TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వంగ‌వీటికేనా గ‌న్‌మెన్లు? మిగ‌తా టీడీపీ నేత‌ల‌కు ర‌క్ష‌ణేది?

Published on: Wed Dec 29, 2021 2:32PM

వంగ‌వీటి రాధాకృష్ణ‌. కొన్నిరోజులుగా సంచ‌ల‌నం. బెజ‌వాడ‌లో అల‌జ‌డి. త‌న‌పై రెక్కీ చేశార‌ని చేసిన ఒకేఒక్క ప్ర‌క‌ట‌న‌తో ఏపీ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా షేక్ అయ్యాయి. సీఎం జ‌గ‌న్ వెంట‌నే స్పందించారు. 2+2 గ‌న్‌మెన్ల‌ను కేటాయించారు. టీడీపీ నేత‌ల విష‌యంలో.. జ‌గ‌న్‌రెడ్డిలో ఇంత‌టి పాజిటివ్ క్విక్ రెస్పాన్స్ ఈమ‌ధ్య కాలంలో ఎప్పుడూ చూసుండ‌రు. అందులోనూ త‌న‌కు బ‌ద్ధ శ‌త్రువుల‌ని భావించే టీడీపీ నేత‌ల విష‌యంలో జ‌గ‌న్ ఇలా స్పందించ‌డం చాలా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ప‌రిణామ‌మే. అందుకే అంతా అవాక్క‌వుతున్నారు. వంగ‌వీటి మాత్రం త‌న‌కు ఇచ్చిన గ‌న్‌మెన్ల‌ను తిర‌స్క‌రించారు. 

వంగ‌వీటికి గ‌న్‌మెన్లు కేటాయించాల‌నే సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని అంతా స్వాగ‌తిస్తున్నారు. ప‌నిలో ప‌నిగా.. ప్రాణ‌హాని ఉన్న మిగ‌తా టీడీపీ నాయ‌కుల‌ సెక్యూరిటీ విషయం ఏంటన్న చర్చ వస్తోంది.  ఏపీ వ్యాప్తంగా అనేక మంది టీడీపీ నేత‌లు.. తమకు వైసీపీ వారి నుంచి ప్రాణ‌హాని ఉందని ఫిర్యాదులు చేశారు. ఈ జాబితాలో విజ‌య‌వాడ టీడీపీ లీడ‌ర్ల‌ే ఎక్కువున్నారు. దీంతో అడ‌గ‌కుండానే.. ఎక్కువ టైమ్ తీసుకోకుండానే.. వంగ‌వీటికి 2+2 ర‌క్ష‌ణ ఇవ్వాల‌ని ఆదేశించిన జ‌గ‌న్‌.. అదే జోరులో గ‌తంలో త‌మ‌కు గ‌న్‌మెన్లు కావాలంటూ రిక్వెస్ట్ పెట్టుకున్న బోండా ఉమా, ప‌ట్టాభిలాంటి లీడ‌ర్ల‌కూ టైట్ సెక్యూరిటీ క‌ల్పించాల‌నే చ‌ర్చ జోరందుకుంది. 

గ‌త స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల స‌మ‌యంలో విజ‌య‌వాడ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాపై మాచ‌ర్ల‌లో వైసీపీ మూక‌లు క‌ర్ర‌లు, రాళ్ల‌తో దాడికి పాల్ప‌డ్డారు. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కారును వెంటాడి.. వెంబ‌డించి.. అటాక్ చేశారు. దాదాపు హ‌త్యాయ‌త్నం చేసినంత ప‌ని చేశారు. ఆ దాడి నుంచి బోండా ఉమా అదృష్ట‌వ‌శాత్తూ బ‌య‌ట‌ప‌డ్డారు. ఆ టైమ్‌లో వైసీపీ రౌడీల చేతికి చిక్కిఉంటే.. ఆయ‌న ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉండిఉండేదో ఆనాటి దృశ్యాలు చూస్తే తెలిసిపోతోంది. ఆ ఘ‌ట‌న‌లో తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురైన బోండా ఉమా.. త‌న‌కు వైసీపీ నాయ‌కుల నుంచి ప్రాణ‌హాని ఉందంటూ.. త‌న‌కు పోలీస్ ప్రొటెక్ష‌న్ క‌ల్పించాలంటూ.. అప్ప‌టి విజ‌య‌వాడ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ ద్వార‌కా తిరుమ‌ల‌రావును క‌లిసి ఫిర్యాదు చేశారు. కానీ, బోండా ఉమా సెక్యూరిటీపై ఇప్ప‌టికీ అతీగ‌తీ లేదు. వంగ‌వీటి విష‌యంలో చూపించినంత ఇంట్రెస్ట్ బోండా ఉమాకు గ‌న్‌మెన్లు కేటాయించ‌డంపై ఎందుకు చూపించ‌డం లేదంటూ సీఎం జ‌గ‌న్‌ను నిల‌దీస్తున్నారు తెలుగు త‌మ్ముళ్లు. 

