TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆయుధ పూజ ఎందుకు నిర్వహిస్తారు? దీని ప్రాముఖ్యత ఏంటి..

Published on: Wed Oct 1, 2025 5:54PM


నవరాత్రి వేడుకలలో ఆయుధ పూజ  చాలా ముఖ్యమైనది.  దీన్నే అస్త్ర పూజ అని కూడా పిలుస్తారు.  ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో నవరాత్రి నవమి తిథి నాడు జరుపుకునే ప్రముఖ పండుగ ఆయుధ పూజ. 2025 లో ఆయుధ పూజ అక్టోబర్ 1 బుధవారం నాడు వచ్చింది. ఈ పండుగను కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,  కేరళలో విస్తృతంగా జరుపుకుంటారు. సాంప్రదాయకంగా ఆయుధాలను పూజించడానికి ఈ రోజు చాలా ముఖ్యమైనది.  పనిముట్లు, యంత్రాలు, వాహనాలు, పుస్తకాలు,  ల్యాప్‌టాప్‌ల వంటి ఆధునిక పరికరాలకు కూడా ఆయుధ పూజ వర్తిస్తుంది. భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో విశ్వకర్మ పూజ మాదిరిగానే ఆయుధ పూజ మనిషిలో నైపుణ్యాలు, కొత్త వస్తువుల  ఆవిష్కరణ,  మానవ జీవితానికి  సహాయపడే సాధనాలను గౌరవించడానికి ఒక వేదికగా మారుతుంది.

ఆయుధ పూజ ప్రాముఖ్యత..

ఆయుధ పూజ అనేది  కేవలం ఒక సంప్రదాయం కాదు.. దీని వెనుక  లోతైన సాంస్కృతిక,  ఆధ్యాత్మిక అర్థం ఉంది. ఈ రోజున అందరూ తమ పనిముట్లను భక్తితో, గౌరవంగా చూస్తారు. తమ పనిముట్లకు కృతజ్ఞత తెల్పుకునే సమయం ఇది. గృహోపకరణాల నుండి పారిశ్రామిక యంత్రాల వరకు ప్రతి వస్తువును  పురోగతికి సాధనంగా చూస్తారు.

ఆయుధ పూజ సమయంలో పనిముట్లు,  ఆయుధాలను పూజించడం వలన జ్ఞానం, సృజనాత్మకత, శ్రేయస్సు,  విజయం,  ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అంతేకాదు.. తమ జీవితానికి ఆయుధాలు దైవస్వరూపాలుగా భావించడం జరుగుతుంది.

దుర్గాదేవి ఆశీర్వాదం..

నవరాత్రులలో దుర్గాదేవి తొమ్మిది రోజులు మహిషాసురుడితో పోరాడింది.  ఎంత పోరాడినా ఆ రాక్షసుడు మరణించకపోవడంతో దేవతలందరూ తమ తమ ఆయుధాలను అమ్మవారికి సమర్పించారు. ఈ ఆయుధాలతో దుర్గాదేవి మహిషాసురుడిని వధించింది.  తనకు ఎంతో సహాయం చేసిన ఆయుధాలకు ఆ అమ్మవారు తన ఆశీర్వాదం ఇచ్చారు. ఈ కారణంగా తాము ఉపయోగించే ఆయుధాలు,  పనిముట్లను ఆయుధ పూజ రోజు పూజించడం,  గౌరవించడం చేస్తున్నారు.

                                     *రూపశ్రీ.