ముందస్తు ముద్దు... జమిలి జరగొద్దు..!!

దేశంలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. జాతీయ స్ధాయిలోనే కాదు... రాష్ట్రాల్లో కూడా రాజకీయాలు రోజురోజుకూ కొత్త మలుపులు తీసుకుంటున్నాయి. ఉత్తరాదిలో ఒకలాంటి రాజకీయాలు జరుగుతూంటే... దక్షిణాదిలో మరో విధంగా రాజకీయాలున్నాయి. దక్షిణాదిలోని తెలుగు రాష్ట్రాల్లో మరీ ప్రత్యేకంగా ఉన్నాయి రాజకీయాలు. అవునంటే కాదనిలే... కాదంటే అవుననిలే అన్నట్లుగా రాజకీయాల రూపము, స్వరూపమూ రెండూ పూర్తి స్ధాయిలో మారిపోతున్నాయి. ఈ రోజు ఉన్న రాజకీయాలు రేపు ఉండడం లేదు. నిన్న జరిగిన రాజకీయాలు రేపు ఎలా ఉంటాయో తెలియడం లేదు. అంతా చిందర వందర గందరగోళంగా మారుతున్నాయి. నిన్నటి వరకూ ముందస్తుకు వెళ్దామా... వద్దా అని సంశయంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తాజాగా ముందస్తుకు వెళ్లిపోవాలని నిర్ణయించేసుకున్నారు. వారం రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, వివిధ శాఖల కేంద్ర మంత్రులను కలుసుకున్న కె.చంద్రశేఖరావు అక్కడి నుంచి వచ్చిన వెంటనే చకచకా పావులు కదపుతున్నారు. ముందస్తుకు వెళ్లిపోదాం.... అందరూ సిద్ధంగా ఉండండి అంటూ పార్టీ శ్రేణులకు పిలుపు కూడా ఇస్తున్నారు. ముందస్తుకు వెళ్లాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనకు ఇక్కడ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ముందుగా తలుపులు తీస్తున్నారు. అంతే కాదు.... ఎన్నాళ్ల నుంచో దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల నాలుకలపై నానుతున్న జమిలి ఎన్నికలకు కూడా ఇదే మంచి సమయం అని సంకేతాలు ఇస్తున్నారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు తన వంతు ప్రయత్నాలను రోజురోజుకు తీవ్రం చేస్తున్నారు.

 

 

ఇందుకోసం తన మిత్ర పక్షాలను ముందుగా ముందుకు తోస్తున్నారు. అందులో భాగమే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ముందస్తు పచ్చ జెండా ఊపుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ ముందస్తు వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారనే విషయం ప్రతిపక్షాలకు... ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలియజేయడమే ఈ ఇద్దరు నాయకుల వెనుక ఉన్న బహిరంగ రహస్యం. భారతీయ జనతా పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమతికి ఉన్న స్నేహం ఎంత గాఢమైనదో ఈమధ్య జరిగిన రాజ్యసభ  ఉపాధ్యక్ష ఎన్నికే బహిర్గతం చేసింది. ఈ స్నేహం ఇప్పుడు వికసించి ముందస్తుకు ముహూర్తం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుల ముందస్తు మాయాజాలంలో పడేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భీష్మించుకున్నారు. అంతే కాదు... లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి నిర్వహిద్దామనుకున్న జమిలి ఎన్నికలకు కూడా ఆయన ససేమిరా అంటున్నారు. దీని వెనుక భారతీయ జనతా పార్టీ కుట్ర ఉందన్నది చంద్రబాబు నాయుడి ఆలోచన. జమిలి ఎన్నికలకు వెళ్లడం వల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న వారికి కలిసి వస్తుందన్నది చంద్రబాబు నాయుడి నమ్మకం. ఇంతకు ముందు ఒక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తప్ప మిగిలిన అన్ని సమయాల్లోనూ చంద్రబాబు నాయుడికి పెద్దగా ఇబ్బంది కలగలేదు. ఈ సారి మాత్రం తనను నమ్మించి నట్టేట ముంచిన భారతీయ జనతా పార్టీకి కేంద్రంలోనే కాదు... ఏ రాష్ట్రంలోనూ కూడా మేలు జరగరాదన్నది చంద్రబాబు నాయుడి ఆలోచన. భారతీయ జనతా పార్టీ కారణంగా తాను ఆంధ్రప్రదేశ్ ప్రజలలో చులకనయ్యానని, వారి మోసం తాను తెలుసుకోలేకపోయానని చంద్రబాబు నాయుడు ఆవేదన చెందుతున్నారు. 

 

 

కేంద్ర ప్రభుత్వం... ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలను ఎదుర్కొనేందుకు.... వారిని ఢీకొట్టేందుకు చంద్రబాబు నాయుడు జమిలి ఎన్నికల జరగొద్దు అని జాతీయ స్ధాయిలో ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం తనతో కలిసి వచ్చే పార్టీలతో జత కట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు తెలుగుదేశం పార్టీకి బద్ద శత్రువైన కాంగ్రెస్ పార్టీ కూడా మినహాయింపు కాదు. జమిలి ఎన్నికలకు ఏ పార్టీ కూడా తమ మద్దతు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు చక్రం తిప్పే అవకాశం ఉంది. ఇందుకోసం ఆయన జాతీయ స్ధాయిలో అన్ని పార్టీలతోనూ సమావేశాలు నిర్వహించే అవకాశమూ ఉంది. ముఖ్యంగా కర్నాటకలోని జెడీయు, త్రణమూల్ కాంగ్రెస్, శివసేనలతో పాటు వామపక్ష పార్టీలతో కలిసి చంద్రబాబు నాయుడు జాతీయ స్ధాయిలో జమిలి వ్యతిరేక పోరాటం చేసే అవకాశమూ లేకపోలేదు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరు ముందస్తుతో పాటు జమిలి ఎన్నికలకు... మరొకరు ముందు లేదు... జమిలి ఎన్నికలు అంత కంటే లేవూ అని అంటున్నారు. ఈ రెంటిలో ఏది జరిగినా తెలుగు రాష్ట్రాలు ఓడిపోయి భారతీయ జనతా పార్టీ గెలిచినట్లే. ఎందుకంటే వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టి లాభపడాలనుకుంటున్న జాతీయ పార్టీల వాంఛ తీరుతుంది. ఎటొచ్చి ఈ విషయమై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అర్ధం కావడం లేదు. పిట్ట పోరు... పిట్ట పోరు పిల్లి తీర్చినట్లు అన్న చందంగా ఉంది పరిస్ధితి.