వ్యవసాయ బిల్లుల్లో ఏముంది.. రైతులకు లాభమా? నష్టమా?

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులపై దుమారం రేగుతోంది. విపక్షాలతో పాటు రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో అసలు ఆ బిల్లుల్లో ఏముంది? ఎందుకు ఈ స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

 

వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం మూడు బిల్లులను తీసుకొచ్చింది. 'నిత్యావసర వస్తువుల(సవరణ) బిల్లు-2020', 'రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) బిల్లు-2020', 'ధరల హామీ, పంట సేవల ఒప్పంద బిల్లు-2020'. ఈ మూడు బిల్లులు ఉభయ సభల్లో ఆమోదం పొందాయి.

 

నిత్యావసర వస్తువుల(సవరణ) బిల్లు 
ఈ బిల్లు ప్రకారం నిత్యవసర సరకుల జాబితాలో ఉన్న వస్తువుల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యాల నియంత్రణాధికారం కేంద్రానికి అధికారం ఉంటుంది. అసాధారణ పరిస్థితులు తలెత్తినప్పుడు తృణధాన్యాలు, పప్పులు, బంగాళాదుంపలు, ఉల్లి, నూనె వంటి ఆహారవస్తువులలో వేటి సరఫరానైనా నియంత్రించే అధికారాన్ని కేంద్రానికి ఇస్తుందీ చట్టం. ఏదైనా నిత్యవసర వస్తువును ఎంత పరిమాణంలో నిల్వ చేసుకోవచ్చనే నియంత్రణ విధించే అధికారమూ కేంద్రానికి కల్పిస్తుందీ చట్టం. తద్వారా వీటిని భారీ మొత్తంలో నిల్వ చేసి.. ఆ తర్వాత ఇష్టానుసారం ధరలు పెంచి అమ్మే కంపెనీల గుత్తాధిపత్యానికి తెరపడుతుంది.

 

రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) బిల్లు
ఈ బిల్లు ప్రకారం వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు-కొనుగోళ్లకు రైతులు-ప్రైవేట్ వ్యాపారులకు పూర్తి స్వేచ్చ ఉంటుంది. ధరల నియంత్రణ రైతులు-ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లోనే ఉంటుంది. రైతులు మార్కెట్ యార్డుల్లో కాకుండా ఏ ప్రైవేట్ వ్యాపారికైనా తమ పంట ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. మార్కెట్ కమిటీల ప్రాదేశిక సరిహద్దులతో సంబంధం లేకుండా వేర్వేరు రాష్ట్రాల మధ్య,  వేర్వేరు జిల్లాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి ఇది అవకాశం కల్పిస్తుంది. మార్కెట్ కమిటీల సరిహద్దులు దాటి విక్రయించే వ్యవసాయ ఉత్పత్తులపై రాష్ట్రాలు కానీ, స్థానిక ప్రభుత్వాలు కానీ ఎలాంటి పన్నులు వసూలు చేయడానికి వీల్లేదు.

 

ధరల హామీ, పంట సేవల ఒప్పంద బిల్లు
ఈ బిల్లు ప్రకారం..  ఏ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించయినా పంట వేయడానికి ముందే రైతు, కొనుగోలుదారుతో(ప్రైవేట్ కంపెనీలతో) ఒప్పందం కుదుర్చుకోవచ్చు. ఒక రకంగా ఇది కాంట్రాక్ట్ వ్యవసాయ విధానం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఒప్పందాలు కనిష్ఠంగా ఒక పంటకాలం నుంచి అయిదేళ్ల వరకు చేసుకోవచ్చు. ఒప్పందంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరను పేర్కొనాలి. 

 

అయితే, ఈ చట్టాలు రైతుకు మేలు చేసేలా కనిపించినా ఏమాత్రం ప్రయోజనకరం కావని.. వ్యాపారులు, బడా కంపెనీల గుప్పిట్లో రైతులు చిక్కుకునేలా చేస్తాయని విపక్షాలు, రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ చట్టాలు సన్నకారు రైతులను కష్టాల్లోకి నెడతాయని అంటున్నారు. ప్రైవేట్ కంపెనీలు నిర్ణయించే ధరలకు పంటలు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని.. అదే జరిగితే కనీస మద్దతు ధర కూడా దక్కదని వాపోతున్నారు. దేశంలో ఎక్కువమంది చదువుకోని రైతులే ఉన్నారు కాబట్టి ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం వారికి కష్టమవుతుందని.. వారు దోపిడీకి గురయ్యే అవకాశం ఉందని వాదిస్తున్నారు. అంతేకాదు, ఒకవేళ రైతులు-ప్రైవేట్ వ్యాపారుల వ్యవస్థ బలపడితే వ్యవసాయ సంక్షేమ, అభివృద్ది గురించి ప్రభుత్వం మునుపటిలా పట్టించుకుంటుందా?. కష్ట కాలంలో రైతులకు రుణాలిచ్చి ఆదుకుంటుందా?. రాష్ట్రాల పరిధిలో ఇప్పుడు అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు కొనసాగుతాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.