కేసీఆర్-జగన్ భేటీ ఎప్పుడో..?
Published on: Fri Feb 18, 2022 2:34PM
ఎవరి కారణాలు, ఎవరి అవసరాలు వారికి ఉండవచ్చును కానీ, జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల సత్తా చూపేందుకు, పశ్చిం బెంగాల్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మమత బెనర్జీ, ఎంకే స్టాలిన్, కేసీఆర్ కసరత్తు సాగిస్తున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందో, ఆ తర్వాతనో బీజేపీ, కాంగ్రెస్ యేతర ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరి 20న ముంబై వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ థాకరేను కలుస్తున్నారు.
అదలా ఉంటే, ప్రస్తుతానికి ఈ ఉమ్మడి పోరాట ఐక్యతా క్రతువుకు సూత్రధారిగా వ్యవహరిస్తున్న తెలంగాణ ముఖ్యమత్రి కేసేఆర్, ఎవరెవరినో కలుస్తున్నారు కానీ, పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేతను జగన్మోహన్ రెడ్డి కలవలేదు. దేవేగౌడ్, థాకరేలను టచ్ చేసినట్లుగా కనీసం ఫోనులో అయినా పలకరించ లేదు. కేసీఆర్, దాయాది రాష్ట్రం సీఎం జగన్ రెడ్డిని ఎందుకు కదల్చలేదు? అనే ప్రశ్న ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మీడియా చర్చల్లోనో చర్చకు వస్తోంది. ఈ విషయంలో తెరాస నాయకులు నీళ్ళు నములు తున్నారు. ముఖ్యమంత్రి ఒక్కొక్కరినే కలుస్తారని, త్వరలోనే జగన్ రెడ్డిని కూడా కలుస్తారని అంటున్నారు, కానీ, స్పష్టత అయితే ఇవ్వలేక పోతున్నారు.
అదలా ఉంటే, ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అయితే, బీజేపీకి కోపం తెప్పించే సాహసం చేయరని పరిశీలకులు అంటున్నారు. ఓ వంక డజను వరకు అక్రమాస్తులకు సంబదించిన కేసులు జగన్ రెడ్డి మెడమీద వెళ్ళాడుతున్నాయి. మరోవంక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మునక వేయడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ రెడ్డి ముందరి కాళ్ళకు బంధం వేస్తోంది. నిజానికి కేసేఆర్, పరిస్థితి కూడా కొంచెం అటూ ఇటుగా అదే.అయినా కేసీఆర్ దూకుడు పెంచుతూనే ఉన్నారు. అయితే, ఏపీ, తెలంగాణల పొలిటికల్ ఈక్వేషన్స్’లో స్పష్టమైన తేడా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అనుదుకే కేసీఆర్’కు యుద్ధం చేయడం మినహా మరో మార్గం లేదని అంటున్నారు.
తెలంగాణలో బీజేపీకి ఉన్న వాస్తవ బలం ఎంతైనా, ప్రస్తుతానికి కమలదళం అధికార తెరాసకు సవాలు విసురుతోంది.ముఖ్యంగా పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణాలో పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. కొంచెం వేగంగానే అడుగులు వేస్తోంది. మరోవంక, రాష్ట్రంలో తెరాసకు పెను సవాలుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే, రాష్ట్రంలో ముక్కోణపు పోటీ అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఓకే నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వం వ్యతిరేక ఓటు పూర్తిగా కాంగ్రెస్ ఖాతాలో చేరితే, తెరాస ఓటమి ఖాయమని, సర్వేలు చెపుతున్నాయి. అందుకే, కేసీఆర్ బీజేపీ బలాన్ని భూతద్దంలో చూపేందుకు కేంద్ర ప్రభుత్వం టార్గెట్’ గా లోకల్ యుద్దం చేస్తున్నారు. నిజానికి, తెలంగాణలో తెరాస, బీజేపీ వార్, ‘నువ్వొకందుకు పోస్తుంటే, నేనొకందుకు తాగుతున్నాను’ అన్న రీతిగా సాగుతోంది.
ఇక ఏపీ విషయానికి వస్తే, అక్కడ బీజేపీకి ఉన్నదీ లేదు పోయేదీ లేదు. అందుకే ఏపీ విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం కూడా పెద్దగా దృష్టి పెట్టలేదు. పైగా, జగన్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనను ప్రత్యక్షంగానో పరోక్షంగానో సమర్ధిస్తోంది. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినా, దివాలా అంచులకు చేరినా, ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించవలసిన అనివార్య పరిస్థితి తలెత్తినా, చేతనైన మేరకు సాయం చేస్తోందే కానీ, రాష్ట్ర భవిష్యత్ ఏమిటని ఆలోచించడం లేదు. అందుకే, జగన్ రెడ్డి ఇప్పటి కిప్పుడు, బీజేపీని ఎదిరించే సాహసం చేయరని, అంటున్నారు.
మరోవంక రాష్ట్ర విభజనకు సంబంధించి, ఎనిమిదేళ్ళ తర్వాత ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా పార్లమెంట్’లో (చేసేది ఏమీ లేక పోయినా) ఏపీ ప్రజల చెవులకు ఇంపుగా సోకే మాటలు మాట్లాడారు. అలాగే, తాజాగా కేంద్ర ఉపరితల రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్గరి, మరిన్ని పూతలు పూసి పోయారు. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య, ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య దూరం పెంచేందుకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం వివాదాల పరిష్కారం పేరిట వివదాల అగ్గి రాజేస్తోంది. ఇవ్వన్నీ, ఒక దానికొకటి సంబంధం లేని విషయాలుగా, అని పించినా, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఏటో ఒక వైపునుంచి ఒక దానితో ఒకటి లింకై ఉన్న విషయాలే, అందుకే జగన్ రెడ్డిని కేసీఆర్ కదిలించ లేదని, కదిలించ లేరని పరిశీలకులు అంటున్నారు.


