మాజీ మంత్రి నారాయణ ఎక్కడ?.. నెల్లూరు గ్రౌండ్ రియాలిటీ..
Published on: Tue Dec 28, 2021 9:31AM
మంత్రిగా చక్రం తిప్పారు. మాజీ కావడంతో అడ్రస్ లేకుండా పోయారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు కుడిభుజంగా మెదిలారు. అధికారం చేజారగానే.. సైలెంట్ అయ్యారు. నెల్లూరు నారాయణకు చంద్రబాబు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఎలాంటి అనుభవం లేకున్నా.. ఏకంగా అత్యంత కీలకమైన మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కట్టబెట్టారు. సీఆర్డీఏ బాధ్యతలూ ఆయన చేతికే ఇచ్చారు. అమరావతి నిర్మాణంలో భాగస్వామిని చేశారు. ఇంతా చేస్తే.. అంతగా నెత్తిన పెట్టుకుంటే.. తీరా ప్రభుత్వం పడిపోగానే పత్తా లేకుండా పోయారు పొంగూరు నారాయణ. ఇప్పుడా మాజీ మంత్రి నారాయణ కనబడుటలేదు. అమరావతిలో లేరు.. నెల్లూరులో లేరు.. ఆయన్ను నమ్మి అధికారంలో ఉన్నప్పుడు అందలమెక్కిస్తే.. ఓడిపోయాక తనదారి తాను చూసుకున్నారు. చంద్రబాబుకు, టీడీపీకి, ప్రజలకూ దూరంగా ఉంటున్నారు. గతంలో కొడుకు చనిపోయినా.. 10 రోజుల్లోనే మళ్లీ యాక్టివ్ అయిన నారాయణ.. ఇప్పుడు అధికారం కోల్పోయాక పట్టుమని 10 రోజులు కూడా చంద్రబాబును అంటిపెట్టుకుని లేరు. చేతులు దులిపేసుకున్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అధినేతను గానీ, పార్టీని గానీ పట్టించుకోకుండా.. తన వ్యాపారాలు తాను చూసుకుంటున్నారు. టీడీపీలో నారాయణలాంటి వాళ్లు ఇంకా చాలామందే ఉన్నారు. అలాంటి వారి తాజా పరిస్థితి వివరించడమే ఈ తెలుగువన్.. గ్రౌండ్ రియాలిటీ.
పొంగూరు నారాయణ. తన పేరునే ఓ బ్రాండ్‌గా మార్చేశారు. నారాయణ విద్యాసంస్థలతో తెలుగురాష్ట్రాల్లో విద్యావ్యాపారం చేశారు. ఎల్కేజీ టూ ఐఐటీ.. కోచింగ్‌లో నెంబర్ వన్ సంస్థగా తీర్చిదిద్దారు. నారాయణ సంస్థలతో పాటు సంపద కూడా భారీగా పెరిగింది. లెక్కలేనన్ని విద్యా సంస్థలు.. లెక్కకుమిక్కిలి విద్యార్థులు.. భారీగా ఫీజులు.. లక్ష్మీదేవి నాట్యం చేస్తుంటుంది నారాయణ ప్రాంగణాల్లో. అంతులేని సంపద వచ్చాక.. ఆయన దృష్టి పాలిటిక్స్ వైపు మళ్లిందంటారు. అదంతా 2014కంటే ముందరి విషయం. అప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారు. టీడీపీ ఆర్థిక వనరులు తరిగిపోయాయి. ఆ దుర్బర పరిస్థితుల్లో నేనున్నానంటూ టీడీపీని ఆర్థికంగా ఆదుకున్నారు నారాయణ. పార్టీకి భారీగా ఫండింగ్ చేశారంటారు. అప్పట్లో హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో నిత్యం భోజన ఏర్పాట్లు సైతం నారాయణ సంస్థలే చేసేవి. ఇక 2014 ఎలక్షన్స్‌కు ముందు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల బాధ్యతలు నారాయణ తీసుకున్నారు. మొత్తం ఖర్చంతా ఆయనే పెట్టుకున్నారని చెబుతారు. తన ఆర్థిక బలంతో, గణిత మేధస్సుతో, చాణక్యంతో ఉత్తరాంధ్రలో మెజార్టీ సీట్లు గెలిపించుకుని.. చంద్రబాబుకు బహుమతిగా ఇచ్చారు. అధినేత అభిమానం చూరగొన్నారు. ఫలితంగా.. టీడీపీ అధికారంలోకి వచ్చి, చంద్రబాబు సీఎం కాగానే.. నారాయణకు ముఖ్యమైన మంత్రి పదవి కట్టబెట్టి.. నవ్యాంధ్ర నిర్మాణంలో ఆయనకూ ఓ స్థానాన్ని కల్పించారు.
