వైనాట్ కుప్పం నుంచి పులివెందులలో ఓటమి వరకూ: జగన్ పతన ప్రస్థానం.!
Published on: Wed Nov 4, 2026 8:18AM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చారిత్రకమైనవిగా నిలిచాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ 151 స్థానాలను కైవసం చేసుకుని అఖండ విజయం సాధించింది. ఈ విజయంతో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల కథ ముగిసిపోయిందని అప్పట్లో పరిశీలకులు విశ్లేషణలు చేశారు. ఆ ఫలితాల మత్తులోఆ సమయంలో ఆ విజయంపై జగన్ హర్షం వ్యక్తం చేస్తూ తదుపరి ఎన్నికలలో వైనాట్ 175 అంటే వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే వైనాట్ కుప్పం అని కూడా ప్రకటించారు. 2024 ఎన్నికలకు ముందు కుప్పంలో విజయంపై భారీ భారీ ప్రకటనలూ చేశారు. అంతే కాకుండా వైనాట్ కుప్పం అన్న నినాదాన్ని బలంగా ప్రజలలోకి తీసుకు వెళ్లారు.
కుప్పం నియోజకవర్గంలో పట్టు సాధించాలనే ఉద్దేశంతో వైసీపీ నాయకత్వం చేయని ప్రయత్నం లేదు. జగన్ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యేక వ్యూహాలు అమలు చేయడంతో, 2021లో కుప్పం మున్సిపాలిటీని వైపీపీ కైవసం చేసుకుంది. ఆ సందర్భంగా జగన్ అతికి పోయి.. ఇప్పుడు చంద్రబాబు ముఖం చూడాలని ఉందంటూ వ్యాఖ్యానించారు. అయితే 2024 ఎన్నికలలో జగన్ కు తేరుకోలేని పరాభాం ఎదురైంది. వైనాట్ 175, వైనాట్ కుప్పం నినాదాలు మరుగున పడిపోయాయి. సొంత అడ్డా పులివెందులలో జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గింది. కడప జిల్లాలోనూ పలు అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి వశమయ్యాయి. అలా 2024 ఎన్నికల్లో జగన్ పార్టీ ఊహించని విధంగా ఘోర ఓటమిని చవిచూడటమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యింది.

ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన పురపోరులో పులివెందుల మునిసిపాలిటీలో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఒకప్పుడు చంద్రబాబును కుప్పంలో ఓడిస్తామంటూ ప్రగల్భాలు పలికిన జగన్, ఇప్పుడు సొంత నియోజకవర్గమైన పులివెందులలో పట్టు కోల్పోయి, మునిసిపాలిటీని కోల్పోయిన పరిస్థితి ఎదురైంది. చరిత్రలో తొలిసారిగా పులివెందుల కంచుకోటను తెలుగుదేశం బద్దలు కొట్టడం సంచలనంగా మారింది.
2019 ఎన్నికలతో పోలిస్తే 2024లో పులివెందులలో జగన్ మెజారిటీ దాదాపు 30 వేలు తగ్గింది. తాజాగా పులివెందుల గడ్డపైనే టీడీపీ విజయం సాధించడం ఆ పతనాన్ని మరింత పెంచింది. 2019 విజయం తర్వాత మరింత దూకుడుగా వ్యవహరించిన జగన్, కుప్పంలో పాగా వేసి చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీయాలని భావించారు. అయితే అదే వ్యూహం ఇప్పుడు రివర్స్ అయ్యింది. పులివెందుల మునిసిపాలిటీలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది.
[Why not Kuppam to Pulivendula defeat, Jagan, Pulivendula, Kuppam, TDP, Andhra Pradesh Politics, Chandrababu Naidu, AP Localbody Elections, Telugu One]


