TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆడియో టేపుల మతలబేంటి?

Published on: Sat Oct 29, 2022 11:15AM

తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా  సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల అంశంలో ఆడియో టేపుల మతలబేంటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఆడియో టేపులు ఈ వ్యవహారంలో కీలక సాక్ష్యం అని ఎవరైనా అంటారు. కానీ తెరాస మాత్రం అలా భావించడం లేదు. వీటి వల్ల న్యాయపరంగా కానీ చట్ట పరంగా కానీ కేసు నిలిచే అవకాశం లేదని ఆ పార్టీ భావిస్తున్నట్లు తోస్తోంది.

ఎందుకంటే తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు ఏపీసీ కోర్టు రిమాండ్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించింది.  అయితే కోర్టులో మాత్రం ఆ పార్టీ బయటకు రిలీజ్ చేసిన ఆడియో టేపులను బయటపెట్టలేదు.  స్వల్ప వ్యవధిలో రెండు ఆడియో టేపులను విడుదల చేసి ప్రజలలో అయోమయం సృష్టించాలనీ, ఈ కేసులో బీజేపీ అగ్ర నేతల హస్తం ఉందని ప్రజలు భావించేలా చేయాలన్న ప్రయత్నానికే పరిమితమైంది కానీ, ఇలా ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో చట్టం ముందు బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు ఎటువంటి ప్రయత్నాలూ చేయలేదు. నిజంగా తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో బీజేపీ అగ్రనేతల ఇన్ వాల్వ్ మెంట్ ఉండి ఉంటే.. తన వద్ద ఉన్న, లేదా ఉన్నాయని తెరాస చెబుతున్న ఆధారాలను కొర్టులోనే ప్రవేశ పెట్టి ఉండేది.

తెరాస కోర్టులో ప్రవేశ పెట్టకుండా విడుదల చేసిన ఆడియోలలో ఒక దాంట్లో రామచంద్ర భారతి, రోహిత్ రెడ్డి, నందకుమార్ మధ్య పార్టీ మార్పుపై చర్చలు జరిగినట్లు ఉంది. మరో దాంట్లో  డబ్బుల ప్రస్తావన ఉంది. రోహిత్ వంద అడిగారని నందకుమార్ చెబుతున్నట్లు ఆ ఆడియోలో వినిపించింది. అయితే వీరు  ఎవరితో డీల్ చేశారన్నదానిపై  మాత్రం ఆ వీడియోలో  స్పష్టత లేదు. బీజేపీలోని టాప్ టు వ్యక్తులతో మాట్లాడిస్తామని చెప్పడం అయితే వినిపించింది.  అయితే వీటిని కోర్టులో ఎందుకు ప్రవేశ పెట్టలేదు?  ఇంత మొత్తంలో డబ్బులు దొరికాయని పోలీసులు కూడా ప్రకటించలేదు. దీంతో కేసు నిలబడదని న్యాయశాస్త్రంలో కొద్ది పాటి పరిచయం ఉన్న వారికైనా ఇట్టే అర్ధమైపోతుంది.  న్యాయవర్గాలు కూడా అదే చెబుతున్నాయి.  

ఆ రెండు ఆడియోలలోనూ  రెండు వర్గాల మధ్య మాటలు మాత్రమే ఉన్నాయని వాటిలో ఐపీసీ సెక్షన్ల కింద శిక్షార్హమైన నేర వ్యవహారమేదీ లేదని చెబుతున్నాయి. అందుకే టీఆర్ఎస్ ఈ టేపులను కోర్టులో ప్రవేశ పెట్టలేదని అంటున్నాయి. ఇక   రోహిత్ రెడ్డి సహా ఈ డీల్‌లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచీ ప్రగతి భవన్ లోనే ఉన్నారు.  ఫామ్ హౌస్‌లో కేసు బయటపడిన రోజున   ప్రగతి భవన్‌కు వెళ్లిన వారు ఇప్పటి వరకూ బయటకు రాలేదు. అంతే కాదు వారి ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ అయి ఉన్నాయి.     శుక్రవారం కేసీఆర్ ప్రెస్ మీట్ లో ఈ వ్యవహారం గురించి బాంబు విస్ఫోటనం లాంటి వివరాలు వెల్లస్తారని తెరాస వర్గాలు చెప్పాయి. కానీ అది జరగలేదు.    

శుక్రవారం లేదా శనివారం  ఢిల్లీకి వెళ్లి .. అక్కడే మీడియాతో మాట్లాడతారనీ, బీజేపీకి దిమ్మతిరగక తప్పదనీ తెరాస వర్గాలు లీకులు ఇచ్చాయి. అదీ జరగలేదు. గురువారం నుంచీ కేసీఆర్ పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లి పోయారు.

ప్రగతి భవన్ గడప దాటి బయట కాలు పెట్టలేదు. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారం టీఆర్ఎస్ కు బూమరాంగ్ అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద కేసీఆర్ సైలెన్స్  తెరాస వర్గాలలో గందరగోళం సృష్టిస్తోంది. బ్రహ్మాండం బద్దలైపోయిందన్న సంబరం గంటల పాటు కూడా నిలవలేదు. ఏదో తమ వైపు నుంచే పొరపాటు జరిగిందా అన్న శంక తెరస శ్రేణుల్లో కనిపిస్తోంది. దీంతో వారు కూడా నిశబ్దాన్నే ఆశ్రయిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం అంతా మునుగోడులో తెరాస ప్రచారంపై ప్రతికూలంగా పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.