సత్యం రామలింగరాజు వస్తే మళ్ళీ ఉద్యోగాలు వస్తాయా?

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉద్యోగాల కల్పన ప్రభుత్వాలకు అతిపెద్ద సమస్యగా మారింది. గతంలో ఉపాధి కోసం మాత్రమే వెంపర్లాడేవారు. కానీ ఇప్పుడు విద్యాధికులు పెరిగారు. సాంకేతిక నైపుణ్యాలు అలవర్చుకుంటున్నారు. వీరికి సాదాసీదా ఉపాధి సరిపోదు. వారి నైపుణ్యాలు, అర్హతలకు తగిన ఉద్యోగావకాశాలు కల్పించి తీరాల్సిందే. గతంలో ఉద్యోగాల కల్పన కోసం పరిశ్రమలపైనే ఎక్కువగా ఆధారపడేవారు. ఇందుకోసం ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాలిచ్చేవి. వందల ఎకరాలు నామమాత్రపు ధరపై అందించేవి. కోట్లరూపాయల విలువైన విధ్యుత్, అమ్మకపు పన్ను వంటి ఇతర రాయితీలు కల్పించేవి. ఐటీ రంగ విస్తృతితో తక్కువ పెట్టుబడితోనే ఎక్కువమందికి మెరుగైన జీతభత్యాలతో కూడిన ఉద్యోగావకాశాల కల్పనకు వీలుచిక్కింది.

 

 

ప్రపంచంలో వస్తున్న ఈ మార్పును ముందుగా గుర్తించి దేశంలో అమల్లోకి తెచ్చిన తొలి తరం ఐటీ సంస్థల వ్యవస్థాపకుల్లో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, సత్యం రామలింగరాజు తదితరులు ముఖ్యులు. వీరు నామమాత్రపు పెట్టుబడితోనే ఐటీ సంస్థల్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా వాటిని విస్తరించారు. లక్షలమంది నిపుణులకు ఉద్యోగావకాశాలను కల్పించారు. వీరి దగ్గర పనిచేసిన వందలాది మంది తిరిగి సొంతంగా ఐటీ సంస్థలు నెలకొల్పారు. వారు కూడా వందలు, వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించారు. ఇలా ఐటీ ఉద్యోగాల కల్పన ఆద్యుల్లో ఒకరైన సత్యం రామలింగరాజు ఇప్పుడీ వ్యవస్థలకు దూరంగా ఉన్నారు. సత్యం నిర్వహణలో కొన్ని సాంకేతిక లోపాల సాకుతో గత ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేసింది. ఆస్తుల్ని పరిరక్షించుకునేందుకు న్యాయస్థానాల్ని ఆశ్రయించడం వంటి చర్యలకు పాల్పడకుండా తన చేతిలోని వ్యాపార సామ్రాజ్యంతో పాటు వ్యక్తిగత ఆస్తుల్ని కూడా ఆయన ప్రభుత్వానికి అప్పగించారు.

 

 

ఒకప్పుడు సత్యం రామలింగ రాజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించిన వ్యక్తి. ఓ దశలో ప్రోటోకాల్ నిబంధనల్ని సైతం పక్కనబెట్టి , హైదరాబాద్ కొచ్చిన బిల్ క్లింటన్ పక్కన రామలింగరాజుకు స్థానం కల్పించారు. రామలింగరాజు వ్యవస్థపరంగానే కాకుండా సొంతంగా కూడా అనేక సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. బైర్రాజు ఫౌండేషన్ పేరిట లోతట్టు గ్రామాలకు మంచినీటి సరఫరా.. రక్షిత మంచినీటి పథకాలు.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు. సేవ గుణంలో సాంకేతికను ప్రవేశపెట్టారు. 108 అంబులెన్స్ ల నిర్వహణకు అత్యాధునిక కంప్యూటర్ పరిజ్ఞానంతో కూడిన విధివిధానాల్ని నిర్దేశించారు. ఇలాంటి నైపుణ్యంతో అంబులెన్స్ లు నిర్వహించిన ఘనత దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే మొట్ట మొదటిగా ఏపీకి దక్కింది.

రామలింగరాజు ఏ బ్యాంకుల్ని మోసం చేయలేదు. ఏ ఆర్థిక సంస్థల బకాయిలు ఎగవేయలేదు. పరిమిత వనరులతోనే ప్రపంచంలోనే అతిపెద్ద వాటిలో ఒకటైన వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఇంతటి ప్రజ్ఞాపాటవాలు, వృత్తి నైపుణ్యం కలిగిన రామలింగరాజు కొన్నాళ్ల జైలు జీవితం అనంతరం ఇప్పుడు ఓ సాదాసీదా వ్యక్తిగా జీవిస్తున్నారు. అయితే ఇలాంటి మేధావి మేధస్సును వినియోగించుకోవాల్సిన అవసరం సమాజంపై ఉంది. పెద్దగా పెట్టుబడి లేకుండానే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఐటీ సాంకేతిక నైపుణ్యం అవసరాలకనుగుణంగా ఉద్యోగావకాశాల్ని సృష్టించగలగడంలో ఆయన దిట్ట. పెరుగుతున్న వృత్తి నిపుణుల నిరోద్యోగ సమస్యను అధిగమించడంలో ఆయన ఆలోచనలు, సేవలు ఉపకరిస్తాయి. ప్రభుత్వాలు ఈ దిశగా యోచించాలని మేధావులు సూచిస్తున్నారు. ఆయన ఎదుర్కున్న నేరం కేవలం సాంకేతికపరమైందే. నేరారోపణ అనంతరం దేశాన్నోదిలి పారిపోయేందుకు ప్రయత్నించలేదు. ఆస్తుల్ని కాపాడుకునేందుకు తప్పుడు పనులకు పాల్పడలేదు. మౌనంగానే ఆస్తుల్ని అప్పగించి జైలు శిక్ష అనుభవించారు. ఆయన సేవల్ని వినియోగించుకోవడం వల్ల ప్రభుత్వాలకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. లక్షలాదిమంది వృత్తినిపుణులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మేధావులు పేర్కొంటున్నారు. మరి ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచిస్తాయో చూడాలి.