పలికింది కేసీఆర్.. పలికించింది?
Published on: Fri Feb 4, 2022 10:19AM
రాజ్యాంగాన్ని మార్చాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో దుమారం రేపాయి. ముఖ్యంగా, రాష్ట్రంలో తెరాసకు ప్రధాన రాజకీయ ప్రత్యర్ధిగా ఎదిగేందుకు,ప్రయత్నిస్తున్న బీజేపీ, ముందు వెనకా చూసుకోకుండా కదన రంగంలోకి దూకేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటూ చసిన వ్యాఖ్యలపై అందరికంటే ముందుగా ఫైర్ అయ్యారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్’ను కేసీఆర్, అవమానించారంటూ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఏకంగా ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదే విషయంగా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా జై భీం... దీక్షలు, ఆందోళనలు చేస్తోంది.
అయితే, తీగ లాగితే డొంకంతా కదిలింది అన్నట్లు, వివాదంలో లోల్లోకి వెళితే, రాజ్యాంగాన్ని మార్చాలనే, తిరగ రాయాలనే ఆలోచన పేటెంట్ ‘ హక్కు బీజేపీదే కానీ, కేసీఆర్’డి కాదని తేలింది. అందుకే కాంగ్రెస్ పార్టీ కేసేఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూనే, బీజేపే బండారాన్ని బయట పెట్టింది. రాజ్యాంగాన్ని తిరగరాయలని, ‘పలికింది’ కేసీఆరే అయినా, పలికించింది , ‘మోడీ’ నే అంటూ, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అలాగే, ముఖ్యమంత్రి వెనుక ఆర్ఎస్ఎస్, ప్రధాని నరేంద్ర మోడీ వున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు తోడు దొంగలేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
అయితే, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిజమేనా? అంటే, రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచన కేసీఆర్ పుర్రెలో పుట్టింది కాదు, అంతకంటే ముందే ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు ఆ దిశగా ఆలోచనలు చేశారని, పరిశీలకులు అంటున్నారు. గతంలో 2000 సంవత్సరంలో, ఎన్డీఎ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధాన అటల్ బిహారీ వాజపేయి రాజ్యాంగం పనితీరును సమీక్షించేందుకు, జస్టిస్ మానేపల్లి నారాయణ రావు వెంకటా చలయ్య కమిషనను ఏర్పాటు చేశారు. అయితే, కమిషన్ నివేదిక వచ్చే సమయానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అది బుట్ట దాఖలైంది.
సరే అదేదో అయిపోయిన అధ్యాయం అనుకున్నా, ప్రస్తుత మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2017లో అప్పటి కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే, ఇప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మించి, ‘రాజ్యాంగాన్ని మారడానికే బీజేపీ అధికారంలోకి వచ్చింద’ని బహిరంగ వేదిక నుంచి ప్రకటించారు. ఆ సందర్భంగా ఆయన 'రాజ్యాంగంపై నాకు గౌరవం ఉంది. అయితే రానున్న రోజుల్లో అది మారనుంది. మేం ఇక్కడున్నది అందుకే. అందుకోసమే మేం వచ్చాం' అని ప్రకటించారు.
హెగ్డే చేసిన ఈ వివాదస్పద వ్యాఖ్యలు, పార్లమెంటును కూడా తాకాయి. 2017 డిసెంబర్ 27 న పార్లమెంట్ ఉభయ సభల్లోనూ, తీవ్ర దుమారం చెలరేగింది. విపక్షాలు సభా కార్యక్రమాలను అడ్డుకుంటూ మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. అయితే, ఆ తర్వాత హెగ్డే దానిపై వివరణ ఇచ్చారు. 1976లో రాజ్యాంగ మూల సూత్రానికి విరుద్ధంగా రాజ్యాంగ పీఠికలో చేర్చిన 'సెక్యులర్', 'సోషలిస్టు' అనే పదాలకు సంబంధించి మాత్రమే తాను మాట్లాడానని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గురించి తాను ఎలాంటి వ్యాఖ్య చేయలేదని వివరణ ఇచ్చారు.
ఈ నేపద్యంలో చూస్తే ఎవరు అవునన్నా,కాదన్నా రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచన పేటెంట్’ హక్కు బీజేపీదే అనిపిస్తుంది. నిజానికి, కొద్ది నెలల క్రితం, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని మార్చాలని,రిజర్వేషన్లు తొలిగించాలని కోరుతోందని ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, మీడియా ముందుకు వచ్చి రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచన తమకు లేదని, అలాగే, రిజర్వేషన్ల విషయంలోనూ వేరే ఆలోచన లేదని వివరణ ఇచ్చారు. అంటే, పైకి చెప్పినా చెప్పక పోయినా, ఆర్ఎస్ఎస్, బీజేపీ లోలోన అదే లోచన చేస్తున్నాయని అనుకోవచ్చును. సో.. కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లుగా, బీజేపీనే కేసేఅర్ చేత మళ్ళీ మరోమారు రాజ్యాంగ వివాదాన్ని రాజేసిందని అంటే, కాదన లేము. అయితే, అంబేద్కర్ బతికుండగానే ఆయన్ని, అదేవిదంగా రాజాయంగాన్ని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకీ ఉందనుకోండి .. అది వేరే చర్చ.


