గుంటూరు లో మరో కోయంబేడు

కరోనా వ్యాప్తి ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా భారత్ లో కోవిడ్ 19 కేసులు రెండు లక్షలు దాటేశాయి. కేసులు విపరీతంగా పెరగడానికి కొంత మంది సూపర్ స్ప్రెడర్లు అలాగే కొన్ని ప్రాంతాలు కారణం అవుతున్నాయి. అటువంటి వాటిలో కృష్ణ లంక లోని ఒక లారీ డ్రైవర్ ఫ్యామిలీ, ఒక కోయంబేడు మార్కెట్ లాంటి వ్యక్తులు, ఘటనలు కారణమవుతున్నాయి. తమిళనాడు లోని ఒక వెజిటబుల్ మార్కెట్ ద్వారా అటు తమిళనాడు, కేరళ ఇటు ఏపీలోనూ చాల కరోనా కేసులు నమోదు అయ్యాయి. తాజాగా గుంటూరు లోని వెజిటబుల్ మార్కెట్ ద్వారా ఇదే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నెల క్రితం గుంటూరు నగరంలో బస్ స్టాండ్ పక్కనే ఉన్న కూరగాయల హోల్ సెల్ మార్కెట్ ను నగర పొలిమేరలో ఉన్న ఏటుకూరు రోడ్ కు తరలించారు. ఇక్కడ మొత్తం 450 మంది వ్యాపారులు పాల్గొంటున్నారు. ఈ మార్కెట్ కు చిన్న వ్యాపారులతో పటు చుట్టూ పక్కల గ్రామాల నుండి కూడా ప్రజలు వచ్చి కొనుగోళ్లు చేస్తూ ఉంటారు. తాజాగా ఇక్కడ కొద్ది రోజుల్లోనే ముందుగా ముగ్గురు, తరువాత ఐదుగురికి, ఆ తరువాత పదహారు మందికి మొత్తం 23 మంది వ్యాపారులకు కరోనా పాజిటివ్ తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనికి ముఖ్య కారణం వారం క్రితం గుంటూరు నగరం లో రెడ్ జోన్ నుండి వచ్చి వ్యాపారం చేస్తున్న ఒక వ్యక్తికీ కరోనా సోకి అది మరి కొంత మంది వ్యాపారులకు సోకినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు అక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించక పోవడం కూడా ఒక కారణంగా చెప్తున్నారు. ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అటు అధికార వర్గాల్లో అలాగే వ్యాపారుల్లో కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ మార్కెట్ ను కొద్ది రోజులు మూసి వేసి ఆ ప్రాంతాన్ని శానిటైజ్ చేస్తున్నారు.