వెనక్కి తగ్గిన వాట్సాప్!!

ప్రైవసీ పాలసీపై వాట్సాప్ వెనక్కి తగ్గింది. ఇటీవల తీసుకొచ్చిన ఈ పాలసీపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తం కావడం.. సిగ్నల్, టెలిగ్రామ్‌ వంటి యాప్స్ కు ఆదరణ పెరుగుతుండడంతో వాట్సాప్ వెనక్కి తగ్గింది. ప్రైవసీ పాలసీ ఆప్‌డేట్‌ ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. నిజానికి వచ్చే ఫిబ్రవరి 8 నుంచే ఈ కొత్త విధానం అమల్లోకి రావాల్సి ఉండగా, తాజా నిర్ణయంతో ఇది మూడు నెలలు వెనక్కి జరిగింది. కొత్త పాలసీపై ప్రజల్లోకి తప్పుడు సమాచారం వెళ్లడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాట్సాప్ తెలిపింది. పాలసీపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ఈ మూడు నెలలను ఉపయోగించుకుంటామని తెలిపింది. కొత్త విధానాన్ని యూజర్లు అర్థం చేసుకున్న తర్వాతే దానిని అమల్లోకి తీసుకొస్తామని స్పష్టం చేసింది.

 

ప్రైవసీ పాలసీలో భాగంగా యూజర్ల వ్యక్తిగత సమాచారం, ఐపీ అడ్రస్‌ లను ఫేస్‌బుక్‌‌ తో పంచుకుంటామని, ఇందుకు అంగీకరిస్తేనే అకౌంట్ కొనసాగుతుందని ఇటీవల వాట్సాప్ ప్రకటించింది. అయితే, వ్యక్తిగత గోపత్యకు భంగం కలగనుందన్న ఉద్దేశంతో చాలా మంది యూజర్లు వాట్సాప్‌ ను డిలీట్‌ చేసి టెలిగ్రాం, సిగ్నల్‌ యాప్స్‌కి మారారు. దీంతో కాస్త వెనక్కి తగ్గిన వాట్సాప్.. కేవలం బిజినెస్ అకౌంట్స్ కు మాత్రమే ఇది వర్తిస్తుందని వివరణ ఇచ్చింది. అయినప్పటికీ విమర్శలు తగ్గకపోవడంతో ఈ విధానాన్ని వాయిదా వేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు వాట్సాప్‌ తన బ్లాగ్‌లో "మీరు.. మీ కుటంబ సభ్యులు, స్నేహితులతో పంచుకునే సమాచారం ఏదైనా రహస్యంగానే ఉంటుంది. మీ వ్యక్తిగత సంభాషణని వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ చదవదు. మీరు పంపే లోకేషన్‌లని చూడదు. మీరు ఎవరికి కాల్‌ చేశారు, ఎవరికి మెసేజ్‌ చేస్తున్నారనే విషయాలను కూడా మేం గమనించం. ఈ అప్‌డేట్‌ వల్ల ఏదీ మారడం లేదు. బిజినెస్‌ ఫీచర్స్‌ని మరింత మెరుగ్గా అందించడం కోసం మాత్రమే ఈ అప్‌డేట్‌ ని తీసుకొచ్చాం." అని తెలిపింది.