TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌ ఓటమి ప‌క్కానా? అందుకే కేసీఆర్ స‌భ లేదా? 

Published on: Mon Oct 25, 2021 9:03PM

సీఎం కేసీఆర్ తేల్చేశారు. హుజురాబాద్‌లో త‌న‌ స‌భ లేద‌ని చెప్పేశారు. అందుకు కార‌ణం విప‌క్షాల‌పై నెట్టేశారు. కానీ, అస‌లు కార‌ణం వేరే ఉందంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఓట‌మి ఖాయ‌మ‌ని తేల‌డంతోనే ముఖ్య‌మంత్రి ముఖం చాటేశార‌ని చెబుతున్నారు. అందుకు త‌గ్గ‌ట్టు గ‌త అనుభ‌వాల‌ను గుర్తు చేస్తున్నారు. ఈ రెండున్న‌ర ఏళ్ల‌లో ఉప ఎన్నిక‌లు జ‌రిగిన హుజూర్ న‌గ‌ర్‌, దుబ్బాక‌, నాగార్జున సాగ‌ర్ ఎన్నిక‌ల్లో కేసీఆర్ అమ‌లు చేసిన స‌భావ్యూహాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌స్తావిస్తున్నారు. 

ప‌క్కాగా గెలుస్తామ‌ని అనుకుంటేనే ఉప పోరు బ‌రిలో కేసీఆర్ అడుగుపెడ‌తారు. ఇంటెలిజెన్స్ స‌ర్వేలో కారు టాప్ గేరులో దూసుకుపోతుంద‌ని రిపోర్టులు వ‌స్తేనే.. గులాబీ బాస్ బ‌హిరంగ స‌భ పెడ‌తారు. లేదంటే.. అటువైపు క‌న్నెత్తి కూడా చూడ‌రు. ఆ మూడు ఉప ఎన్నిక‌ల్లో అదే జ‌రిగింది. ఆ లెక్క ప్ర‌కారం.. ఇప్పుడు హుజురాబాద్‌లో ఏం జ‌ర‌గ‌బోతోందో ఈజీగా గెస్ చేయొచ్చ‌ని అంటున్నారు. ఇంత‌కీ.. కేసీఆర్‌కు.. ఉప ఎన్నిక‌ల స‌భ‌కు ఉన్న లింకేంటి? ఆ పొలిటిక‌ల్ మీటింగ్‌ స్ట్రాట‌జీ ఏంటి?

ప‌రువు కోసం కేసీఆర్ ఎందాకైనా పోతారంటారు. పట్టుద‌ల‌కు పోతే.. పంతం నెగ్గించుకునే దాకా వ‌ద‌ల‌ర‌ని చెబుతారు. గెలుపునే కానీ ఓట‌మిని అస్స‌లు జీర్ణించుకోలేర‌నేది ఆయ‌న స‌న్నిహితుల మాట‌. గ‌తంలో రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఈట‌ల రాజేంద‌ర్‌ల విష‌యంలో అలానే జ‌రుగుతోంద‌ని అంటున్నారు. ఉప ఎన్నిక కాక‌పోయినా కొడంగ‌ల్‌లో స‌ర్వ‌శ‌క్తులూ ప్ర‌యోగించి రేవంత్‌ను ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్ట‌కుండా చేయ‌గ‌లిగారు కేసీఆర్‌. అయితే, గోడ‌కు కొట్టిన బంతిలా.. మ‌ల్క‌ాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలిచి ఏకంగా పార్ల‌మెంట్ స్థాయికి ఎదిగారు రేవంత్‌రెడ్డి. అప్పుడు రేవంత్ త‌ర్వాత.. ఇప్పుడు ఈట‌లపైనే అంతటి క‌సితో ఉన్నారు కేసీఆర్‌. త‌న అధికారాన్నే ధిక్క‌రించార‌నే కోపంతో ఈట‌ల రాజేంద‌ర్‌ను ఎలాగైనా అణిచేయాల‌ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ, హుజురాబాద్‌లో ఈట‌ల.. ఈటెలా గుచ్చుకుంటున్నారే కానీ, కరివేపాకులా తీసిప‌డేసే ప‌రిస్థితి లేద‌ని తేలిపోతోంది. ఇక ఉప ఎన్నిక‌ల్లో కేసీఆర్ స‌భ‌ల విష‌యానికి వ‌స్తే...

కేసీఆర్ రెండోసారి ముఖ్య‌మంత్రి అయ్యాక ఇప్ప‌టి వ‌ర‌కు ముచ్చ‌ట‌గా మూడు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. హుజూర్‌న‌గ‌ర్‌, దుబ్బాక‌, నాగార్జున సాగ‌ర్‌. ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి ఎంపీగా గెలిచి.. ఎమ్మెల్యేగా రిజైన్ చేయ‌డంతో హుజూర్‌న‌గ‌ర్‌కు ఉప ఎన్నిక వ‌చ్చింది. అక్క‌డ గులాబీ గాలి బ‌లంగా వీస్తోంద‌ని ముందుగా స‌ర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదిక‌లు తేల్చేశాయి. దీంతో.. సీఎం కేసీఆర్ హుజూర్‌న‌గ‌ర్‌లో భారీ బ‌హిరంగ స‌భ పెట్టేసి.. వ‌రాలు గుప్పించేశారు. హుజూర్‌న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ గెలిచింది. తానే కారు పార్టీని గెలిపించేశాన‌ని గర్వంగా ఫీల‌య్యారు కేసీఆర్‌. ఆయ‌న‌కు బాగా కిక్ ఇచ్చేది ఆ విజ‌య‌గ‌ర్వ‌మే అంటారు.  