బోండా ఉమా అనే కాదు.. విజ‌య‌వాడ టీడీపీ నేత ప‌ట్టాభిదీ అదే త‌ర‌హా కేసు. గ‌తంలో కాకినాడ టీడీపీ ఆఫీసులో చొర‌బ‌డి ప‌ట్టాభిపై దాడి చేశారు వైసీపీ శ్రేణులు. ఆ త‌ర్వాత ఇటీవ‌ల బెజ‌వాడ‌లో ప‌ట్టాభి ఇంటిపై అటాక్ చేసి ధ్వంసం చేశారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న ఇంట్లో లేరు కాబ‌ట్టి స‌రిపోయింది.. లేదంటే..? ఎంత ప్ర‌మాదం జ‌రిగి ఉండేదో. అక్క‌డితో ఆగ‌కుండా.. ప‌ట్టాభి టార్గెట్‌గా మంగ‌ళ‌గిరి టీడీపీ కార్యాల‌యంపైనా దాడికి తెగ‌బ‌డ్డారు వైసీపీ దుండ‌గులు. అప్ప‌టి నుంచీ ప‌ట్టాభి ప్రాణ‌భీతితో బిక్కుబిక్కుమంటున్నారు. వైసీపీ రౌడీలు త‌న‌పై ఎక్క‌డ దాడి చేస్తారోన‌ని భ‌య‌ప‌డుతున్నారు. విజ‌య‌వాడ‌లో నిజంగా ర‌క్ష‌ణ కావాల్సింది ప‌ట్టాభికేన‌ని.. అత్యంత ప్రాణ‌హాని ఉన్న నాయ‌కుడు ప‌ట్టాభినే అని అంటున్నారు. అలాంటి ప‌ట్టాభికి సెక్యూరిటీ క‌ల్పించ‌ని ప్ర‌భుత్వం.. వంగ‌వీటి చేసిన ఒకేఒక్క స్టేట్‌మెంట్‌తో.. ఎవ‌రూ అడ‌గ‌కుండానే 2+2 గ‌న్‌మెన్లు ఇవ్వ‌డం వెనుక జ‌గ‌న్ రాజ‌కీయ వ్యూహం దాగుంద‌నే విమ‌ర్శ చేస్తున్నారు. 

మాజీమంత్రి దేవినేని ఉమాపై కొండ‌ప‌ల్లిలో వైసీపీ శ్రేణులు దాడి చేయ‌డం.. రాత్రంతా ఉద్రిక్త‌త రాజేయ‌డం.. లాంటి ఘ‌ట‌న‌ల‌తో దేవినేని ఉమా కూడా ప్రాణ‌హాని ఉన్న నేత‌ల జాబితాలో ముందున్నారు. అలాంటిది.. అలాంటి టీడీపీ నాయ‌కులంద‌రినీ వ‌దిలేసి.. వంగ‌వీటి రాధా ఎపిసోడ్‌లో మాత్రం జ‌గ‌న్‌రెడ్డి ఇలా వేగంగా స్పందించ‌డం వెనుక‌.. రాజ‌కీయ కోణ‌మే ప్ర‌ధానంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. వంగ‌వీటిని మ‌ళ్లీ పార్టీలోకి లాగేసుకోవాల‌నో.. జ‌న‌సేన‌కు కౌంట‌ర్‌గా కాపుల‌ను మ‌చ్చిక చేసుకోవాల‌నో.. టీడీపీలో చిచ్చు పెట్టాల‌నో.. కార‌ణం ఏదైనా రాధాకు గ‌న్‌మెన్లు కేటాయించ‌డం మాత్రం ప‌క్కా పొలిటిక‌ల్ స్టెంట్ అనే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇందులో రాజ‌కీయ కోణం లేద‌ని నిరూపించుకోవాలంటే.. వంగ‌వీటితో పాటు బోండా ఉమా, ప‌ట్టాభిల‌కు కూడా పోలీస్ ర‌క్ష‌ణ క‌ల్పించాల‌నే డిమాండ్లు వ‌స్తున్నాయి. మ‌రి, జ‌గ‌న్‌రెడ్డి అంతే వేగంగా స్పందిస్తారా? బోండా, ప‌ట్టాభిల‌కు గ‌న్‌మెన్లు కేటాయిస్తారా..