TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీటీడీ చైర్మన్ గిరి మళ్లీ రెడ్డికేనా? రేసులో ఉన్నదెవరు..? 

Published on: Sun Jun 6, 2021 11:52AM

తిరుమల తిరుపతి దేవస్థానానికి త్వరలో కొత్త చైర్మన్ రాబోతున్నారు. ప్రస్తుతం చైర్మన్  వైవీ సుబ్బారెడ్డి పదవి కాలం ఈ నెల 21వ తేదీతో ముగియనుంది. తనకు రెన్యూవల్ వద్దని సీఎం జగన్ కు వైవీ చెప్పారని తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ పదవిపై అసంతృప్తిగా ఉన్న సుబ్బారెడ్డి.. మంత్రి కావాలని కోరుకుంటున్నారట. ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్ లోకి తీసుకోవాలని ఆయన జగన్ కు కోరారని.. కాని జగన్ మాత్రం ఆయనను రాజ్యసభకు పంపించే  యోచనలో ఉన్నారని అంటున్నాకు. 2014లో ఒంగోలు ఎంపీగా గెలిచిన వైవీ సుబ్బారెడ్డికి.. 2019లో టికెట్ ఇవ్వలేదు. టీడీపీ నుంచి పార్టీలో చేరిన మాగుంట శ్రీనివాసు రెడ్డికి టికెట్ ఇచ్చారు. జగన్ తీరుపై వైవీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చి కూల్ చేశారని చెబుతారు. 

టీటీడీ చైర్మన్ రేసులో హేమాహేమీల పేర్లు వినిపిస్తున్నాయి. నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మేకపాటి తనయుడు గౌతం రెడ్డి మంత్రిగా ఉన్నారు. మళ్ళీ అదే కుటుంబంలోనీ వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే అన్ని విధాలుగా విమర్శలు వస్తాయని కొందరు వైసీపీ నేతలు చెబుతున్నారట. తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. మంత్రి పదవి రాలేదనే అసంతృప్తితో ఉన్న భూమన కూడా టీటీడీ చైర్మన్ పదవి కోసం గట్టిగా లాబీయింగ్ చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే భూమనకు ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి హామీ ఇవ్వలేదని పార్టీ వర్గాల సమాచారం. 

టీటీడీ చైర్మన్ పదవిని ఈసారి కూడా రెడ్డికే ఇస్తారా లేక మరో వర్గానికి ఇస్తారా అన్నది ఆసక్తిగా మారింది. జగన్ ప్రభుత్వంలో కీలక నామినేటెడ్ పోస్టులన్ని రెడ్లకే ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటివరకు టీటీడీ చైర్మన్ తో పాటు టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డి, అదనపు ఈవోగా ధర్మారెడ్డి ఉన్నారు. దీంతో అనేక రకాల విమర్శలు వచ్చాయి. వేంకటేశ్వర స్వామి వారిని వెంకటేశ్వరరెడ్డి గా మార్చేసారనే విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షాలు చేసే విమర్శల ను సీఎం జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోరని అంటారు. అయితే  ప్రజల్లో వ్యతిరేక భావన వస్తుందని, ఏ సమస్యనైనా తెగేదాకా లాగ కూడదని పార్టీ అధిష్టానం భావిస్తోందని అంటున్నారు. 

తాజాగా  రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ సీవీఎస్ కే శర్మను టీటీడీ చైర్మన్ గా చేస్తే ఎలా ఉంటుంది అని పార్టీ నాయకులు సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కి అత్యంత ఇష్టమైన, ముఖ్యమైన అధికారిగా శర్మకు పేరుంది. ఆయనను జలయజ్ఞం శర్మ గా పిలిచేవారు. ప్రస్తుత సీఎం జగన్ కు కూడా శర్మతో మంచి సంబంధాలున్నాయి. తన కోసం, తన తండ్రి వైఎస్ రాశేఖరరెడ్డి కోసం సీబీఐ విచారణను ఎదుర్కొని, కోర్టుల చుట్టూ తిరిగిన వారిలో cvsk శర్మ కూడా ఒకరు. తన కోసం, తన కుటుంబం కోసం ఇబ్బందులు పడ్డ ప్రతీ ఐఏఎస్ అధికారి కీ ఏదో ఒక రూపంలో మేలు చేస్తూ వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు శర్మ కోసం ఏమీ చేయలేదని, ఇప్పుడు ఆయనకు ఎంతో కొంత మేలు చేసే అవకాశం వచ్చిందని కొందరు నాయకులు అంటున్నారు.