కాగితాలతో ప్రపంచం నాశనం!

చుట్టూ ఎన్ని కంప్యూటర్లు వచ్చినా, ప్రపంచం ఎంత డిజిటల్ విప్లవాన్ని సాధించినా... పేపరు వాడకం పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. 90 శాతానికి పైగా కాగితాలని చెట్ల నుంచి తయారుచేయాల్సిందే! ఇలా టన్నులకొద్దీ కాగితాలను తయారుచేయడానికి ఏటా 300 కోట్లకు పైగా చెట్లని నాశనం చేయవలసి వస్తోంది. ఇక కాగితం తయారీకి కావల్సిన నీటి సంగతి చెప్పనవసరం లేదు. ఒక కిలో కాగితం తయారుచేయడానికి 300 లీటర్ల నీరు కావాలి. ఇక కాగితం తళతళ్లాడిపోయేలా చేయడం దగ్గర నుంచీ దాని మీద ప్రింటింగ్ చేయడం వరకూ నానారకాల రసాయనాలనూ ఉత్పత్తి చేయక తప్పదు.

 

కాగితాన్ని ఉత్పత్తి చేసేందుకు కొన్ని చెట్లను ప్రత్యేకించి పెంచుతూ ఉంటారు. కానీ తయారీ కోసం నరికే చెట్లలో ఇవి కొద్ది శాతం మాత్రమే. కాబట్టి కాగితం వాడకాన్ని తగ్గించకపోతే నీరు, గాలి కలుషితం కావడం అటుంచి... భూమ్మీద చెట్టనేదే లేకుండా పోతుంది. మన వంతుగా తీసుకునే చిన్న చిన్న చర్యలు కూడా కాగితం వృధా కాకుండా అడ్డుకుంటాయని చెబుతున్నారు నిపుణులు.

 

- ఏటీఎం, మెడికల్ షాప్, సూపర్ మార్కెట్ ఇలా ఎక్కడికి వెళ్లినా ఒకో బిల్లు తెచ్చుకోవడం మనకి అలవాటు. కొనేది ఒకటి రెండు వస్తువులే అయినా, బిల్లు విషయంలో అనుమానం లేకపోయినా, స్క్రీన్ మీద అంతా కనిపిస్తున్నా... బిల్లు లేకుండా బయటకు రాలేం. ఈ బిల్లుల కోసం కాగితం తయారీ, వాటి మీద ఇంకు... రెండూ కూడా పర్యావరణానికి నష్టమే! ఇలాంటి చోట బిల్లు అవసరం లేదన్న ఒక్క మాట కాగితం వృధాని ఆపుతుంది.

 

- ఇప్పుడు ప్రతి పుస్తకమూ ఈ-బుక్ రూపంలో లభిస్తోంది. అయినా పాత అలవాటుని వదులుకోలేకనో, పుస్తకం ఇచ్చే సాంత్వన కోసమో జనం ఏటా కోట్ల పుస్తకాలు కొంటూనే ఉన్నారు. ఈ పద్ధతి మారేందుకు కొన్నాళ్లు పడుతుందేమో! కానీ మళ్లీ చదవాల్సిన అవసరం లేదు అన్న పుస్తకాన్ని మరొకరికి ఇచ్చేస్తే సరి.

 

- మన కంటి ముందున్న ప్రతి కాగితమూ ఈ లోకాన్ని నాశనం చేస్తూ పుట్టింది అన్న అవగాహన ఉన్నప్పుడు... చిన్నపాటి కాగితాన్ని కూడా వృధా చేయం. కాగితాన్ని రెండువైపులా వాడటం, ఏదన్నా నోట్స్ రాసుకునేందుకు చిన్నపాటి కాగితాలను ఉపయోగించడం లాంటి చర్యలు చాలా కాగితాన్నే ఆదా చేస్తాయి.

 

- ఇంట్లో ఓ నలుగురు చేరినా కూడా కాగితం ప్లేట్లు, పేపరు కప్పులు వాడేస్తుంటాం. ఇవి చూసేందుకు సోగ్గా కనిపించవచ్చు. కానీ పేపరు కప్పులలో ఏం పోసిన తడిసిపోకుండా ఉండేందుకు వాటిలో నానారకాల రసాయనాలు కలుపుతారు. వీటి వల్ల ఆరోగ్యం ఎలాగూ దెబ్బతింటుంది. పైగా వీటిని రీసైకిల్ చేయడం కూడా కష్టమైపోతుంది.

 

- ఆఫీసులో మనం ఎంత కాగితం వాడుతున్నామో అడిగేవారు లేకపోవచ్చు. పైగా చేతిలో ప్రింటర్ కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి అంతగా ఆలోచన లేకుండానే కిలోల కొద్దీ కాగితాన్ని వాడేస్తుంటాం. ఈమెయిల్స్, వర్డ్ డాక్యుమెంట్స్ ద్వారా చక్కబెట్టే పనులకి కాగితాన్ని వాడకపోవడం, ప్రింట్ అవుట్ అవసరం అయినా చిన్నపాటి కాగితాలని ఉపయోగించడం, రెండువైపులా ప్రింట్ ఔట్ తీసుకోవడం వంటి చర్యలతో కాగితం వృధా కాకుండా ఉంటుంది. ఆపీసులో కాగితం వాడకానికి కూడా ఒక చిన్నపాటి ఆడిట్ జరిగితే... వీలైనంత వృధా తగ్గిపోతుంది.

- నిర్జర.