TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్‌తో PK & PR.. ఏం జ‌రుగుతోంది?

Published on: Mon Feb 28, 2022 11:15AM

టీఆర్ఎస్ కోసం పీకే టీమ్ ప‌ని చేస్తోంది. ఇన్నాళ్లూ వార్త‌లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఇప్పుడు సాక్ష‌మూ వ‌చ్చేసింది. ప్ర‌శాంత్ కిశోర్‌, ప్ర‌కాశ్‌రాజ్‌లు కాళేశ్వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించిన ఫోటో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇక‌, కేసీఆర్‌తో ఫాంహౌజ్‌లో పీకే, పీఆర్‌లు చ‌ర్చ‌లు కూడా జ‌రిపారు. ఆ వివరాలు చాలా ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. 

మామూలుగా అయితే ప్ర‌శాంత్ కిశోర్ పైపై వ్య‌వ‌హారాలే చూసుకుంటారు. చ‌ర్చ‌ల వ‌ర‌కే ప‌రిమితం అవుతారు. ఇలా క్షేత్ర సంద‌ర్శ‌ణ‌లు చేయ‌డం త‌క్కువ. అలాంటివ‌న్నీ అత‌ని ఐ-ప్యాక్ టీమ్ చూసుకుంటుంది. ఇక‌, పీకేతో ఆయ‌న టీమ్ స‌భ్యుడు కాని ప్ర‌కాశ్ రాజ్ సైతం ఉండ‌టం మ‌రింత ఇంట్రెస్టింగ్ పాయింట్‌. ఇప్ప‌టికే కేసీఆర్ వెంట క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర ప‌ర్య‌ట‌న‌ల్లో పార్టిసిపేట్ చేశారు ప్ర‌కాశ్‌రాజ్ (పీఆర్‌). ఆయ‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపిస్తారంటూ ప్ర‌చార‌మూ జ‌రుగుతోంది. ఇప్పుడిలా స‌డెన్‌గా పీకే-పీఆర్ కాంబినేష‌న్ తెర మీద‌కు రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. 

కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌పై ఫోక‌స్ పెంచారు. కానీ, రాష్ట్ర ప‌రిస్థితి అస‌లేమాత్రం బాగాలేద‌ని ఆయ‌న‌కూ తెలుసు. కానీ, మేక‌పోతు గాంభీర్యం. ఇక త‌న మాట‌ల మంత్రాల‌కు చింత‌కాయ‌లు రాల‌డం లేద‌ని గుర్తించే.. క‌నీసం పీకే అయినా గ‌ట్టెక్కిస్తారేమోన‌ని ఆయ‌న్ను ఆశ్ర‌యించారు. తానే రాజ‌కీయ చాణ‌క్యుడిన‌ని.. త‌నంత తోపు లేడ‌ని.. గొప్ప‌ల‌కు పోయే కేసీఆర్‌.. ఇలా త‌న‌కో రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌ను నియ‌మించుకోవ‌డం ఆయ‌న‌లోని ఓట‌మి భ‌యానికి నిద‌ర్శ‌నం అంటారు. ఇటీవ‌ల పీకే డైరెక్ష‌న్‌లోనే కేసీఆర్ కేంద్రంపై, బీజేపీపై డైలాగ్‌ డైన‌మైట్లు పేలుస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చ‌డం, మోదీ హ‌ఠావో అన‌డం, ప‌లు ప్రాంతీయ పార్టీల‌ను కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం.. ఇవ‌న్నీ ప్ర‌శాంత్ కిశోర్ మ‌దిలోంచి పుట్టుకొచ్చిన‌వే అంటున్నారు. ఇక‌, నేష‌న‌ల్ లెవెల్‌లో మోదీకి వ్య‌తిరేకంగా కూట‌మి క‌ట్టే ప్ర‌య‌త్నాల్లో ప్ర‌కాశ్ రాజ్‌ను ముందుంచ‌డం కూడా ఓ ఎత్తుగ‌డే. పీఆర్‌కు ప‌లు రాష్ట్రాల్లో గుర్తింపు ఉంది. మోదీకి బ‌ద్ద వ్య‌తిరేకిగా ముద్ర ఉంది. కేసీఆర్‌-మోదీ దొందు దొందేన‌నే అనుమానం ఉండ‌టంతో చాలా పార్టీలు గులాబీ బాస్‌ను న‌మ్మే ప‌రిస్థితి లేదు. అందుకే, మోదీ అంటే మండిప‌డే ప్ర‌కాశ్ రాజ్‌ను త‌న ప‌క్క‌నే పెట్టుకోవ‌డం.. తాను ప‌క్కా యాంటీ బీజేపీ అనే మెసేజ్ ఇచ్చేందుకే అంటున్నారు. ఇక మీద కూడా.. జాతీయ రాజ‌కీయాల్లో పీఆర్‌కు మ‌రింత ప్రాధాన్యం ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తోంది. పాపం.. ప్ర‌కాశ్‌రాజ్‌.. తాను మోదీకి వ్య‌తిరేకంగా కేసీఆర్‌తో క‌లిసి ఫైట్ చేస్తున్నాన‌ని అనుకుంటున్నారేమో.. కానీ, త‌న‌ను కేసీఆర్ ఫుల్లుగా వాడేసుకుంటున్నార‌ని ఆయ‌న‌కు ఎప్ప‌టికి తెలిసేనో..!

ఇక‌, ఎర్ర‌వ‌ల్లి ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌-పీకే-పీఆర్‌లు చ‌ర్చ‌లు, వ్యూహాలతో వాడి-వేడిగా గ‌డిపార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే తెలంగాణ‌లో ఐ-ప్యాక్ టీమ్ స‌ర్వేలు పూర్తి చేసింది. అన్నిట్లోనూ దారుణ ఫ‌లితాలే. ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌నే సిగ్న‌ల్సే. ఇదే విష‌యం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చిన ప్ర‌శాంత్ కిశోర్‌.. న‌ష్ట నివార‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది. మోదీని బూచీగా చూపి.. ముంద‌స్తుకు వెళ్ల‌డంపై ఆ ముగ్గురూ ఏకాభిప్రాయానికి వ‌చ్చార‌ని స‌మాచారం. గ‌తంలో మాదిరే.. ముందు ముంద‌స్తుతో రాష్ట్రంలో నెగ్గి.. ఆ త‌ర్వాత ఢిల్లీపై దండ‌యాత్ర జోరు పెంచాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. 

ఇక‌, ఎర్రవల్లిలో భేటీ తర్వతా గజ్వేల్ అభివృద్ధిని చూడాలని ప్రశాంత్ కిషోర్‌, ప్రకాష్ రాజ్‌ల‌కు కేసీఆర్ సూచించారు. అధికారులు దగ్గరుండి.. గజ్వేల్ మొత్తం తిప్పి చూపించారు. ఆ త‌ర్వాత అటునుంచి అటే కాళేశ్వ‌రం ప్రాజెక్టు సంద‌ర్శించారు. అయితే, పీకే స‌ల‌హాలు కేసీఆర్ స్వీక‌రించ‌డం కంటే కూడా.. కేసీఆరే ఇలా చేద్దాం.. అలా చేద్దాం.. అంటూ పీకే-పీఆర్‌ల‌ను గైడ్ చేశార‌ని స‌మాచారం. అలాగైతే.. య‌వ్వారం మ‌ళ్లీ మొద‌టికొచ్చిన‌ట్టేగా? తానే గొప్ప‌.. త‌న‌కే అన్నీ తెలుస‌నుకుంటే ఎట్టా? అంత‌మాత్రానికి పీకే ఎందుకు దండ‌గా?