ముందస్తుకు తొందరేల...!!?

 

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముందేఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులను కూడా సిద్ధంగా ఉండమని సంకేతాలు ఇస్తున్నారు. ఈసారి కూడా గెలుపు తమదే అని ఢంకా బజాయిస్తున్నారు. ఇవన్నీ సరే. అసలు గడవుకు ముందే ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం కల్వకుంట్ల వారికి ఎందుకొచ్చిందన్నది అటు రాజకీయ పక్షాలను, ఇటు తెలుగు ప్రజలను దొలిచేస్తున్న ప్రశ్న. ఇక్కడ తెలంగాణతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా మధ్యంతర ఎన్నికల ఊపులో ఉంది. రానున్న డిసెంబర్, జనవరి నెలల్లో ఎన్నికలకు పోవాలన్నది అటు కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇటు తెలంగాణలోని కె.చంద్రశేఖర రావుల యోచన. గడువు లేదు మిత్రమా అనుకుందామనుకున్నా.... అదీ తప్పే. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలకు ఏకంగా తొమ్మిది నెలల గడువుంది. కాని, ఈ ఇద్దరు నాయకులు మాత్రం నాలుగైదు నెలలకు ముందే వారి వారి సభలను రద్దు చేసి ఎన్నికల సమరాంగణంలో దూకుదామనుకుంటున్నారు. దీనికి కారణం ఏమిటీ. ! అని రాజకీయ విశ్లేషకులు ఆరాలు తీస్తున్నారు.  తెలంగాణ కాంగ్రెస్ నాయకులైతే ముందస్తుకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో ముందుగానే ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం అబ్బే తొందరలేదు.... మిత్రమా... ఇంకా సమయం ఉంది అనే అంటున్నారు.

 

 

తెలుగు రాష్ట్రాల ప్రజల్లో మాత్రం ఈ ముందస్తు గోల గందరగోళానికి దారి తీస్తోంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం,తెలంగాణలోని కె.చంద్రశేఖర రావు ప్రభుత్వం ముందుగా ముందస్తుకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నాయో మాత్రం ఇంత వరకూ తేల్చి చెప్పలేదు. అయితే, ఈ నాయకులు ముందస్తుకు ఎందుకు వెళ్లాలో తెలుసుకునేందుకు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. తమపై ఎక్కువ విశ్వాసమున్న నాయకులు ముందస్తుకు ఎన్నికలకు వెళ్లాలనుకుంటారు. అలాగే ఏదైనా జరగరానిది జరిగి ప్రజల నుంచి సానుభూతి వ్యక్తమై అవి ఓట్లుగా మారితే తిరిగి మరో నాలుగేళ్లు అధికారాన్ని అనుభవించ వచ్చు అని ఆశతో ఈ ముందస్తుకు వెళ్తారు. గతంలో ఓ సారి ఆంధ్రప్రదేశ్ ముఖ‌్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే వెళ్లారు. అలిపిరిలో ఆయనపై నక్సలైట్లు బాంబు దాడి చేస్తే తప్పించుకున్న చంద్రబాబు నాయుడు ఆ సానుభూతి తనపై కురుస్తుందని గంపెడాశతో ముందస్తుకు వెళ్లారు. అయితే అది బెడిసి కొట్టింది. అది వేరే సంగతి. ఇక కేంద్రంలో నరేంద్ర మోదీ, తెలంగాణలో కె.చంద్రశేఖర రావు ముందస్తుకు మాత్రం ఓ వ్యూహమే ఉందంటున్నారు. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి, ఆ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూల పవనాలే వీస్తున్నాయని అంటున్నారు. ఈ గాలిని మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలన్నది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు వ్యూహం. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీ తన కార్యక్రమాలతో కాసింత ఊపు పెంచింది. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తరచుగా తెలంగాణ పర్యటనలు చేస్తున్నారు. దీనికి తోడు తెలంగాణలో అంతో ఇంతో బలం మిగిలి ఉన్న తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో లోపాయికారి ఒప్పందం చేసుకుంటోందనే వార్తలు వస్తున్నాయి. ఈ బంధం బలపడితే తనకు ఇబ్బందే అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు భావిస్తున్నారు.

 

 

అలాగే పార్టీలోనూ, ప్రజల్లోనూ కూడా ప్రభుత్వంపై ఎలాంటి అసంత్రప్తి లేకుండా ఉన్న ఈ సమయంలోనే ఎన్నికలు జరిపి అధికారాన్ని కైవసం చేసుకోవాలన్నది ఆయన ఉద్దేశ్యం. తాను అంతర్గతంగా చేయించుకున్న సర్వేలో పార్టీ పట్ల ప్రజల్లో ఏమంత మంచి అభిప్రాయం లేదు. పైకి కబుర్లు చెబుతున్నారు కాని... లోలోపల ఆయనకు భయంగానే ఉంది. ఇవన్నీ తెలుసుకున్న కల్వకుంట్ల వారు ఎంత త్వరగా ఎన్నికలు ముగించి తిరిగి అధికారంలోకి రావాలా అని కంగారుగా ఉంది.   దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో పడ్డారు కల్వకుంట్ల వారు. మరోవైపు ముందుగా ఎన్నికలు నిర్వహించి కుర్చీలో కూర్చోవడంతో పాటు కేంద్రంలో తాను ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫెడరల్ ఫ్రంట్‌ను పటిష్టం చేయడం కూడా ఆయన పనే. అక్కడ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి... ఇక్కడ అధికారంలోకి వచ్చి రాష్ట్ర స్ధాయిలోనూ, జాతీయ స్ధాయిలోనూ తాను తిరుగులేని నాయకుడు అనిపించుకోవాలన్నది కె.చంద్రశేఖర రావు ప్రధాన ఉద్దేశ్యం. తనపైనా... ప్రభుత్వం పైనా వ్యతిరేక ముద్ర పడక ముందే విజయం సాధించాలన్నది ఆయన వ్యూహం. దీనికి ముందస్తు ఎన్నికలే ప్రధాన అస్త్రం అని ఆయన భావిస్తున్నారు. అందుకే అటు పార్టీ శ్రేణులను, ఇటు అధికార యంత్రాంగాన్ని కూడా పరుగులు పెట్టిస్తున్నారు. అలాగే కేంద్రంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనపై ఉన్న వ్యతిరేకత మరింత పెరగక ముందే ఎన్నికలు నిర్వహించి మరోసారి ప్రధానిగా అవతరించాలని భావిస్తున్నారు. చూడాలి. వీరి కోరికలు నెరవేరుతాయో..... ప్రజలు మార్పు కోరుకుంటారో... ఏమైనా మరో రెండు నెలల్లో ఎన్నికల పండుగ వాతావరణం మాత్రం రావడం ఖాయంగానే కనిపిస్తోంది. !!!