ఉండవల్లితో బ్రదర్ అనిల్ భేటీ.. అందుకేనా? చెల్లితో జగనన్నకు కష్టమేనా?
Published on: Fri Feb 25, 2022 1:33PM
వైఎస్సార్ టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ ఎస్ షర్మిల భర్త, క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనీల్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్’ను రాజమండ్రిలో కలిశారు. ఎందుకు కలిశారు, ఏమిటి కథ అనేది, ఇంకా స్పష్టం కాకపోయినా, ఏదో రాజకీయం ఉందనే చర్చ మాత్రం మొదలైంది. ఏమీ లేకుండా అనీల్, కేవలం ఉండవల్లి, ‘రాష్ట్ర విభజన’ ఫై రాసిన ‘పుస్తకం కోసమే ఆయన్నికలిశారంటే, అది నమ్మేలా లేదని రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. అంతే కాదు, వైఎస్ కుటుంబంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒంటరి అయిపోయిన నేపధ్యంలో,కుటుంబం నుంచే, ఆయనకు వ్యతిరేకంగా మరో రాజకీయ వేదిక ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే అనీల్, ఉండవల్లిని కలిసి ఉంటారని అంటున్నారు.అంతే కాకుండా, ఉండవల్లిని కలిసిన అనంతరం అనీల్ మీడియాతో మాట్లాడుతూ, ఓ వంక ఉండవల్లి పుస్తకం కోసమే ఆయన్ని కలిశానని అంటూనే, “మా సీక్రెట్స్ మాకుంటాయి, అవసరం వచ్చి నప్పుడు అన్నీ బయటకు వస్తాయి” అని బాంబు పేల్చారు.అలాగే ఉండవల్లి కూడా, వైఎస్ కుటుంబంతో ఉన్న సబందాలతోనే, అనీల్ భీమవరం వెళుతూ దారిలో తనను కలిశారారని చెప్పు కొచ్చినా చివర్లో అశ్వధామా అతః .. అన్నట్లుగా కుటుంబ విషయాలతో పాటుగా, రాజకీయాలు కూడా చర్చించామన్నారు.
అదలా ఉంటే, షర్మిల పార్టీ, వైఎస్సార్ టీపీకి, ఎన్నికల సంఘం గుర్తింపు ఇచ్చిన వెంటనే అనీల్ ఉండవల్లిని కలవడంతో ఈ భేటీకి మరింత ప్రాధాన్యత ఏర్పడిందని అంటున్నారు. నిజానికి షర్మిల పార్టీ ఏర్పాటు చేసి పది నెలల పైగానే అయినా, ఎప్పుడు రాజకీయ వేదికపై కనిపించని అనీల్,ఇప్పడు నేరుగా రాజకీయ ప్రముఖులను కలవడం, రాజకీయాలు చర్చించడంతో ఈ భేటీకీ మరింత ప్రధాన్యత ఏర్పడింది. అంతే కాకుండా అనీల్ తెలంగాణలో కాకుండా, ఏపీలో రాష్ట విభజనకు సంబందించి తాజా చర్చ జరుగుతున్న సమయంలో ఆ చర్చకు కేంద్ర బిందువుగా ఉన్న ఉండవల్లి కలిసి, ఆ విషయాలు చర్చించడంతో రాజకీయ వర్గాల్లో ఉండవల్లి , బ్రదర్ అనీల్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడిందని అంటున్నారు.
నిజానికి, జగన్ రెడ్డి, సోదరి షర్మిల మధ్య విబేధాలు పతాక స్థాయికి చేరాయని చాలా కాలంగా ఇటు పార్టీలో, ఫ్యామిలీలో చర్చ జరుగుతోంది. చివరకు బాబాయ్ వివేకా హత్య కేసువిషయంలోనూ జగన్, షర్మిల చెరో వైపున ఉన్నారు. వైసీపే ఎంపీ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చేదుకు కూడా షర్మిలా సిద్దంగా ఉన్నారని,అంటున్నారు. అదెలా ఉన్నా, ఇటీవల షర్మిల ఏపీలో పార్టీని విస్తరిస్తారా, అని అడిగిన ప్రశ్నకు, ఎందుకు విస్తరించ కూడదు, అలాగని రాజ్యాంగంలో వుందా అని ప్రశ్నించారు. అయితే ఆ వెంటనే ఇప్పిటికైతే అలాంటి అలోచన లేదని అవసరం అయితే చూద్దాం అంటూ, చెప్పవలసింది చెప్పేస్తూనే సమాధానాన్ని దాట వేసే ప్రయత్నం చేశారు. ఇక ప్రస్తుతానికి వస్తే, వైఎస్సార్ టీపీకి ఈసీ గుర్తింపు వచ్చిన నేపధ్యంలో షర్మిల ఏపీ మీదకు దృష్టి మరల్చారా అనే అనుమానాలు మొదలయ్యాయి. అదే జరిగితే, ఇప్పటికే పీకల లోతు కష్టాల్లో ఉన్న జగనన్న ...కు ముందున్నది అంతా కష్ట కాలమే అంటున్నారు.


