TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పురంధేశ్వరి కాపాడే రాష్ట్ర ప్రయోజనాలేమిటి?

Published on: Sat Jul 8, 2023 12:38PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి.. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఆ  తరువాత  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను  కాపాడతానంటూ దగ్గుబాటి పురందేశ్వరి ట్విట్ చేశారు. ఆ ట్వీట్ పై ఏపీలో విస్తృత చర్చ మొదలైంది. అటు సామాజిక మాధ్యమంలోనూ.. ఇటు ప్రింట్, ఎలక్ట్రినిక్ మీడియాలోనూ కూడా పురందేశ్వరి కాపాడే రాష్ట్ర ప్రయోజనాలేమిటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్న సంగతి అందరికీ తెలిసిందే. నాటి నుంచి ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కానీ.. ఆ తర్వాత ఆ బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు కానీ...  రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు  ఏం చేశారు? ఏం సాధించారన్నది అందరికీ తెలిసిందే. వారి వల్ల రాష్ట్రానికి వీసమెత్తు ప్రయోజనం చేకూరలేదన్నది ఆంధ్రుల భావన. అలాంటి వేళ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు పురందేశ్వరి చేపట్టనుండడం... రాష్ట్రప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తాననడం ప్రాధాన్యత సంతరించుకుంది.

2014లోనే అటు రాష్ట్ర విభజన, ఇటు ఎన్నికలు కాస్తా అటు ఇటుగా జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపట్టింది. నవ్యంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకపోవడంతో.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని ఏర్పాటు కోసం అన్వేషణ.. ఆ క్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తూళ్లురు ప్రాంతాన్ని ఎంపిక చేసి.. అక్కడి 29 గ్రామాల రైతులను ఒప్పించడం.. భూమిని సమీకరించడం.. మరోవైపు ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ పనులు ఊపందుకోవడం చకచకా జరిగి పోయాయి.  అంతలోనే విభజన బిల్లులో ముందుగా స్పష్టం చేసిన అంశాల్లో.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అలాగే పలు అంశాల్లో మోదీ ప్రభుత్వం తిరకాసు పెట్టింది. వాటికి సైతం చంద్రబాబు ప్రభుత్వం ఒప్పుకొని.. ముందుకు సాగుతోన్నారు. అలాంటి తరుణంలో 2019 ఎన్నికలు  వచ్చాయి. ఆ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు.. వైసీపీ అధినేత  జగన్‌కు పట్టం కట్టారు. దీంతో ఆయన ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన కొన్ని రోజులకే.. అధికార వీకేంద్రీకరణ కోసమంటూ.. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకీ తీసుకొచ్చారు. 

దీంతో రాష్ట్ర ప్రజల్లో ఓ విధమైన అలజడి మొదలైంది. ఆ క్రమంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు రోడ్డెక్కి.. ఆందోళనలు, ధర్నాలు, పాదయాత్రలు చేపట్టారు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం.. తన పట్టు వీడలేదు. అలా జగనన్న నాలుగేళ్ల పాలనలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ఎన్ని అని అడిగినా.. పోలవరం ప్రాజెక్ట్ పనులు ఎప్పటికి పూర్తి అవుతాయి అని అడిగినా.. అన్నిటికీ ఒకటే మంత్రం అన్నట్లుగా మూడు రాజధానులు  సమాధానంతో పరిపుచ్చారు. సరే.. కార్యనిర్వాహక రాజధాని విశాఖ ,  న్యాయ రాజధాని కర్నూలులో ఎప్పటి నుంచి పనులు ప్రారంభమవుతాయన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు.  

మరి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్న వేళ.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షరాలిగా  పురందేశ్వరి బాధ్యతలు చేపట్టనున్నారు.  రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతానని అంటున్నారు. రాష్ట్రప్రయోజనాలను కాపాడటమంటే..  నవ్యంధ్రకు ఏకైక రాజధాని అమరావతి  సాధిస్తారా? అలాగే విభజన బిల్లులో స్పష్టం చేసిన అన్ని అంశాలు అమలు అయ్యే విధంగా.. అవసరమైతే మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలపై ఒత్తిడి తీసుకు వస్తారా? అలా రాష్ట్రాభివృద్ధి కోసం.. రాష్ట్ర ప్రయోజనాల కోసం.. పురందేశ్వరీ తన వంతు ప్రయత్నాలు చేసి నవ్యంధ్ర రాష్ట్రాభివృద్ధిలో తనదైన శైలిలో బలమైన  ముద్రలు వేస్తారా? అనే ప్రశ్నలు సైతం పోలిటికల్ సర్కిల్‌లో ఓ రేంజ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.