పవన్ ఒంటరి పోరు.. వైసీపీకి నష్టమేనా?

 

రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీకి నష్టమని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. కానీ లాజిక్ గా ఆలోచిస్తే పవన్ ఒంటరిగా పోటీ చేయడం వల్ల టీడీపీకి ఎంత నష్టమో వైసీపీకి కూడా అంతే నష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి మద్దతిచ్చారు. టీడీపీ విజయం సాధించి అధికారం చేపట్టింది. అయితే ఆ తరువాత పవన్ టీడీపీకి దూరమయ్యారు. టీడీపీ మీద విమర్శల దాడి కూడా చేస్తున్నారు. అంతేనా గత ఎన్నికల్లో టీడీపీ గెలుపుకి తానే కారణమని కూడా చెప్పుకున్నారు. ఇక కొందరు పవన్ అభిమానులు, జన సైనికులు అయితే అసలు పవన్ లేకపోతే టీడీపీ గెలిచేది కాదని అంటున్నారు. మరికొందరైతే పవన్ వల్లే పవన్ సామాజికవర్గానికి చెందిన ఓట్లన్నీ గంప గుత్తుగా టీడీపీకి పడ్డాయని అభిప్రాయపడ్డారు. కానీ వారు చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవమెంత?.

పవన్ టీడీపీకి మద్దతు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా టీడీపీకి ప్లస్సే. అది వాస్తవం. కానీ పవన్ వల్లే టీడీపీ గెలిచిందని మాత్రం అనలేం. ఎందుకంటే సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన మున్సిపల్, పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ దాదాపు స్వీప్ చేసింది. ఆ ఎన్నికల్లో పవన్, బీజేపీలతో దోస్తీ చేయకుండానే మెజారిటీ స్థానాల్లో టీడీపీ జెండా ఎగురవేసింది. ఇక సాధారణ ఎన్నికల్లో టీడీపీకి.. పవన్, బీజేపీ తోడవడంతో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని అంతా భావించారు. అయితే టీడీపీ విజయం సాధించింది కానీ అంచనాలను అందుకంటూ ఘన విజయమైతే సాధించలేదనే చెప్పాలి. మున్సిపల్, పంచాయితీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి స్వీప్ చేసిన టీడీపీ.. మరి సాధారణ ఎన్నికల్లో పవన్ బలం తోడైనా వైసీపీని ఎందుకు చిత్తుగా ఓడించలేకపోయింది?. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. పవన్ గెలుపుని డిసైడ్ చేయలేదని.

అదేవిధంగా పవన్ చెప్పాడని ఆయన సామాజికవర్గ ఓట్లన్నీ గంప గుత్తుగా టీడీపీకి పడ్డాయనే అభిప్రాయం కూడా సరైనది కాదు. తమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి చెప్పాడని.. ఆ సామాజికవర్గమంతా ఒకే పార్టీకి ఓటేస్తుందా? అంటే డౌటే. గత ఎన్నికల్లో కూడా పవన్ సామాజికవర్గం ఓట్లన్నీ కేవలం టీడీపీకే పడలేదు. టీడీపీ, వైసీపీలకు దాదాపు సమానంగానే పడ్డాయి. అంతెందుకు పవన్ సామాజికవర్గం బలంగా ఉన్న ఒక నియోజకవర్గంలో ఇండిపెండెంట్ విజయం సాధించాడు. మరి పవన్ సామాజికవర్గం ఓట్లన్నీ టీడీపీకి పడితే అక్కడ ఇండిపెండెంట్ ఎలా గెలిచాడు?. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు. పవన్ చెప్పాడని వారంతా ఏకపక్షంగా టీడీపీ వైపు చూడలేదని. మరి ఇప్పుడు పవన్ ఒంటరిగా అన్ని స్థానాల్లో బరిలోకి దిగుతాం అంటున్నారు. పవన్ వెంట ఆయన సామాజికవర్గమంతా ఉండకపోవొచ్చు. కానీ దాదాపు 60 శాతం ఉండే అవకాశముంది. అంటే మిగిలిన 40 శాతం ఓట్లను టీడీపీ, వైసీపీ పంచుకోవాలి. గత ఎన్నికల్లో చెరి 50 శాతం పంచుకున్న టీడీపీ,వైసీపీ.. ఈసారి చెరి 20 శాతం పంచుకోవాలి. అంటే పవన్ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఆయన సామాజికవర్గం ఓట్లు రెండు పార్టీలకు సమానంగా దూరమయ్యే అవకాశముంది. దీనివల్ల టీడీపీకి ఎంత నష్టమో వైసీపీకి కూడా అంతే నష్టం జరుగుతుంది.