2014 నుంచి 2019 వరకు.. చంద్రబాబుకు నారాయణ ఏది చెబితే అది. నారాయణ మాటకు, ఆలోచనకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. అన్నింట్లోనూ నారాయణకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆ ఐదేళ్లలో నిత్యం చంద్రబాబుతో నారాయణనే కనిపించేవారు. చేతిలో అంతులేని పవర్ ఉండటంతో.. తన ప్రాంతమైన నెల్లూరును ఎంతో అభివృద్ధి చేశారు. అద్దంలా మార్చారు. అనేక వసతులు కల్పించారు. నెల్లూరును బాగా అభివృద్ధి చేశారు. అదే సమయంలో గ్రూపు రాజకీయాలనూ ప్రోత్సహించారనే విమర్శ ఉంది.
2019 నాటికి సీన్ మారిపోయింది. టీడీపీ అధికారం కోల్పోయింది. ప్రస్తుత మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ చేతిలో నారాయణ ఓడిపోయారు. స్వపక్షం.. విపక్షం.. అంతా కలిసి నారాయణను ఓడించారని అంటారు. వైసీపీ అధికారంలోకి రాగానే.. చంద్రబాబుకు రైట్‌హ్యాండ్‌గా ఉన్న నారాయణను టార్గెట్ చేసింది. అమరావతి, సీఆర్డీఏలో అక్రమాలంటూ కేసులు పెట్టింది. నారాయణ విద్యాసంస్థలపై ప్రభుత్వ దాడులు జరిగాయి. ఇక అంతే. దెబ్బకు దడుసుకున్నారు. బెదిరిపోయారు. స్వతహాగా రాజకీయ నాయకుడు కాకపోవడం.. ఫక్తు వ్యాపారవేత్త కావడంతో.. తన ఆర్థిక మూలాలు చెదిరిపోతాయనే భయంపట్టుకుంది. ఇక అప్పటి నుంచి నారాయణ అడ్రస్ లేరు. రాజకీయాల్లో అసలేమాత్రం యాక్టివ్ లేరు. చంద్రబాబును కలవడం లేదు. టీడీపీ మీటింగ్స్‌కు రావడం లేదు. అమరావతిలో అడుగుపెట్టిందీ లేదు. తానే దగ్గరుండి పునాదులు వేసిన అమరావతి రాజధానిని జగన్‌రెడ్డి ప్రభుత్వం మూడు ముక్కలు చేస్తున్నా.. పెద్దగా నోరు మెదపలేదు. రాజధాని రైతుల పక్షాన పోరాడలేదు. చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించినా.. మంగళగిరిలో టీడీపీ ఆఫీసును విధ్వంసం చేసినా.. అసెంబ్లీలో భువనేశ్వరిపై అబాంఢాలు వేసినా.. నారాయణ మాత్రం నోరెత్తడం లేదు. అసలు టీడీపీలో ఉన్నారో లేదో కూడా డౌట్. నెల్లూరులోనూ ఎవరికీ అందుబాటులోకి రావడం లేదు. పార్టీతో టచ్ మీ నాట్ అన్నట్టే ఉంటున్నారు. బహుషా మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చే వరకూ.. ఇలానే సైలెంట్ మోడ్‌నే కంటిన్యూ చేస్తారేమో అంటున్నారు.
2014లో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. తెరవెనుక అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించిన నారాయణ.. ఇప్పుడు మాత్రం జగన్‌కు దడుసుకొని.. ఎక్కడో దాక్కోవడం దారుణం. అధికారంలో ఉన్నప్పుడు అందరూ ముందుంటారు.. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో నాయకుడు అనేవాడే ముందుకొస్తారు. అధినేతకు, పార్టీకి, కార్యకర్తలకు కట్టుబడి ఉంటాడు. మరి, మాజీ మంత్రి నారాయణ ఎక్కడున్నారు? అసలు టీడీపీలోనే ఉన్నారా? కనీసం చంద్రబాబుతోనైనా టచ్‌లో ఉన్నారా? మళ్లీ ఎలక్షన్ సమయంలోనే కనిపిస్తారా? నెల్లూరులోనూ ఆయన కనిపించడం లేదంటే.. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని అనుకుంటున్నారా? చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏ ఎమ్మెల్సీగానే ఎంపికై.. మళ్లీ మంత్రి పదవి కొట్టేద్దామనేదే ఆయన ఆలోచనా? పార్టీకి అవసరమైన సమయంలో ముఖం చాటేస్తున్న ఇలాంటి నాయకులు అవసరమా? ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు లానే ఈయనా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా? నారాయణ విషయంలో చంద్రబాబు పునరాలోచించుకోవాలని.. ఇలాంటి వారిని నెత్తిన పెట్టుకుంటే కష్టమని తెలుగు తమ్ముళ్లు సూచిస్తున్నారు. నెల్లూరులో నారాయణకు మంచి పేరే ఉన్నా.. అవసరానికి ఆసరాగా ఉండని నాయకుడు.. అసలు నాయకుడే కాదంటున్నారు.


