబ్లీ మెహం చూడని కేసీఆర్ ఇప్పుడు వెళ్లాలనుకున్నారేమో. అసెంబ్లీలో ఆయన స్థాయి వ్యక్తులు లేరని ఆయన కుమారుడు కేటీఆర్ చెబుతున్నారు కదా! అందుకే వెళ్ల లేదు అనుకుందాం!  మరి ఇప్పుడు ఎందుకు వెళుతున్నారు?
అసెంబ్లీ బిజినెస్ రూల్ ప్రకారం నిర్ణీత గడువులోగా సమావేశాలకు హాజరు కాకపోతే శాసన సభ్యత్వం రద్దువుతుందట కదా! మరి ఈయన (కేసీఆర్) ఆయన (జగన్)కు చెప్పారో!  లేక ఆయన ఈయనకు గుర్తు చేశారో తెలియదు కానీ, మొత్తానికి సభ్ోయత్వం రద్దవుతుందని భయపడుతున్నారా!  సార్ కి భయం గియం జాన్తానై. సభలో రేవంత్ రెడ్డినీ, ఆయన గణాన్నీ కడిగిపారేయడానికే అసెంబ్లీకి పోతున్నారని ఆయన అభిమానులు అంటున్నారు.  అయితే ఆ విషయం రెండో రోజు సభకు వెళితేగానీ తేలదు.
శాసనసభ్యత్వం రద్దయితే మళ్లీ ఎన్నికలొస్తాయి. ఇంకా నలుగేళ్ల గడువు ఉండగానే, జనంలో గాలి అటూ ఇటూగా ఉన్నప్పుడు ఎన్నికలొస్తే.. అబ్బో ఇప్పుడే ఎందుకు లే ఈ లొల్లి అనుకున్నారా!  అయినా సారుకి ఎన్నికలు కొత్తగాదు. రాజీనామాలూ కొత్తగాదు. గతంలో బాజాప్తు రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికలకు వెళ్లిన అనుభవం జాస్తిగానే ఉంది. 

ఇదంతా కాదు గానీ, ఈ సభకు గైరు హాజరయ్యే వారికి జూసి పై నుంచి శీనన్న (కీర్తిశేషులు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి) గుర్రుగుర్రు మంటున్నారు.  ఎందుకంటే ఆయన చిన్నప్పుడు బడికైనా మానేశారు ఏమో గానీ, అసెంబ్లీకి ఏనాడూ గైరు హాజరు కాలేదు. ఆయన బతికినన్నాళ్లూ శాసనసభా సమావేశాలకు ‘నాగా’ లేకుండా వెళ్లారు. అఖరుకి ఆయనకి సీట్లో కూర్చోడానికి వీలు లేని అనారోగ్య పరిస్థితిలో కూడా ప్రత్యేకమైన దిండు తెప్పించుకుని మరీ కూర్చున్నారు. జీవిత చరమాంకంలో ఆస్పత్రి బెడ్ పై ఉండి కూడా అసెంబ్లీకి వెళ్ల లేకపోయానని అల్లాడిపోయారు. ఆయన  రోగం బాధ కన్నా, అసెంబ్లీకి వెళ్లలేకపోయాననే ఎక్కువ బాధపడ్డారు. ఆయన చాదస్తం గూల అసెంబ్లీయే దేవాలయం అనుకున్నారు. మరి ఇప్పుడు ఈ నేతల ధోరణి ఏంది?  బడికి వెళ్లనని మారం చేసే పిల్లగాడిలా ఏవేవో సాకులు చెబుతున్నారని విజ్ణులైన జనం విస్తుపోతున్నారు.  ఏపీలో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, తెలంగాణలో నా సాటి ఎవరూ లేరని హాజరు కాకపోవడంపై జనం విస్మయం చెందుతున్నారు.  అధికారం ఉంటేనే సభకు వెళతాం అనే వీళ్ల ధోరణిని ఓట్లు వేసిన జనం ఎగతాళి చేస్తున్నారు.  గతంలో ఏ హోదా లేని శాసనసభ్యులు సైతం సభకు హాజరై ప్రజా సమస్యలపై గళమెత్తి మాట్లాడారు. ప్రభుత్వ తప్పిదాలను సైతం ఎండగట్టారు.  

