ముగిసిన 24 గంటల డెడ్‌లైన్.. వాట్ నెక్ట్స్?
Published on: Tue Apr 12, 2022 3:42PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పదిరోజులు ఉండి పన్ను పీకించుకుని వచ్చారు. పనిలో పనిగా, రాష్ట్రం నుంచి ఢిల్లీ చేరిన తెరాస ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు, తెలంగాణ భవన్’లో నిర్వహించిన వరిదీక్షలో పాల్గొని, కేంద్ర ప్రభుత్వానికి 24 గంటలు టైమిచ్చివచ్చారు. తెలంగాణ సహా దేశం అంతటా కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు సమబందించి కేంద్ర ప్రభిత్వం 24 గంటల్లో ఆదేశాలు ఇవ్వాలని లేదంటే ఆ తర్వాత ఏం చేయాలో తమకు తెలుసునని, కేంద్రాన్ని హెచ్చరించారు. అయితే, 24 గంటలు కాదు, 24 రోజుల సమయం ఇచ్చినా, ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తమ విధానాన్నిమార్చుకోదని, కేసీఆర్ సహా, అందరికీ తెలుసు.నిజానికి, మఖ్యమంత్రి కేసీఆర్ ఇలా కేంద్రానికి హెచ్చరికలు చేయడం, ఐదంచల ఉదయాలు చేయడం ఇదే మొదటి సారి. కాదు. గతంలోనూ, ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మంత్రివర్గ సహచరులు అనేక సందర్భాలలో ఢిల్లీ దాక వెళ్లి చేసిన హెచ్చరికలను కేంద్ర ప్రభుత్వం పట్టిచుకోలేదు. ఇప్పుడు కూడా అదే జరిగింది.
అదలా ఉంటే ధాన్యం కొనుగౌకు సంబందించి ఏమి చేయాలనే విషయంలో ఒక నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర మంత్రి వర్గంలో నిర్ణయం తీసుకుంటామను ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే, రాష్ట్ర మంత్రివర్గంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అనే విషయం పక్కన పెడితే, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ ఆందోళనను ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎందుకు, కనీసం రెస్పాండ్ అవడం లేదు? ఆలోచిస్తే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నట్లు, తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ఇక ఇవ్వబోమని 2021 అక్టోబరు 4న కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా లేఖే కేంద్ర ప్రభుత్వం ధీమాకు కారణం. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కేంద్రం మెడమీద కత్తిపెట్టి లేఖ రాయించుకుందని వాదించినా కేంద్రం డోంట్ కేర్ అంటోంది.
అందుకే రేవంత్ రెడ్డి, తెలంగాణ రైతుల ప్రయోజనాలకు ఉరితాళ్లు బిగిస్తూ కేంద్రానికి లేఖ రాసే అధికారం కేసీఆర్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇప్పుడు తిరిగి ధర్నాలు, నిరసనలు అంటూ నాటకాలు ఆడితే.. రైతులు మీ మోసాలను గ్రహించలేరా అని నిలదీశారు. నిజమే, కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు సమస్యకు పరిష్కారం చూపకుండా, ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తే, సహజంగానే, ఎవరికైనా, ఇది ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకమనే అనుమానాలొస్తాయి. వచ్చాయి. ఏ నేపధ్యంలోనే టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పది ప్రశ్నలతో కూడిన లేఖ రాశారు. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ఇక ఇవ్వబోమని 2021 అక్టోబరు 4న కేంద్రానికి లేఖ రాసింది వాస్తవం కాదా..? అని నిలదీశారు.
ఇప్పుడు ధర్నాలు, నిరసనలు అంటూ నాటకాలు ఆడితే... ఆ రెండు పార్టీల మోసాలను రైతులు గ్రహించలేరా..? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెరాస చిత్తశుద్ధిపై రైతులకు మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయని అన్నారు. ధాన్యం కొనుగోళ్ల కారణంగా రూ.7,500 కోట్లు నష్టం వచ్చినట్లు పేర్కొని ప్రభుత్వం...ఇకపై కొనుగోలు కేంద్రాలు ఉండవని గత ఏడాది ఫిబ్రవరిలో ప్రకటన చేయలేదా అని నిలదీశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆడుతున్న నాటకాల్లో ఇప్పటికీ రైతులు దళారీల చేతుల్లో నష్టపోతున్న విషయం నిజం కాదా..? ప్రశ్నించారు. ప్రభుత్వం చేతులెత్తేయడంతో నిస్సహాయ స్థితిలో రైతులు ధాన్యాన్ని రూ.1,200 - రూ.1,400కే మిల్లర్లకు అమ్ముకుంటున్న విషయం వాస్తవం కాదా..? అని నిలదీశారు. యాసంగి సీజన్‌లో కూడా ముందస్తుగా చేతికి వచ్చే ధాన్యం... రా రైస్‌గా వచ్చే ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.నిజం. కేసీఆర్ ఆందోళన పూర్తిగా రాజకీయ ఆందోళనే కానీ, రీతుల కోసం చేస్తున్న ఆందోళన కాదని, పరిశీలకులు భావిస్తున్నారు.


