TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రుషికొండ ప్యాలెస్ లో ప్రభుత్వం ఏం చేయబోతోంది

Published on: Thu Jun 18, 2026 3:10PM

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ భవిష్యత్తుపై ఉత్కంఠ కొనసాగుతోంది. దాదాపు రూ.450 కోట్ల ప్రజాధనంతో నిర్మితమైన ఈ లగ్జరీ భవన సముదాయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియక ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీవ్ర తర్జనభర్జనలు పడుతోంది. ఎవరికీ ఉపయోగపడకుండా ఖాళీగా పడి ఉన్న ఈ ప్యాలెస్ నిర్వహణ కోసమే నెలకు లక్షలాది రూపాయల ప్రజాధనం ఖర్చవుతుండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

 వైసీపీ ప్రభుత్వ హయాంలో పర్యావరణ నిబంధనలను సైతం పక్కనబెట్టి రుషికొండపై ఈ భారీ రాజసౌధాన్ని నిర్మించారు. అప్పట్లో దీనిని టూరిజం ప్రాజెక్టుగా ప్రచారం చేసినప్పటికీ..  వాస్తవానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన అధికారిక నివాసంగా వాడుకునేందుకే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించుకున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ప్యాలెస్‌ను స్వయంగా పరిశీలించి మీడియాకు కూడా చూపించారు.

అయితే.. ప్రభుత్వం మారి నెలలు గడుస్తున్నా ఈ భవనాన్ని దేనికి ఉపయోగించాలనే దానిపై స్పష్టత రాలేదు. ఈ ప్యాలెస్ నిర్వహణ, సెక్యూరిటీ కోసం నెలకు దాదాపు పాతిక లక్షలు.. అంటే ఏడాదికి  సుమారు రూ.3 కోట్ల చొప్పున ఇప్పటికే ఆరు కోట్ల  రూపాయల ప్రజాధనం కేవలం మెయింటెనెన్స్ కోసమే బూడిదలో పోసిన పన్నీరైంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినప్పటికీ తుది నిర్ణయం వెలువడలేదు.

ఈ వివాదాస్పద కట్టడాన్ని ఒక ఐకానిక్ స్టార్ హోటల్‌గా మార్చాలని కొందరు ప్రతిపాదిస్తున్నారు. కానీ పెద్ద పెద్ద హాల్స్, విలాసవంతమైన బాత్‌టబ్‌లతో ఉన్న ఈ ప్యాలెస్‌ను హోటల్ గదులుగా మార్చడానికి మళ్లీ రూ.50 నుంచి రూ.60 కోట్ల వరకు అదనపు ఖర్చు అవుతుందని అంచనా. పైగా పర్యాటక హోటల్‌గా మారిస్తే రుషికొండ పర్యావరణానికి మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే సంశయం వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ..  రుషికొండకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందన్నారు.  పూర్వం ఋషులు తపస్సు చేసిన పవిత్ర స్థలం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. కాబట్టి ఈ భవనాన్ని ఎటువంటి అదనపు ఖర్చులు లేకుండా అంతర్జాతీయ ఆధ్యాత్మిక లేదా యోగా కేంద్రంగా  మారిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.  ఇది పర్యావరణానికి హాని చేయకపోగా, విశాఖకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెస్తుందన్నారు. 

మరికొందరు మాత్రం గత ప్రభుత్వం ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసిందో ప్రజలకు చూపించడానికి దీనిని ఒక ప్రభుత్వ మ్యూజియంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. కాలయాపన పెరిగేకొద్దీ ప్రజాధనం వృధా అవుతూనే ఉంటుంది కాబట్టి..  కూటమి ప్రభుత్వం త్వరగా స్పందించి ఈ భవనాన్ని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేలా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.