పి.జనార్ధర్ రెడ్డి వంటి నేతలు, చంద్రబాబుని ఏలేరు స్కాం పై ఆడుకున్నారు. మరుగున పడిన ఎన్నో అంశాలు సభలో అధికారపక్షానికి చెమటలు పట్టించాయి. వారి ధాటిని తట్టుకోవడానికి అధికార పక్షం స్ట్రాటజీ కమిటీని ఏర్పాటు చేసి జవాబు లేని  సమస్యల నుండి తప్పించుకునేందుకు. సభను దారి మళ్లించేందుకు ప్రయత్నించడం ప్రారంభించింది. చివరకు అదే అసెంబ్లీ ఎజెండాగా అయ్యింది.  ఇప్పుడు అధికార, ప్రతిపక్షాలు సభలో సమంగా ఉన్నా, ప్రజా సమస్యలపై చర్చించకుండా, ఒకరినొకరు నిందించుకుని సమస్యలను దాటవేయడం పరిపాటి అయ్యింది.  అందువల్లే శాసన సభ అంటే పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. 
ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆర్టీసీ బస్సులో సభకు రావడం, చంకలో ఫైల్స్, పేజీల మధ్య స్లిప్పులతో కళాశాలకు అధ్యాపకులలాగా హాజరవడం గుర్తుకొస్తున్నాయి. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వంటి నేతల స్ఫూర్తి, రజబలీ, నర్రా రాఘవరెడ్డి, బోడేపూడి వెంకటేశ్వరరావు, ఓంకార్ వంటి ఎందరో పెద్దలు పాటించిన సభా మర్యాదలు, నియమాలు ఇప్పటి తరానికి ఎవరు చెప్పాలి అంటున్నారు పెద్దలు. సభలో ఒక్కో అంశంపై వారు నిలదీసిన తీరు ఏ సినిమాలో చూడగలం. మహిళలు ప్యాషన్ వస్త్రాల పట్ల మోజు చూపినట్లు, నేటి నేతల హంగూ ఆర్భాటాలు వారు అసెంబ్లీకి వేసుకొచ్చే వాహనాలు చూస్తే తెలుస్తుంది. పోటీలు పడి పెద్దపెద్ద కార్లలో ర్యాలీ చేయడమే నేటి తరం నేతలకు తెలిసిన విద్య. కూటికి జరక్కకొందరు,  పంటనష్టపోయి అప్పులపాలై  అత్మహత్యలు చేసుకుంటున్న రైతన్నల పరిస్థితులు వీరికి పట్టవా అని ప్రశ్నిస్తున్నారు. 

ఆనాడు శాసన సభ్యులకు ఇచ్చిన వేతనం వేలల్లోనే ఉండేది. ఆ జీతం కూడా కొందరు తమ పార్టీకి విరాళంగా ఇచ్చే వారు. నేడు సభ్యులకు లక్షల్లో జీతభత్యాలతో పాటు ఆఫీసుని, సహాయకుల్ని కూడా ఇస్తోంది. ఏటా లక్షలాది రూపాయల ప్రజాధనం వేతనంగా పొందుతున్నందుకైనా నేతలు సభకు వెళ్లనక్కర్లేదా!  పదివేల జీతం తీసుకునే ఉద్యోగి పరిధికి మించి సెలవు పెడితే యాజమాన్యం జీతంలో కోత పెడుతుంది. మరి అధికారం దక్కలేదనో, అవమానం తట్టుకోలేమనో సభకు హాజరు కాని వారి జీతాలు ఎవరు కోయాలి. జీతం కన్నా బాధ్యతగా భావించే శాసననసభ్యులు ఎవరో జనం గుర్తించి కోత పెట్లాలంటే మళ్లీ అయిదేళ్లు నిరీక్షించాల్సిందేనా!  అని విజ్ణులైన పెద్దలు ప్రశ్నిస్తున్నారు.