TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐఏఎస్‌ ఆమ్ర‌పాలిరెడ్డితో సీఎం జ‌గ‌న్‌రెడ్డి భేటీ.. ఏంటి సంగ‌తి?

Published on: Tue Jan 4, 2022 10:41AM

ఆమ్ర‌పాలి కాటా. ఐఏఎస్‌. విశాఖ‌కు చెందిన ఆమె.. గ‌తంలో ఏపీ, తెలంగాణ కేడ‌ర్‌లో ప‌ని చేశారు. వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్‌గా రాణించారు. ఆ స‌మ‌యంలో నిత్యం న్యూస్‌లో ఉండేవారు. తెలుగురాష్ట్రాల్లో ఆమ్ర‌పాలిరెడ్డికి చాలా మంది ఫ్యాన్స్ ఉండేవారు. సోష‌ల్ మీడియాలో ఆమె పేరుతో అనేక ఖాతాలు ఉండేవి. క‌శ్మీర్‌కు చెందిన ఐపీఎస్‌ను ల‌వ్ మ్యారేజ్ చేసుకొని.. ఢిల్లీ కేడ‌ర్‌కు వెళ్లిపోవ‌డంతో.. ఆమ్ర‌పాలి కొంత‌కాలంగా వార్త‌ల్లో లేరు. తాజాగా, ఏపీ సీఎం జ‌గ‌న్‌.. ఢిల్లీలో ఆమ్ర‌పాలి ఇంటికెళ్లి మ‌రీ క‌లవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. వారిద్ద‌రి మీటింగ్‌పై స‌ర్వ‌త్రా అటెన్ష‌న్ నెల‌కొంది. ఇంత‌కీ సీఎం జ‌గ‌న్‌.. ఐఏఎస్ ఆమ్ర‌పాలిని ఎందుకు క‌లిసిన‌ట్టు? ఇంటికెళ్లి మ‌రీ మాట్లాడాల్సిన అవ‌స‌రం ఏమున్న‌ట్టు? అనే చ‌ర్చ న‌డుస్తోంది. ఢిల్లీలో అస‌లేం జ‌రుగుతోంది..?

సీఎం జ‌గ‌న్‌.. ఐఏఎస్ అధికారిణి ఆమ్ర‌పాలిని క‌ల‌వ‌డంలో ఆంత‌ర్యం లేక‌పోలేదు. ఆమ్ర‌పాలి ప్ర‌స్తుతం ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం-పీఎంవోలో డిప్యూటీ సెక్ర‌ట‌రీగా ఉన్నారు. ఇది చాల‌దా జ‌గ‌న్ స్వ‌యంగా ఇంటికెళ్లి మ‌రీ ఆమ్ర‌పాలిని క‌లిసేందుకు. అదే చేశారు ఆయ‌న‌. ఓ పూల బొకే ప‌ట్టుకెళ్లి.. నువ్వు విశాఖ‌, నేను విశాఖ.. నువ్వు రెడ్డి, నేను రెడ్డి... అంటూ మాట‌లు క‌లిపారు. పీఎం కార్యాల‌యంలో త‌న‌కు కావాల‌సిన ప‌నులు లిస్టు ఆమె చేతిలో పెట్టార‌ని అంటున్నారు. 

సీఎం జ‌గ‌న్ అనే కాదు.. గ‌త ఏడాది ఏపీ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ పీఎంవోలో ఆమ్రపాలిని కలుసుకున్నారు. ఆమెతో సెల్ఫీ కూడా దిగారు. ఆమ్ర‌పాలి ఆంధ్రప్రదేశ్‌‌కు గర్వకారణమని పోస్ట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కీలక విషయాల గురించి తెలుసుకునేందుకు ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆమె సహకారం తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జ‌గ‌నే నేరుగా ఆమ్రపాలితో భేటీ కావడం.. వాళ్లిద్ద‌రూ రెడ్డిలే కావ‌డం.. మ‌రింత‌ ఆస‌క్తిక‌రం. 

అయితే, జ‌గ‌న్‌రెడ్డి-ఆమ్ర‌పాలిరెడ్డిల భేటీపై పీఎంవో ఉన్న‌తాధికారులు సీరియ‌స్‌గా ఉన్నార‌ని తెలుస్తోంది. తన కార్యాలయంలో అధికారులు ఇలా ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ నేతలు, జర్నలిస్టులను కలుసుకోవడం ప్రధాని మోదీ ఇష్టపడరని అంటున్నారు. అందుకే, ఇలా పీఎంవోలో ప‌ని చేస్తున్న ఆమ్ర‌పాలి, ఏపీ సీఎం జ‌గ‌న్‌తో ప్ర‌త్యేకంగా క‌ల‌వ‌డంపై ఉన్న‌తాధికారులు గుర్రుగా ఉన్నార‌ని.. ఇక‌పై ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాల‌ని ఆమ్ర‌పాలికి సూచించార‌ని స‌మ‌చారం.