జీవీఎల్ సైలెన్స్‌కి కారణమేంటి? మోడీ-షాకి ఫిర్యాదు చేసిందెవరు?

జీవీఎల్ నరసింహరావు... బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్... ఇక జీవీఎల్ స్టైలే వేరు... ప్రెస్ మీట్ పెట్టారంటే ఏదో ఒక సంచలనం ఉండి తీరుతుంది... 2014కి ముందు పెద్దగా ఎవరికీ తెలియకపోయినా... ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికొచ్చాక... చంద్రబాబుపైనా, ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంపైనా తీవ్ర ఆరోపణలు చేయడంతో జీవీఎల్ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. జీవీఎల్ ఏ ఆరోపణ చేసినా నిజమేననిపించేలా ఉండేవి. ఎక్కువగా టీడీపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసేవారు. ఇవిగో ఆధారాలంటూ లెక్కలతో సహా వివరించేవారు. దాంతో, జీవీఎల్ ను ఎదుర్కోవడానికి టీడీపీ నేతలు నానా తిప్పలు పడేవారు. ప్రతి అంశంలోనూ లోతైన విషయ పరిజ్ఞానంతోపాటు వాగ్ధాటి మరో అడ్వాంటేజ్ గా ఉండటంతో టీవీ డిబేట్స్ లో ప్రత్యర్ధులపై మాటల తూటాలతో విరుచుకుపడేవారు. 

అయితే, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా, అలాగే బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీఎల్ కొద్దిరోజులుగా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఏపీలో ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం, రాజధాని వివాదం, మత వివాదం.... ఇలా అనేక బర్నింగ్ ఇష్యూస్ తో విపక్షాలన్నీ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే... జీవీఎల్ మాత్రం తనకేమీపట్టనట్టు మౌనంగా ఉండిపోవడం చర్చనీయాంశమైంది. ప్రత్యర్ధులపై పదునైన మాటలతో విరుచుకుపడుతూ బీజేపీ తరపున బలమైన వాయిస్ వినిపించే జీవీఎల్ ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయ్యారనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే, జీవీఎల్ మౌనం వ్యూహాత్మకమా? లేక అధిష్టానం ఆదేశమా అనే చర్చ జరుగుతోంది.

జీవీఎల్ సైలెన్స్ కి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. వైసీపీ అండ్ జగన్ సర్కారుపై బీజేపీ హైకమాండ్ ఇంకా స్పష్టమైన స్టాండ్ తీసుకోలేదని... అందుకే మౌనంగా ఉన్నారని అంటున్నారు. అయితే, రాజధాని ఇష్యూలో ఆమధ్య జగన్ సర్కారుకు అనుకూలంగా జీవీఎల్ మాట్లాడరనే విమర్శలు వచ్చాయి. ఏపీ బీజేపీ నేతలకు భిన్నంగా జీవీఎల్ మాట్లాడటంతో అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయని, దాంతో సైలెన్స్ అయ్యారని అంటున్నారు. మరోవైపు ఏపీ బీజేపీలో మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పులు జరిగిన తర్వాత, వైసీపీ అండ్ జగన్ సర్కారుపై ఎలా వ్యవహరించాలో స్పష్టత వస్తుందని, ఆ తర్వాత తన వాయిస్ వినిపించాలని జీవీఎల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, టీడీపీ, జనసేనతో మళ్లీ కలిసి సాగే అవకాశముందని ప్రచారం జరుగుతుండటంతో... దీనిపైనా క్లారిటీ కోసం చూస్తున్నారట. మొత్తానికి ప్రత్యర్ధులపై మాటల తూటాలు పేల్చే జీవీఎల్... వ్యూహాత్మకంగానే మౌనం పాటిస్తున్నారని... వన్స్ ఏపీ పొలిటికల్ స్టాండ్ పై అధిష్టానం క్లారిటీ ఇచ్చిందంటే మాత్రం మళ్లీ సూపర్ యాక్టివ్ అవుతారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.