TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

క్రూడ్ ఆయిల్ ధాటికి విలవిలలాడిన మార్కెట్లు: సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలకు కారణాలివే!

Published on: Wed Aug 12, 2026 11:56AM

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, ముఖ్యంగా ముడి చమురు ధరల మంటలు దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. భారత ఈక్విటీ మార్కెట్లలో మళ్ళీ నష్టాల వేడి పెరిగింది. దలాల్ స్ట్రీట్‌పై క్రూడ్ ఆయిల్ విసిరిన పంజా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. మధ్యప్రాచ్యంలో ముదురుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి గుండా నౌకా రవాణా పునరుద్ధరణపై నెలకొన్న అనిశ్చితి కారణముగా గ్లోబల్ మార్కెట్‌లో చమురు మంటలు చెలరేగుతున్నాయి. ఈ ప్రభావంతో బుధవారం ఉదయం బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు భారీ ఒత్తిడిని ఎదుర్కొంటూ నష్టాల్లోనే తమ ట్రేడింగ్‌ను కొనసాగించాయి.

ట్రేడింగ్ ప్రారంభంలోనే 30 షేర్ల బిఎస్ఈ సెన్సెక్స్ 35.99 పాయింట్లు క్షీణించి 78,097.31 పాయింట్ల వద్ద ఊగిసలాడింది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి మరింత తీవ్రమవ్వడంతో ఒకానొక దశలో సెన్సెక్స్ ఏకంగా 211.37 పాయింట్లు పడిపోయి 77,953.66 వద్ద కనిష్ఠ మట్టాన్ని తాకింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా 65.10 పాయింట్లు నష్టపోయి 24,411.15 వద్దకు పడిపోయింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ప్రధానమైన 16 పరిశ్రమ రంగాలను పరిశీలిస్తే అందులో 11 రంగాలు తీవ్ర క్షీణతను నమోదు చేశాయి. అంతటితో ఆగకుండా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా ప్రతికూల పరిధిలోనే కొట్టుమిట్టాడుతూ సాధారణ పెట్టుబడిదారుల్లో గుబులు రేపాయి.

గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ బ్యారెల్‌కు 90 డాలర్ల మార్కుకు చేరువ కావడం భారతీయ మార్కెట్‌పై ప్రత్యక్ష దాడి చేసింది. పనామా జెండా కలిగిన ఒక కంటైనర్ నౌకపై అమెరికా సైన్యం దాడి చేయడంతో వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపాన్ని దాల్చాయి. దీని ఫలితంగా బ్రెంట్ క్రూడ్ ధర మళ్లీ 89 నుండి 90 డాలర్లు దాటడం దలాల్ స్ట్రీట్‌లో లాభాల ర్యాలీకి ప్రధాన అడ్డంకిగా మారిందని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయకుమార్ విశ్లేషించారు. భారతదేశం తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నందున, చమురు ధరలు పెరిగితే దిగుమతి బిల్లు భారీగా పెరుగుతుంది. ఇది దేశీయ ద్రవ్యోల్బణాన్ని పెంచడమే కాకుండా కరెన్సీ మార్కెట్‌లో రూపాయి విలువపై కూడా విపరీతమైన ఒత్తిడిని తెస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

 

stock market down crude oil prices rise,indian share market today market update