హూ ఈజ్ సజ్జల?.. ఆయనే ఎందుకు టార్గెట్?
Published on: Thu Feb 3, 2022 3:16PM
హూ ఈజ్ సజ్జల? ఇది ప్రశ్న కాదు ప్రకోపం. చలో విజయవాడలో.. ఉద్యోగులంతా ముక్తకంఠంగా నిలదీశారు. హూ ఈజ్ సజ్జల.. అంటూ గట్టిగా ప్రశ్నించారు. సజ్జలతో మేం చర్చలు జరపబోం.. అసలు ఎవరండీ ఈ సజ్జల? ప్రభుత్వంలో భాగమా? అంటూ కడిగేశారు. సలహాదారులతో చర్చలకు హాజరుకాబోమని.. ఉద్యోగ సంఘాలు సైతం గట్టిగా డిసైడ్ అయ్యాయి. సజ్జల వస్తే.. మేం రాము.. సజ్జలతో కాకుండా నేరుగా సీఎం జగన్‌తో అయితేనే మేం చర్చలు జరుపుతాం.. అంటూ విజయవాడలో ఉద్యోగులు తేల్చి చెప్పాయి. హూ ఈజ్ సజ్జల? అనే నినాదంతో బెజవాడ మారుమోగిపోయింది. కట్ చేస్తే.. తాడేపల్లి ప్యాలెస్‌లో సజ్జలతో సీఎం జగన్ అత్యవసర భేటీ జరపడం ఆసక్తికర పరిణామం.
పాదయాత్ర వేళ నేను ఉన్నాను.. నేను విన్నాను అనే జగన్ ఇపుడు తమ గోడు వినడంలేదని.. తాడేపల్లి నివాసం నుంచి బయటకు రావడంలేదని.. ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జగన్‌కంటే సజ్జలపైనే ఉద్యోగులు ఎక్కువగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సలహాదారుల చెప్పుడు మాటలు విని.. జగనన్న తమకు అన్యాయం చేస్తున్నాడని అనుకుంటున్నారు. సజ్జలతో పాటు ఐఏఎస్‌లూ ముఖ్యమంత్రిని తప్పుదారి పట్టిస్తున్నారని భావిస్తున్నారు.
ఇక్కడే ఉద్యోగ సంఘాలు పప్పులో కాలేస్తున్నాయనేది కొందరి మాట. జగనన్న తక్కువోడేం కాదు.. జగన్‌రెడ్డి డైరెక్షన్‌లోనే సజ్జల స్క్రీన్‌ప్లే రచిస్తున్నారని చెబుతున్నారు. జగన్‌కు సలహాలిచ్చేంత సీన్ సజ్జలకు లేదని.. జగన్ సలహాల మేరకే సజ్జల పాత్రాభినయనం చేస్తున్నారని అంటున్నారు. జగన్ జగమొండి ఘటం.. ఆయన మరొకరి మాట వినే రకం కాదు. ఉద్యోగులకు ఇప్పటికే ఎక్కువ జీతాలు ఇస్తున్నాం.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు శాలరీలు పెంచేశాడు.. టీడీపీ ప్రభుత్వ హయాం నుంచీ ఉద్యోగులు జీతాల రూపంలో ఖజానాను దోచుకుంటున్నారు.. అందుకే, వారి జీతాలను సవరణ పేరుతో కోత వేయాలని జగనన్నే నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని.. అమలు చేసే పనిని తనకు నమ్మకదారుడైన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు.
ఇక, సజ్జల తనదైన స్టైల్‌లో.. సుతిమెత్తగా మాట్లాడుతూ.. సన్నాయినొక్కులు నొక్కుతూ.. జీతాలు నొక్కేసే పనికి శ్రీకారం చుట్టారని అంటారు. ఉద్యోగులను ఒప్పించేందుకు చర్చల పేరుతో సోప్ రాసినా.. ఉద్యోగులు మాత్రం తమకు జరుగుతున్న అన్యాయం గుర్తించి.. సజ్జల ఉచ్చునుంచి ( జగన్ ఉచ్చు) చాకచక్యంగా బయటకొచ్చారు. సమ్మె సైరన్ మోగించారు. టీజర్‌గా చలో విజయవాడతో దుమ్ము దులిపేశారు. జగన్ ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించారు.
విజయవాడలో ఉద్యోగుల ఉప్పెన చూసి.. జగనన్న జడుసుకున్నట్టున్నారు. వెంటనే, తన సలహాదారు సజ్జలను పిలిపించుకుని.. ప్లాన్-బి కోసం మంతనాలు జరుపుతున్నారు. బెజవాడలో మాత్రం.. హూ ఈజ్ సజ్జల? అంటూ ఉద్యోగులు మండిపడుతున్నారు. సజ్జలను చర్చల దరిదాపుల్లోకి కూడా రానివ్వమంటూ హెచ్చరిస్తున్నారు. ఇక, సీఎం జగన్‌తోనే పీఆర్సీపై తాడేపేడో తేల్చుకుంటామంటూ సవాల్ చేశారు. ఓవైపు సమ్మె గడువు సమీపిస్తుండటం.. చలో విజయవాడతో సమరశంఖం పూరించడం చూస్తుంటే.. జగన్ ప్రభుత్వ పతనానికి ఇదే ఆరంభం అనే మాట వినిపిస్తోంది. తగ్గేదేలే అని పంతానికి పోకుండా.. తాత్కాలికంగానైనా.. తగ్గి నెగ్గాలనే ప్లాన్-బి ని జగన్ అండ్ టీమ్ రెడీ చేస్తోందని తెలుస్తోంది.