నెక్ట్స్‌. దుబ్బాక‌. సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈసారి బీజేపీ నుంచి బ‌ల‌మైన అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్‌రావు బ‌రిలో నిలిచారు. ఎన్నిక‌ల ప్ర‌చారం హోరాహోరీగా సాగింది. హ‌రీశ్‌రావుకు దుబ్బాక పేరుతో అగ్నిప‌రీక్ష పెట్టారు. కేసీఆర్‌, కేటీఆర్ అటువైపు వెళ్ల‌నే లేదు. హుజూర్‌న‌గ‌ర్‌లో మాదిరి దుబ్బాక‌లో కేసీఆర్ స‌భ పెట్ట‌లేదు. ఎందుకంటే.. ఆ స‌మ‌యంలో దుబ్బాక‌లో ఎన్నిసార్లు స‌ర్వేలు చేయించినా.. ఎన్ని ఐబీ నివేదిక‌లు తెప్పించుకున్నా.. వాట‌న్నిటిలోనూ దుబ్బాక‌లో టీఆర్ఎస్ ఓట‌మి ఖాయ‌మ‌ని.. బీజేపీ కేండిడేట్ ర‌ఘునంద‌న్‌రావు గెలుపు ప‌క్కా అని తేల్చేశాయి. దీంతో.. తీవ్ర నిరాశ‌లో మునిగిపోయిన కేసీఆర్‌.. దుబ్బాక‌లో బ‌హిరంగ స‌భ ఆలోచ‌న విర‌మించుకున్నారు. తాను స‌భ పెట్టి.. ఓట‌ర్ల‌కు స్వ‌యంగా పిలుపిచ్చినా.. దుబ్బాక‌లో ఓడిపోతే.. త‌న ఇజ్జ‌త్ అంతా పోతుంద‌నుకున్నార‌ని.. అందుకే స‌భ పెట్ట‌లేద‌ని అప్ప‌ట్లో అన్నారు. 

తర్వాత నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి పోటీ చేశారు. అయితే నాగార్జున సాగర్ లో కేసీఆర్ చేయించిన సర్వేల్లో అధికార పార్టీ సానుకూలత లభించింది. అందుకే కొవిడ్ భయపెడుతున్నా నాగార్జున సాగర్ లో బహిరంగ సభ పెట్టారు. ఆ సభ తర్వాతే సీఎం కేసీఆర్ సహా వందలాది మంది టీఆర్ఎస్ నేతలు కొవిడ్ భారీన పడ్డారు. అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. సాగర్ లో సర్వేలన్ని కారు గెలుస్తుందని నివేదికలు ఇవ్వడం వల్లే కేసీఆర్ ప్రచార సభ నిర్వహించారని తేలింది. 

క‌ట్ చేస్తే.. ఇప్పుడు హుజురాబాద్ వంతు వ‌చ్చింది. ఇక్క‌డ ఈసారి కేసీఆర్ స‌భ పెడ‌దామ‌ని అనుకున్నా.. ఇప్పుడు క్యాన్సిల్ చేసేశారు. అంటే అర్థం.. కేసీఆర్‌కు ఓట‌మి మెసేజ్ వ‌చ్చిందా? స‌ర్వేలు, ఐబీ రిపోర్టులు టీఆర్ఎస్ ఓట‌మిని.. ఈట‌ల గెలుపును క‌న్ఫామ్ చేసేశాయా? అందుక‌నే ఈ నెల 27న భారీ బహిరంగ స‌భ పెట్టి అద‌ర‌గొడ‌దామ‌నుకున్న కేసీఆర్ మ‌న‌సు మార్చుకున్నారా? అంటే అవున‌నే అంటున్నారు. వారం వారం కేసీఆర్ చేయిస్తున్న స‌ర్వేలు, ఇంటెలిజ‌న్స్ పోలీసులు ఇస్తున్న నివేదిక‌లు హుజురాబాద్‌లో ఈట‌ల గెలుపునే సూచిస్తున్నాయ‌ని తెలుస్తోంది. హుజురాబాద్‌లో ఈట‌ల‌పై ద‌ళిత‌బంధులాంటి బ్ర‌హ్మాస్త్రం ప్ర‌యోగించినా.. ఓడిపోతున్నామ‌నే విష‌యం ముందుగానే తెలీడంతో కేసీఆర్ బాగా హ‌ర్ట్ అయ్యార‌ని అంటున్నారు. తాను స‌భ పెట్టినా ఓట‌మిపాలైతే.. ఈట‌ల ముందు త‌న త‌ల తీసేసిన‌ట్టు ఉంటుంద‌ని.. ఆ అవ‌మానాన్ని భ‌రించ‌లేకే.. ఈసీ రూల్స్‌ను సాకుగా చూపిస్తూ.. దుబ్బాక త‌ర‌హాలోనే హుజురాబాద్‌లోనూ బ‌హిరంగ స‌భ‌ను క్యాన్సిల్ చేసుకుని.. టీఆర్ఎస్ ఓట‌మిని కేసీఆర్ ముందే ఒప్పేసుకున్నార‌ని అంటున్నారు. ఇక, దొర‌త‌నాన్ని, ప్ర‌గ‌తి భ‌వ‌న్ దుర‌హంకారాన్ని ధిక్క‌రించిన ఈట‌ల‌.. హుజురాబాద్‌లో గెలిచి.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేగా అడుగు పెడితే... కేసీఆర్ ప‌రిస్థితి ఎట్లుంట‌దో...!!